Tirumala: ఆకాశగంగ తీర్థ అభివృద్ధి.. ఎక్కడవేసిన గొంగడి అక్కడే…గగనంగా మారిన అంజన్న ఆలయ నిర్మాణం
తిరుమలలో హనుమ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ చేసి మూడు నెలలు దాటుతున్నా... ఇంకా పనులు ప్రారంభం కాలేదు. స్వామీజీలు, పీఠాధిపతుల సమక్షంలో అంగరంగ వైభవంగా భూమిపూజ చేసినప్పటికీ పనుల ప్రారంభంలో టీటీడీ ఆలస్యం చేస్తోంది.
తిరుమలలో హనుమ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ చేసి మూడు నెలలు దాటుతున్నా… ఇంకా పనులు ప్రారంభం కాలేదు. స్వామీజీలు, పీఠాధిపతుల సమక్షంలో అంగరంగ వైభవంగా భూమిపూజ చేసినప్పటికీ పనుల ప్రారంభంలో టీటీడీ ఆలస్యం చేస్తోంది. ఇంతకూ పనులు నోచుకోకపోవడాని గల కారణాలేంటీ? పనుల ప్రారంభంపై టీటీడీ ఏం చెబుతోంది? కోర్టు అడ్డంకులతో టీటీడీ వెనకడువేస్తోందా? పూర్తి వివరాల్లోకి వెళితే…
హనుమంతుడు తిరుమలలోని ఆకాశగంగలోనే జన్మించాడని గత సంవత్సరం శ్రీరామ నవమికి టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఏర్పాటు చేసిన పండిత పరిషత్ పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలను అధ్యయనం చేసి ఆధారాలతో ఆకాశగంగే హనుమంతుడి జన్మస్థలమని తేల్చారు. దీంతో టీటీడీ అధికారులు హనుమ జన్మస్థలంగా ఆకాశగంగ తీర్థాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కర్ణాటకకు చెందిన హనుమ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్వాహకుడు గోవిందానంద సరస్వతి టీటీడీ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటక పంపా క్షేత్రంలోని కిష్కింద క్షేత్రమే హనుమ జన్మస్థలమని వాదిస్తూ వచ్చారు. ఈ అంశంపై టీటీడీ పండితులతో చర్చకు వచ్చి వాదనలకు కూడా దిగారు. అయినప్పటికీ టీటీడీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆకాశగంగ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
హనుమ జన్మస్థల అభివృద్ధికి దాతలు ముందుకు రావడంతో టీటీడీ నిర్మాణ డిజైన్ల బాధ్యతలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి అప్పగించింది. ఆయన దాదాపు 6నెలలు శ్రమించి ఆకాశగంగలో పలు నిర్మాణాలకు ఆకర్షణీయమైన డిజైన్లు రూపొందించారు. గత ఫిబ్రవరి 16న తిరుమలలోని ఆకాశగంగ వద్ద అంగరంగ వైభవంగా స్వామీజీలు, పీఠాధిపతుల సమక్షంలో భూమిపూజ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై కొందరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా టీటీడీ అంజనాద్రిలో ఆంజనేయుడి జన్మస్థానం అభివృద్ధి పనులు చేస్తోందని పిటిషనర్ వాదించారు. దీంతో ఆకాశగంగలోని అభివృద్ధి పనుల కొనసాగింపుపై కోర్టు స్టే విధించింది. ఆకాశగంగలో కొత్తగా నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది. దీంతో ఆకాశగంగలో కొత్తగా నిర్మాణాలు చేపట్టడంలేదనీ, పర్యాటక ప్రాంతంగా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు టీటీడీ కోర్టులో తమ వాదనలను వినిపించింది. కోర్టు స్టే విధించినప్పటికీ టీటీడీ ఫిబ్రవరి 16న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వామీజీలందరూ హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రినేని నమ్ముతున్నామని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కోర్టు స్టే ఉండటంతో ఆకాశగంగ అభివృద్ధి పనులకు టీటీడీ డైలామాలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భూమి పూజ చేసి దాదాపు 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఆకాశగంగలో పనుల ప్రారంభం కాకపోవడానికి డిజైన్లు పూర్తికాకపోవడమే కారణంగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఆకాశగంగలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. వారు చెప్పినట్లు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయా? లేదా కోర్టు కేసు ముగిసే వరకు పనులు ప్రారంభం కావో వేచి చూడాల్సి ఉంది.