Srisailam Temple: శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు.. ఏడవరోజు అశ్వవాహనంపై దర్శనమిచ్చిన శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు

Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రంలో ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

  • Shiva Prajapati
  • Publish Date - 9:08 am, Mon, 18 January 21
Srisailam Temple: శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు.. ఏడవరోజు అశ్వవాహనంపై దర్శనమిచ్చిన శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు

Srisailam Temple:  దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీశైలం మహాక్షేత్రంలో ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజున శ్రీభ్రమరాంబా దేవి సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శమిచ్చారు. దీనికి ముందు ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపానికి తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం పూజలు చేశారు. ఈ పుష్పోత్సవం సందర్భంగా ఎర్రగులాబీలు, తెల్లగులాబీలు, పసుపు గులాబీలు, ఎర్రమందారం, తెల్ల మందారం, ముద్ద మందారం, నంది వర్ధనం, గరుడ వర్ధనం, కనుకంబరాలు, సుగంధాలు, పసుపు చేమంతి, మొదలైన 18 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించడం జరిగింది.

ఆ తరువాత అరటి, తెల్లద్రాక్ష, నల్ల ద్రాక్ష, దానిమ్మ, కమల, యాపిల్, ఫైనాపిల్, జామ, ఖార్జురం, మొదలైన 9 రకాల ఫలాలు కూడా స్వామిఅమ్మవార్లకు నివేదించారు అర్చకస్వాములు. ఇక ఈ పూజా కార్యక్రమాల అనంతరం.. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంలో ఆశీనులను చేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులకు ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణలు చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో ఆలయ ప్రాంగణం కనువిందు చేసింది.

Also read:

Corona Virus: ఆ మాస్క్‌లతో ఏకంగా ఓ ఫుట్‌బాల్ స్టేడియంనే నింపొచ్చట.. నివ్వెరపోయే అంశాలు చెప్పిన నిపుణులు..!

Andhra Pradesh High Court: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడు విచారణ.. ధర్మాసనం స్పందనపై తీవ్ర ఉత్కంఠ..