Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiv Khori: దేవలోకానికి దారి చూపే గుహాలయం.. ఎన్నో రహస్యాలకు అదే నిలయం..

అనంత విశ్వాలకు ఆవల, గాఢాంధకారానికి అవతల అఖండమైన రూపంతో దేదీప్యమానంగా ప్రకాశించే దేవుడే పరమేశ్వరుడు. ఆయన సర్వేశ్వరుడు..

Shiv Khori: దేవలోకానికి దారి చూపే గుహాలయం.. ఎన్నో రహస్యాలకు అదే నిలయం..
Shivkori 1
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 7:56 PM

అనంత విశ్వాలకు ఆవల, గాఢాంధకారానికి అవతల అఖండమైన రూపంతో దేదీప్యమానంగా ప్రకాశించే దేవుడే పరమేశ్వరుడు. ఆయన సర్వేశ్వరుడు.. సర్వాంతర్యామి. మనిషి చేరుకోలేని సంక్లిష్టమైన స్థలాలలో కూడా శివుడు కొలువై ఉంటాడు. జమ్మూలోని శివఖోరి గుహాలయం ఇంచుమించు ఇలాంటిదే! ఎంతో కష్టపడితే కానీ గంగాధరుడి సన్నిధికి చేరుకోలేం! స్వర్గలోకానికి దారంటూ ఉంటుందా..? ఆ దారంట వెళితే బొందితో స్వర్గానికి చేరుకోవచ్చా..? దేవలోకానికి దారి చూపే గుహాలయం ఎక్కడుంది..? ఆ మార్గం ద్వారా వెళ్లినవాళ్లు ఎందుకు తిరిగి రాలేదు..? నిజంగానే స్వర్గానికి వెళ్లారా? లేక మధ్యలోనే మృత్యువు చేత చిక్కారా ? ఆ దారి అంత భయంకరంగా ఉంటుందా ? ఎన్నో ప్రయాసాలకోర్చి భక్త జనం అక్కడికి ఎందుకు వెళతారు..? పరమశివుడు అక్కడ ఎందుకు కొలువై ఉన్నాడు..?

శివఖోడి. కశ్మీరిలో ఖోడి అంటే గుహ. శివుడు నివాసం ఉంటున్న గుహ కాబట్టే దీనికి శివఖోడి అన్న పేరు. జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో రణసు అన్న గ్రామంలో ఓ అద్భుత గుహాలయంలో మహాశివుడు వెలిశాడు. కాలినడకన నాలుగు కిలోమీటర్లు వెళితే కానీ ఈ గుహ ప్రాంతానికి చేరుకోలేము. జమ్ము నుంచి ఈ గుహాలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. వైష్ణోదేవి గుడికి ట్రెక్‌ మొదలయ్యే కట్రా టౌన్‌ మీదుగా వెళ్లవచ్చు.. అఖనూర్‌ మీదుగా రాజోరి వెళ్లేదారిలో ఖండామోర్హా జంక్షన్‌ నుంచి కూడా రణసు గ్రామానికి చేరుకోవచ్చు. వైష్ణోదేవి ఆలయ ట్రస్ట్‌ ఈ మాత్రం రోడ్లన్నా వేసింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఈ గుహలను చేరుకోవడం దుర్లభమయ్యేది. కట్ర నుంచి రణసుకు వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డులోనే ప్రయాణించాలి.. అసలు ఈ ప్రయాణమే ఆహ్లాదకరంగా ఉంటుంది. రణసు పట్టణం కూడా కాదు. చిన్న గ్రామం. ఇక్కడ నుంచి గుహ వరకు నాలుగు కిలోమీటర్ల నడక దారి. చాతకాని వాళ్లు గుర్రాల మీద వెళ్లవచ్చు. డోలీలు కూడా దొరుకుతాయి. ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. గుహలోని అంతర్భాగం విశాలంగా ఉంటుంది. ఒకేసారి 300 మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేంత విశాలంగా ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి పాక్కుంటూ వెళ్ళవలసి వుంటుంది . కొన్ని చోట్లయితే పొట్ట నెలకు ఆనించి పాకవలసి ఉంటుంది. అలా ఎంతో కష్టపడి వెళితే వెడల్పాటి గుహ వస్తుంది.

