AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda Sashti: నేడు స్కంద షష్ఠి.. కుజ దోషం, నాగ దోష నివారణకు.. సంతానం కోసం కార్తికేయుడిని ఇలా పూజించండి..

కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే అని నమ్మకం. అందుకనే స్కంద షష్ఠి రోజున శివపార్వతుల తనయుడు సుభ్రమన్యస్వామిని పూజిస్తారు. ఈ రోజు చేసే వ్రతం కార్తికేయ భగవానుడికి అంకితం చేయబడింది. విశ్వాసాల ప్రకారం కార్తికేయుడు రాక్షసులను సంహరించి లోకాలను రక్షించడానికి జన్మించాడు. స్కందుడిని పూజించడం ద్వారా జీవితంలో వచ్చిన కష్టాల నుండి ఉపశమనం పొంది జీవితం ఆనందంగా ఉంటుంది.

Skanda Sashti: నేడు స్కంద షష్ఠి.. కుజ దోషం, నాగ దోష నివారణకు.. సంతానం కోసం కార్తికేయుడిని ఇలా పూజించండి..
Skanda Sashti
Surya Kala
|

Updated on: Nov 07, 2024 | 8:22 AM

Share

ప్రతి నెల శుక్ల పక్ష షష్ఠి తిథి రోజున స్కంద షష్ఠి ఉపవాసం పాటిస్తారు. శివ పార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం దేవతల సేనాధిపతి అయిన కార్తికేయుడిని ఆరాధించడానికి, ఆశీర్వాదం పొందడానికి స్కంద షష్ఠి పవిత్రమైన రోజు అని పురాణాల స్వస్తి. కార్తికేయుడిని కుమార స్వామీ, షణ్ముఖుడు, స్కందుడు వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. అందుకే షష్ఠి తిథి రోజున చేసే ఉపవాసాన్ని స్కంద షష్ఠి లేదా కుమార్ షష్ఠి ఉపవాసం అని కూడా అంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి పూజలు చేసి వ్రతం చేస్తారు. సంతానం కోసం.. పిల్లల క్షేమంతో పాటు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలకు, కోరిన కోర్కెలు నెరవేర్చుకోవడానికి స్కంద షష్ఠి ఉపవాసం ఆచరిస్తారు.

స్కంద షష్ఠి వ్రతానికి శుభ ముహూర్తం

దృక్ పంచాంగ్ ప్రకారం స్కంద షష్ఠి పూజ కోసం కార్తీక మాసం శుక్ల పక్ష షష్ఠి తిథి నవంబర్ 7వ తేదీ గురువారం తెల్లవారుజామున (ఉదయం) 12:41 గంటలకు ప్రారంభమవుతుంది.. నవంబర్ 8 శుక్రవారం తెల్లవారుజామున 12:34 am ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో.. ఉదయ తిథి ప్రకారం స్కంద షష్ఠి పండుగను నవంబర్ 7వ తేదీ గురువారం అంటే ఈ రోజు జరుపుకోవాలి.

స్కంద షష్ఠి పూజ విధి

స్కంద షష్ఠి వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, స్కంద భగవానుని ధ్యానించి, ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. ప్రార్థనా స్థలాన్ని శుభ్రపరచండి. స్కంద భగవానుని విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. ఇప్పుడు ధూపం, దీపం వెలిగించి, గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో స్వామికి అభిషేకం చేయండి. అనంతరం గంధం, అక్షత, పుష్పాలు మొదలైన వాటిని దేవుడికి సమర్పించి “ఓం స్కందాయ నమః” అనే మంత్రాన్ని జపించండి. ఇప్పుడు షష్ఠి కవచాన్ని పఠించండి. కార్తికేయ భగవానుని హారతి ఇవ్వాలి. తరువాత దేవునికి ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించి.. పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించమని వేడుకోవాలి. కోరికలు నెరవేర్చమని భగవంతుడిని పూర్తి శ్రద్ధాసక్తులతో ప్రార్థించండి. సాయంత్రం మళ్లీ ఆరతి ఇచ్చి పూజ చేసి మర్నాడు అంటే శుక్రవారం పూజ చేసి ఉపవాసం విరమించాలి.

ఇవి కూడా చదవండి

స్కంద షష్ఠి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.

స్కంద షష్ఠి వ్రతం రోజున రోజంతా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున పండ్లు తప్ప మరేదీ తినవద్దు, ఇది ఉపవాస నియమం. స్కంద షష్ఠి వ్రతం రోజున మాంసాహారం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోవద్దు. మర్నాడు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఈ ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. స్కంద షష్ఠి వ్రతాన్ని సూర్యోదయ సమయంలో మాత్రమే జరుపుకోవాలి.

స్కంద షష్ఠి వ్రత ప్రాముఖ్యత

స్కంద షష్ఠి ఉపవాసం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఈ ఉపవాసం శివపార్వతుల కుమారుడు కార్తికేయ (స్కంద)కి అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, శత్రువులపై విజయం, ఆరోగ్యం, సంపదలు లభిస్తాయని విశ్వాసం. సంతానం పొందాలనుకునే వారికి ఈ వ్రతం చాలా ముఖ్యం. ఈ వ్రతానికి దక్షిణ భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ స్కంద షష్టి రోజున చేసే పూజలతో కార్తికేయ భగవానుని అనుగ్రహం లభించి జీవితంలో ఆటంకాలు నశించి విజయం సాధిస్తారు. విశ్వాసం ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తులు చేసిన పాపాలు తొలగి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం.

ఎవరు పూజించాలంటే

జాతకంలో కుజ దోషం ఉన్నవారు, నాగ దోషం, కాల సర్ప దోషం, సంతానం కలగని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు , దాంపత్యంలో సమస్యలున్నవారు, భూమికి సంబంధించిన సమస్యలున్నవారు, సంతానం ఉన్నతి కోరుకునే వారు  స్కంద షష్టి రోజున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఫలవంతం అని విశ్వాసం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం లేదా హోమము జరిపిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.

 మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.