Bhadradri Ramalayam: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ పనులు ప్రారంభం.. తలంబ్రాల తయారీకి శ్రీకారం..
Bhadradri Ramalayam: శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి రామయ్య ఆలయం సంసిద్ధమవుతోంది. అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటి...
Bhadradri Ramalayam: శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి రామయ్య ఆలయం సంసిద్ధమవుతోంది. అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 21న భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవ పనులు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ముందుగా స్థానిక చిత్రకూట మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే రుత్వికుల, అర్చకుల సతీమణులు పసుపును దంచారు. ఆ తరువాత పసుపు, కుంకుమ, నెయ్యి, అత్తర్, నూనె, బుక్కగులాలు, పన్నీర్, సుగంధ ద్రవ్యాలను కలిపి సీతారాముల కళ్యాణం కోసం తలంబ్రాలను సిద్ధం చేశారు.
కళ్యాణ మహోత్సవ పనులు ప్రారంభించిన తొలి రోజున నాలుగు క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. ఇంకా దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతారు. ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో మహిళా భక్తులు భద్రాద్రికి వచ్చారు. గోటి తలంబ్రాలను శిరస్సుపై ధరించి రామయ్య ఆలయానికి తీసుకువచ్చారు. ఇక, ఫాల్గుణ పూర్ణిమిని పురస్కరించుకుని ఆదివారం నాడు భద్రాద్రి రామయ్యకు వసంతోత్సవం, డోలోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీరామునికి విశేష స్నపనం ఆచరించారు. అనంతరం సాయంకాలం సీతారామ లక్ష్మణ స్వామి వార్ల ఉత్సవమూర్తులకు తిరువీధి సేవ నిర్వమించారు.
ఇదిలాఉంటే.. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భద్రాద్రికి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా భక్తులు లేకుండానే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఈసారి భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలు గుమి కూడకుండా ఆంక్షలు విధిస్తున్నాయి. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు భక్తుల సమక్షంలో జరుగుతాయా? లేక గతేడాది మాదిరిగానే ఆలయ అర్చకులు, వేద పండితలు, అధికారులు సమక్షంలోనే జరుగుతాయా? అనేది ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Also read:
73 ఏళ్ల వయసులో ‘వరుడు కావలెను’ అంటూ ప్రకటన ఇచ్చిన బామ్మ.. ఒంటరిగా ఉండలేకపోతున్నానంటున్న వద్ధురాలు