TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మల్టీలెవల్ కార్ పార్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..
ఏడుకొండలపై ట్రాఫిక్ సమస్య తీరబోతోంది. పుణ్యక్షేత్రంలో పార్కింగ్ సమస్యకు ఓ సొల్యూషన్ వెతికింది టీటీడీ. త్వరలోనే పనులు ప్రారంభమైతే ...భవిష్యత్తులో తిరుమలలో ట్రాఫిక్ సమస్యకో పరిష్కారం దొరకబోతోంది.
Multi-level Car Parking: తిరుమలలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల కొండపై మల్టీలెవల్ కార్ పార్కింగ్‌లు నిర్మాణానికి నిర్ణయించింది. తిరుమల, అలిపిరి మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాట్లు చేయనుంది టీటీడీ. వీటికి సంబంధించిన పనులను త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు.
శ్రీవారి దర్శనంకోసం తిరుమల కొండకు నిత్యం లక్షలమంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది దూరప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. రోజుకు 4 నుంచి 5వేలదాకా కార్లు తిరుమలకు వచ్చిపోతుంటాయి. పైగా ఇప్పుడు కోవిడ్ నిబంధనలతో చాలా మంది భక్తులు సొంతవాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఘాట్‌రోడ్డులోని అందాలని ఆస్వాదించాలన్నా సొంత వాహనాలనే ప్రిఫర్ చేస్తుంటారు. దీంతో తిరుమలకు వాహనాల రద్దీ పెరుగుతోంది. వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారుతోంది.
తిరుమలలో పార్కింగ్ కష్టాలను గుర్తించిన టీటీడీ అధికారులు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌లు ఏర్పాటు చేయబోతున్నారు. తిరుపతి అలిపిరి చెకింగ్ పాయింట్ సమీపంలో 2 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా.. రెండు ప్రాంతాల్లో మల్టీలెవల్ కార్ పార్కింగ్‌లు నిర్మించాలని టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఇంజినీరింగ్ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. తిరుమలలో రెండు మూడు ప్రాంతాల్లో.. 15వందల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలనుకుంటోంది టీటీడీ.
తిరుమలలో జీఎన్సీ, ముళ్లగుంత, శ్రీవారి సేవాసదన్ ప్రాంతాలు మల్టీలెవల్ పార్కింగ్‌కి అనువుగా ఉన్నాయని.. ఇంజినీరింగ్ నిపుణులు గుర్తించినట్లు సమాచారం. టీటీడీలో కొత్తగా నిర్మిస్తున్న పీఏసీ-ఫైవ్‌లోని సగభాగం వాహనాలు పార్కింగ్ చేసుకునేలా, మరో సగభాగం యాత్రికులకు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తిరుమలలో పార్కింగ్ సమస్య తీరితే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతారు.