Srivari Brahmotsavam: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అట్టహాసంగా రథోత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. వైకుంఠం భువికి దిగివచ్చిందా అన్న చందంగా విద్యుత్ కాంతులతో తిరుమల కొండ భక్తులను కనువిందు చేస్తోంది. మరోవైపు శుక్రవారం ఉదయం.. బ్రహ్మోత్సవాలు భాగంగా రథోత్సవం నిర్వహించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో.. గోవిందానామస్మరణతో వీధులు మారుమ్రోగుతున్నాయి. స్వామివారికి కర్పూర హారతులిచ్చి… నైవేద్యాలు సమర్పించారు.
అనాది నుంచి రాజులకు రథసంచారం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల మాడ వీధుల్లో శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే ఈ రథోత్సవం ప్రసిద్ధమైంది. తిరుమాఢ వీధుల్లో రథంపై ఊరేగుతున్న శ్రీనివాసునికి భక్తితో నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ నామస్మరణ చేస్తున్నారు భక్తులు.
మరోవైపు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నారు భక్తులు. గురువారం 60వేల775 మంది శ్రీవారిని దర్శించుకోగా..రూ.3 కోట్లకుపైగా హుండీ ఆదాయం వచ్చింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..