AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandanotsavam Controversy: సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం వివాదం.. కలెక్టర్‌ విచారణ..

ఒకవైపు పోలీసులు మరొకవైపు దేవాదాయ శాఖ అధికారులు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఏం చేయాలో పాలు పోక జాయింట్ కలెక్టర్ ఒక నివేదికని కలెక్టర్‌కి ఇచ్చారట అయితే కలెక్టర్ దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కూడా కలెక్టరే కావడంతో..

Chandanotsavam Controversy: సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం వివాదం.. కలెక్టర్‌ విచారణ..
Simhachalam
Jyothi Gadda
|

Updated on: May 06, 2023 | 8:55 PM

Share

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం అంటే ఆ ప్రాంతంలో పెద్ద పండగే. ఏడాదిలో ఆ ఒక్క రోజే శ్రీ వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం కావడంతో లక్షలాదిగా భక్తులు అప్పన్న కొండకు తరలివస్తారు. ప్రభుత్వాలు కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజుగా భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేపడతాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే సందర్భం కాబట్టి రెవెన్యూ, పోలీస్, ఫైర్, పురపాలక, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, లాంటి అనేక డిపార్ట్‌మెంట్ల సహకారంతో దేవాదాయ శాఖ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. అయితే ఈ సారి చందనోత్సవంలో తీవ్ర గందరగోళం, సమన్వయలోపం కనిపించింది. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు శారదాపీఠాధిపతి స్వరూప నందయేంద్ర స్వామికి కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇక సాధారణ భక్తుల పరిస్థితి చెప్పనలవి కాలేదు. కొంతమందికి దర్శనం పూర్తయ్యేసరికి 10 గంటల పైన సమయం కూడా పట్టింది.

ఇక అంతరాలయ దర్శనాల గందరగోళం అయితే అంతా ఇంతా కాదు. అసలు అంతరాలయ దర్శనం ఇవ్వద్దని ట్రస్ట్ బోర్డు సభ్యులు ముందు మొత్తుకున్నా అటు దేవాదాయ శాఖ కాని ఇటు ఆధిపత్యాన్ని చలాయించే రెవెన్యూ శాఖ కానీ కనీసం పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ల ముద్రణ విషయంలోనూ పెద్ద గందరగోళమే జరిగింది. గత ఏడాది 5 వేల అంతరాలయ పాసులు ఇస్తే.. ఈసారి 6000 అని చెప్పి 20వేలకు పైగా వాటిని ముద్రించారని తెలుస్తోంది. దీని కారణంగానే గందరగోల పరిస్థితి ఏర్పడి భక్తులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు తీరుపై పోలీసులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారట. అసలు దేవస్థాన కార్య నిర్వహణ అధికారి అంతరాలయం లోపలే ఉండి రాజకీయ నాయకులకు దర్శనాలు చేయిస్తూ ఆగిపోవడం వల్ల బయట గందరగోల పరిస్థితులు ఏర్పడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 వేలకు పైగా అంతరాలయ దర్శన పాసులతో భక్తులు దర్శనానికి వచ్చారు. వారిని లోపలికి పంపే ముందు.. చించి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఎండోమంట్ అధికారులది. కానీ వాళ్లు ఆ పని చేయకపోవడం వల్ల.. అదే టికెట్లతో మళ్లీ మళ్లీ జనం దర్శనానికి వచ్చారని ఇదే ప్రధాన కారణం అన్నది పోలీసుల వాదన. అసలు అంతరాలయ పాసుల కోసం ముద్రించిన వాటిలో అనేకం నకిలీవి ఉన్నాయని అందులో పెద్ద స్కాం జరిగినట్టుగా ఉందన్నది పోలీస్ అధికారుల అనుమానం. అయితే దానిపై విచారణ చేయాలన్నా దేవాదాయ శాఖ మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ దేవాలయ శాఖ అలాంటి ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరొకవైపు పోలీసుల్నే బ్లేమ్ చేస్తూ ఉండడంతో దీన్ని సుమోటాగా తీసుకుని అయినా విచారించరించాలన్న ఆలోచనలో పోలీస్ అధికారులు ఉన్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఒకవైపు పోలీసులు మరొకవైపు దేవాదాయ శాఖ అధికారులు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఏం చేయాలో పాలు పోక జాయింట్ కలెక్టర్ ఒక నివేదికని కలెక్టర్‌కి ఇచ్చారట అయితే కలెక్టర్ దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కూడా కలెక్టరే కావడంతో ఈ వైఫల్యానికి ఆయన కూడా బాధ్యత వహించాలని ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..