Vastu Tips: రామ చిలుకలు ఇంట్లో ఉంటే అదృష్టమా.. శాపమా.. వాస్తు శాస్త్రం చెప్తున్న ఇంట్రెస్టింగ్ విషయాలివి..
పూర్వం శ్రీ రామదాసు చిలుకను పంజరంలో బంధించడం వల్లనే కారాగారవాసానికి గురయ్యాడని చెప్తుంటారు. కానీ, ఈ రోజుల్లో మాత్రం రామ చిలుకలను ఇంట్లో పెంచుకోవడం చాలా మందికి సరదా. ఇంకొందరికి ఇదో స్టేటస్ సింబల్ కూడా. అయితే, ఇంట్లో చిలుకలు ఉంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని అంటుంటారు. ఉదయాన్నే వాటి కిలకిల శబ్దాలు వింటే రోజంతా ఏదో ఆనందంగా ఉంటుంది, కానీ, ఇంతకీ వీటిని ఇంట్లో పెంచుకోవచ్చా.. ఉంటే ఎక్కడ పెట్టాలి? దీనికి మన భారతీయ వాస్తు శాస్త్రం ఏమని చెబుతుంది అనే విషయాలు తెలుసుకుందాం..

ఇంట్లో రంగురంగుల రామచిలుకలను పెంచుకోవడం కొందరికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని చూస్తూ ఆ కిలకిలలు వింటుంటే మనసంతా ఒక్కసారిగా హాయిగా మారిపోతుంటుంది. వాటితో కాసేపు ఆటలాడితే మనం కూడా చిన్నపిల్లలమై కేరింతలు కొట్టాలనిపిస్తుంది. అయితే, వీటిని ఇంట్లో పెంచుకోవడం వల్ల దోషాలు అంటుకుంటాయని కొందరు.. వీటి వల్ల ఆ యజమానికి సంపద, లక్ కలిసి వస్తుందని మరికొందరు.. ఇలా రెండు రకాల వాదనలు వినిపిస్తుంటాయి. మరింతకీ వీటిలో ఏది నిజం.. దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాలు ఓ సారి తెలుసుకుందాం..
వాస్తు నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. చిలుకలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి దానంతట అదే వస్తుందట. వాటి రంగురంగుల రెక్కలు, చలాకీ స్వభావం ఇంటికి కొత్త ఉత్తేజాన్ని తెస్తాయి. అయితే వీటిని ఇంట్లోని కొన్ని దిశల్లో ఉంచితే మరింత మంచి ప్రయోజనాలుంటాయని చెప్తున్నారు.
ఈశాన్యం లేదా తూర్పు:
ఇవి వాస్తులో అత్యంత పవిత్రమైన దిశలు. ఇక్కడ చిలుకలను ఉంచితే ఇంట్లో సంతోషం, సమృద్ధి నడిచి వస్తాయని చెబుతారు. ఇది పెట్టడానికి బెస్ట్ స్పాట్.
నైఋతి దిశ.. దూరంగా ఉంచండి:
ఈ దిశలో చిలుకల పంజరం ఉంటే ఇంట్లో శక్తులు తారుమారై, కొంచెం గందరగోళం వచ్చే అవకాశం ఉందట. అది ఎవ్వరూ కోరుకోరు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇవి మరువొద్దు..
చిలుకలకు ఇరుకైన పంజరం, మురికి వాతావరణం అంటే ఇష్టం ఉండదు. అందుకే వాటికి విశాలంగా, శుభ్రంగా ఉండే చోటు ఇవ్వండి. వాటిని సంతోషంగా ఉంచితే, అది మీ ఇంటికి కూడా సంతోషాన్ని తెస్తుంది. కానీ, ఒక్కటి గుర్తుంచుకోండి వాటిని నిర్లక్ష్యం చేస్తే లేదా ఒకే పంజరంలో ఎక్కువ చిలుకలు పెడితే, అది ప్రతికూల శక్తిని ఆహ్వానించవచ్చు. అలా జరగకుండా చూసుకోవాలి మరి. మీరు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారా? అయితే, ఈ చిన్న చిట్కాలతో మీ ఇంట్లో చిలుకలను పెంచి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవచ్చు. అవి కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా, మీ ఇంటి శోభను, సంతోషాన్ని పెంచే స్నేహితుల్లా మారతాయి.