Surya Grahan: భక్తులకు అలెర్ట్.. నేడు సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలు మూసివేత.. మళ్ళీ ఎప్పుడు తెరచుకోనున్నాయంటే..
నేడు సూర్యగ్రహణం.. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షేత్రాల్లోని ఆలయాలు.. ఏ సమయం నుంచి ఎప్పటి వరకూ మూసివేయనున్నారు.. మళ్ళీ ఏ సమయానికి దర్శనం ఇవ్వనున్నారు పూర్తి వివరాలోకి వెళ్తే..
ఈరోజు సాయంత్రం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సహా అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధికార్యక్రమాలను నిర్వహించి.. భక్తులకు దర్శనానికి అనుమతినివ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షేత్రాల్లోని ఆలయాలు.. ఏ సమయం నుంచి ఎప్పటి వరకూ మూసివేయనున్నారు.. మళ్ళీ ఏ సమయానికి దర్శనం ఇవ్వనున్నారు పూర్తి వివరాలోకి వెళ్తే..
తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆలయం: నేడు సూర్య గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేశారు. ఉదయం 8 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. గ్రహణం వీడగానే ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి ఆలయం తెరచుకోనున్నది. భక్తుల దర్శనానికి రాత్రి 7.30 గంటల నుండి అనుమతినివ్వనున్నారు.
ఇంద్రకీలాద్రి దుర్గగుడి: నేడు ఇంద్రకీలాద్రి పై కొలువైన కనక దుర్గగుడి ఆలయం మూసివేయనున్నారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ఆలయం ప్రధానాలయం తోపాటు ఉపాలయాలు మూసివేయనున్నామని ఆలయాధికారులు చెప్పారు. ఉదయం 11 గంటలకు అమ్మవారికి సన్నపనాభిషేకలు, మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. తిరిగి రేపు అమ్మవారి ఆలయ ద్వారాలు తెరవనున్నారు. బుధవారం ఉదయం దేవతామూర్తులకు సన్నపనాభిషేకలు, మహానివేదన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించే సుప్రభాత సేవ, ఖడ్గమాల అర్చన, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమము, రుద్ర హోమము, లక్షకుంకుమార్చన, శ్రీ చక్రనవర్చన, చండీ హోమము,శాంతి కల్యాణము మొదలైన సేవలన్నీ రద్దు చేశారు.
శ్రీశైలం మల్లన్న: ఈరోజు సాయంత్రం సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న దేవాలయం సహా.. అమ్మవారి దేవాలయ ద్వారాలను అధికారులు మూసివేయనున్నారు. సాయంత్రం 6 : 30కి మల్లన్న ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటల నుండి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నామని ఆలయ ఈవో లవన్న చెప్పారు.
ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం మూసివేశారు. సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. మళ్ళీ రేపు ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు.
భద్రాచలం రామయ్య ఆలయం: నేడు సూర్యగ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయం మూసివేయనున్నారు. ఈరోజు నిత్య కల్యాణం, సుదర్శన హోమం నిర్వహించి అనంతరం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.15 వరకు మూసివేయనున్నామని ఆలయ అధికారులు చెప్పారు. రాత్రి 7.15 ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి కార్యక్రమం, సంప్రోక్షణ, శాంతి హోమం నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..