Yadadri Temple: మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్ ..
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి సర్వం సిద్ధమయింది. ఈ మహా క్రతువుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. యాదాద్రి ప్రధానాలయం స్వర్ణ శోభితంగా మారింది. మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం..
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి(Yadadri) సర్వం సిద్ధమయింది. ఈ మహా క్రతువుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (CM KCR) హాజరుకానున్నారు. యాదాద్రి ప్రధానాలయం స్వర్ణ శోభితంగా మారింది. మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఆరేళ్లుగా ఎదరు చూస్తున్న యాదాద్రి నరసింహుని దివ్వదర్శనం మరి కాసేపట్లో భక్తులకు కలుగనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా సోమవారం పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది.
ఈ మహా క్రతువుకు సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ మహా సంప్రోక్షణ మహోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
కన్నులపండువగా పంచశయ్యాధివాసం
పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం కన్నులపండువగా జరిగాయి. శాస్ర్తోక్తంగా 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. కలశాల్లో పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలను నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ, విష్వక్సేన, ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో షోడశకళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం పర్వాలను నిర్వహించినట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం కొనసాగింది.
నేటి కార్యక్రమాలు ఇలా..
- ఉదయం 7.30 గంటల నుంచి: నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి
- ఉదయం 9 గంటలకు: మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిథున లగ్న పుష్కరాంశమున గర్తవ్యాసము, రత్నవ్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం.
- ఉదయం 10 గంటలకు: బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర
- మధ్యాహ్నం 11.55 గంటలకు: మిథునలగ్న సుముహూర్తాన మహా కుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి
- సాయంత్రం 6 గంటలకు: శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం.
ఈ మహోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 400 సీసీ కెమెరాలు, మూడు వేల పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశామన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.
సీఎం కేసీఆర్ తో సహా ప్రముఖులు సంప్రోక్షణ మహోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. కొండపై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి: Telangana Paddy Politics: తెలంగాణలో వరి ధాన్యం సేకరణ రచ్చ.. ఉగాది తరువాత యుద్ధమే అంటున్న రాష్ట్ర సర్కార్..!