అక్కడంతా అద్భుతమే.! అక్కడి దృశ్యాలను చూసి ఆశ్చర్యానందభరితులమవుతాం! జగన్మాత పార్వతీదేవి. వినాయకుడు. నారదుడు. పరమశివుడి ఝటాఝూటం. పద్మం ఇలా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన దేవిదేవతా మూర్తులు గోచరిస్తాయి. చేతికందేంత ఎత్తులో బహు పడగల ఆదిశేషుడిని దర్శించుకోవచ్చు. అక్కడ్నుంచి కొంతదూరం లోపలికి వెళితే. రెండు మార్గాలు వస్తాయి.. అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్లు యాత్రీకులను రెండో దారిలోంచి పంపుతారు.. మొదటిదారి నిషిద్ధం. 200 మీటర్ల పొడవు.. మూడు మీటర్ల ఎత్తు. ఒక మీటర్‌ వెడల్పు ఉఉన్న ఈ గుహలో ఊపిరి తీసుకోవడం కాసింత కష్టమే అవుతుంది.. శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత కష్టపడి ఎందుకు వెళ్లడం అని అనుకోవచ్చు. వెళ్లకపోతే ఓ శివ దర్శనం ఎలా అవుతుంది.? లోపలికి వెళితే నాలుగు అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగం కనిపిస్తుంది.. ఆ లింగాన్ని నిరంతరం అభిషేకిస్తున్న పాలరంగులో ఉండే జలధార విస్మయానికి గురి చేస్తుంది. ఆ క్షీరధారనే ధూద్‌గంగ అంటారు. పరమశివుడి దర్శనం తర్వాత అంతసేపు పడిన కష్టమంతా దూదిపింజలా ఎగిరిపోతుంది.

అసలు శివుడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు ? స్థలపురాణం ఏం చెబుతుంది ? మీకు భస్మాసురుడి వృత్తాంతం తెలిసే ఉంటుంది. అతడు శివభక్తుడు. మరణం లేకుండా ఉండాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేస్తాడు. భస్మాసుడికి తపస్సుకు మెచ్చిన శివుడు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం అయ్యేట్టు వరం అనుగ్రహించమంటాడు. శివుడు తథాస్తూ అంటాడు. శివుడు ఇచ్చిన వరప్రభావాన్ని శివుడిపైనే ప్రయోగించి చూడాలనుకుంటాడు భస్మాసురుడు. శివుడు భస్మాసురుడిని తప్పించుకుని పారిపోతూ ఈ గుహలో దాక్కున్నాడట! మిగతా కథ మనకు తెలిసిందే! ఇదీ ఇక్కడి స్థల పురాణం. ఈ గుహ నుంచి రెండు సొరంగ మార్గాలున్నాయి. ఒక దారేమో నేరుగా స్వర్గానికి చేరుస్తుంది. అమరలోకానికి చేరుకోవాలన్న కోరికతో కొంతమంది ప్రయత్నించారట కూడా! అయితే వారెవ్వరూ వెనక్కి తిరిగి రాలేదట! అందుకే ఎవరూ సాహసం చేయరు. ఇంకో మార్గం కూడా ఉంది. ఆ దారంట నడిచి వెళితే అమర్‌నాథ్‌ ఆలయానికి చేరుకోవచ్చట! కొంతమంది సాధువులు ఈ ప్రయత్నం కూడా చేశారట! ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని కూడా మూసివేశారు. ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పున్నమి వరకు జరిగే అమర్‌నాథ్‌లో పూజలందుకునే శివుడు మిగతా సమయంలో ఈ గుహలోనే ఉంటాడన్నది స్థానికుల విశ్వాసం.. అందుకే కాబోలు ఈ క్షేత్రాన్ని బూఢా అమర్‌నాథ్‌ అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో మరో అద్భతం పావురాళ్లు. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించని కపోతాలు కేవలం ఈ గుహలోనే దర్శనమిస్తాయి. ఎన్నో ఎళ్ల నుంచి ఈ పావురాళ్ల సంఖ్య అంతే ఉండటం కూడా ఆశ్చర్యకరం. అమర్‌నాథ్‌లాగే ఇక్కడ కూడా రెండు అదృశ్య పావురాళ్లు ఉంటాయట! పుణ్యం చేసినవారికి మాత్రమే అవి దర్శనం ఇస్తాయట! నాలుగు దశాబ్దాల కిందట శివఖోడి కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు.. ఇప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మహాశివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది.

Shivkori