Ramanujacharya Sahasrabdi: అష్టాక్షరీ మంత్రంతో పులకరించిపోతున్న శ్రీరామ నగరి.. ఐదవ రోజు కార్యక్రమాలు ఇలా..
ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నారాయణ యజ్ఞంతో పాటు పరమేష్ఠి, వైభవేష్టి యాగలను..
Statue Of Equality: ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నారాయణ యజ్ఞంతో పాటు పరమేష్ఠి, వైభవేష్టి యాగలను నిర్వహిస్తున్నారు. యధావిధిగా భక్తి ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ నామంతో ఆధ్యాత్మిక నగరం ముచ్చింతల్ మార్మోగుతోంది. అష్టాక్షరీ మంత్రంతో పులకరించిపోతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా, వైభవంగా కొనసాగుతోంది. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ఐదో రోజు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో రెండు కీలక ఘట్టాలు కాగా.. అందులో ఒకటి రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం ఇవ్వడం. శనివారం రాత్రి ఆ ఘట్టం భక్తుల ముందు ఆవిష్కృతమైంది. కులం, మతం, విశ్వాసాల్లో నిజమైన సమానత్వాన్ని ప్రోత్సాహించాలన్న శ్రీరామానుజ బోధనలు స్మరించుకుంటూ… 216 అడుగులు ఎత్తైన సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ఈ నెల 6న రానున్న ఏపీ సీఎం..
ఈ నెల 6న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహస్రాబ్ది వేడుకలకు రానున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి లక్ష్మీ నారాయణ మహాయాగ క్రతువులో పాల్గొంటారు. ఇక ఆధ్యాత్మిక నగరిలో మొత్తం 12 రోజుల పాటు జరుగనున్న మహాక్రతువులో భాగంగా ఐదో రోజు పలు కార్యక్రమలు జరుగనున్నాయి. 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం తీవ్ర వ్యాధుల నివారణకు పరమేష్టి, విఘ్నాల నివారణకు వైభవేష్టి హోమాలు జరుగనున్నాయి.
ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామపూజ జరిగింది. తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 114 యాగశాలు, 10వందల 35 హోమకుండాలతో ముచ్చింతల్ అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది.
దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోజూ రెండుసార్లు యజ్ఞం జరుగుతుంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగే ఈ 11 రోజులూ… ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని..రోజూ కోటిసార్లు జపించనున్నారు. దీంతో.. దివ్యక్షేత్రం శ్రీరామనగరం.. నారాయణ మంత్రంతో మార్మోగుతుంది.
ఇవి కూడా చదవండి: News Watch: కేసీఆర్ అందుకే రాలేదా.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్