Statue of Equality: ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిసిన సమతామూర్తి కేంద్రం.. ఘనంగా ముగిసిన సహస్రాబ్ది సమారోహం
ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహించిన సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. చివరిరోజు వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సుసంపన్నమైంది.
Statue of Equality Celebrations 2022: హైదరాబాద్(Hyderabad) మహానగర శివారులోని ముచ్చింతల్(Muchintal) మురిసిపోయింది. శ్రీరామనగరంలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. శ్రీభగవద్రామానుజాచార్యుల(Sri Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈనెల 2 న ప్రారంభమైన సహస్రాబ్ది ఉత్సవాలు 13 రోజుల పాటు అంగరంగవైభవంగా జరిగాయి. సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 5న ఆధ్యాత్మిక విప్లవ మూర్తి భగవద్రామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. సమతామూర్తిని లోకార్పణం చేశారు. ఈనెల 13న భగవద్రామానుజాచార్యుల 120 కిలోల సువర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లోకార్పణ చేశారు. చివరి రోజు సోమవారం శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు. 120 కిలోల శ్రీభగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తికి చిన్నజీయర్‌స్వామీజీ ప్రాణప్రతిష్ఠ చేశారు.
ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహించిన సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. చివరిరోజు వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సుసంపన్నమైంది. ఉదయం చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. యాగశాలలో పంచసూక్త హవనం, శాంతిహోమం.. యాగశాలకు నలుదిక్కుల మహాపూర్ణాహుతి నిర్వహించారు. దీంతో 12 రోజుల యజ్ఞం విజయవంతమైంది.
ఈనెల 3న మొదలైన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు 12 రోజులపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. యజ్ఞంలోఓ భాగంగా విశ్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైయ్యూహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి పూజలను చేశారు. ప్రతిరోజు 114 యాగశాలలో 1035 హోమకుండాల్లో 5 వేల మంది రుత్విజులు భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ మహాపూర్ణాహుతితో యజ్ఞం సుసంపన్నమైంది.
యాగశాల నుంచి సమతామూర్తి స్ఫూర్తికేంద్రం వరకు పెరుమాళ్ యాత్రను నిర్వహించారు. 120 కిలోల శ్రీభగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తికి చిన్నజీయర్‌స్వామీజీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకొచ్చి కుంభప్రోక్షణ, విశేష అభిషేకాన్ని చేశారు. చివరగా పారా గ్లైడర్లతో సమతామూర్తి విగ్రహంపై పుష్పాభిషేకం నిర్వహించారు. సువర్ణమూర్తి ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
12 రోజుల పాటు జరిగిన వివిధ హోమాల్లో 5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు, రుత్విజులను చిన్న జీయర్ స్వామి సన్మానించారు. సమతా క్షేత్రంలో 108 దివ్యదేశాల ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక దివ్యదేశాల క్షేత్రాలతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మరోవైపు, వేలాది మంది రుత్విజులకు.. ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండడంతో 108 దివ్య దేశాల కల్యాణోత్సవం వాయిదా వేశారు. ఈనెల 19 శనివారం మంచి ముహూర్తం ఉందని..ఆ రోజున వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని చిన్న జీయర్ స్వామి చెప్పారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర వైభవానికి కారణమయిన వారందరికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నట్లు చిన్న జీయర్ స్వామి చెప్పారు. 216 అడుగుల సమతామూర్తిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చివరిరోజు శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహంపై పారాచూట్ ద్వారా పూలవర్షం కురిపించడం భక్తులను ఆకట్టుకుంది.
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసేందుకు మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, భాస్కరరావు, చెల్మెడ లక్ష్మీనరసింహరావు, కేవీ చౌదరి, టీవీఎస్‌ఎన్ రాజు ఎంతో కృషిచేశారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ తెలిపారు. సహస్రాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ఎంతో శ్రమించారన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ.
12 రోజుల పాటు యజ్ఞంలో పాల్గొన్న 5 వేల మంది రుత్విజులు, యాగశాలను నిర్వహించిన ఉపద్రష్టలకు, చతుర్వేద పారాయణం చేసిన వేద పండితులకు శ్రీరామానుజాచార్యుల లాకెట్ బహూకరించి సత్కరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, సహస్రాబ్ది సమారోహం కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో తులసి పీఠాధీశ్వర్ శ్రీ రామభద్రాచార్య జీయర్ స్వామీజీ, మహామహోపాధ్యాయ శ్రీ సముద్రాల రంగరామానుజాచార్యులు, శ్రీ వెంకట రంగనాథ జీయర్ స్వామీజీ, శ్రీ రామచంద్రజీయర్ స్వామీజీ, శ్రీ దేవనాథ జీయర్ స్వామీజీ, అహోబిల రామనుజ జీయర్ స్వామీజీ . విశేషించి అందరికీ అనేకానేక మంగళాశాసనాలను అందించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. గత 20 రోజులుగా సేవలందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీ ప్రత్యేకంగా అభినందించి మంగళాశాసనాలు అందించారు.
అయోధ్య రామమందిర నిర్మాణంలో విశేష పాత్ర పోషించిన తులసి పీఠాధీశ్వర్ శ్రీరామభద్రాచార్య జీయర్ స్వామీజీ.. రామానుజాచార్యుల విశిష్టతను వివరించారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. రామానుజాచార్యుల స్ఫూర్తితో అందరూ వీలైనంత సమాజ సేవ చేయాలని సూచించారు రామభద్రాచార్యులు.