Maha Shivaratri: మనిషి కనిపించని మహారణ్యంలో వెలిసిన పురాతన శైవక్షేత్రం.. కోటి శిల్పాల మహాద్భుతం

అది దేవలోకానికి మార్గమంటారు కొందరు. కాదు, శివుడు నడయాడిన మార్గమంటారు మరికొందరు. మహాద్భుతం అంటారు చరిత్రకారులు...

Maha Shivaratri: మనిషి కనిపించని మహారణ్యంలో వెలిసిన పురాతన శైవక్షేత్రం.. కోటి శిల్పాల మహాద్భుతం
Shiva Temple 1
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 7:57 PM

అది దేవలోకానికి మార్గమంటారు కొందరు. కాదు, శివుడు నడయాడిన మార్గమంటారు మరికొందరు. మహాద్భుతం అంటారు చరిత్రకారులు. ఎవరెమన్నా ఉనకోటీశ్వర కాలభైరవుడి ఆలయం మాత్రం విస్మయానందకరం! ఆ ఆలయం ఎక్కడుందో…? స్థలపురాణమేమిటో..? నిజంగానే దేవలోకానికి దారి ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం! మనిషి కనిపించని మహారణ్యమది! ఆ భీకరారణ్యం చుట్టూ పర్వతాలు.. గలగలమని పారే సెలయేళ్లు….అక్కడికి వెళ్లడం అంత సులభం కాదు.. కష్టపడుతూ వెళ్లాలి.. ప్రాణాలు గుప్పిట పెట్టుకుని పయనించాలి.. అప్పుడు మనకు అత్యంత పురాతన శైవక్షేత్రం దర్శనమిస్తుంది… అది మామూలు క్షేత్రం కాదు… అద్భుతమైన ఆలయం…ఆ ఆలయం పరిసరప్రాంతమంతా శిల్పాలమయం.. అడుగడుగునా ఓ అందమైన శిల్పం…

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఉంది ఉనకోటి.. ఈ ఉనకోటిలోనే ఈ కోటి శిల్పాలు ఉన్నాయి.. బెంగాలీలో ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం! ఎవరు ఎప్పుడు ఎందుకు చెక్కారో తెలియదు కానీ… ఆ ఆకృతులన్నీ కనువిందు చేస్తాయి.. అవి మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తాయి.. ఈ శిల్పాలేమిటి..? ఎందుకిలా ఉన్నాయి..? అన్నదానికి స్థానికులు ఓ పురాణకథను చెప్పుకొస్తారు.. ఓసారి కోటిమంది దేవతలతో కలిసి పరమశివుడు కైలాసానికి బయలదేరాడు.. మార్గమధ్యంలో ఇక్కడ ప్రకృతిసోయగానికి సమ్మోహితుడై కాసేపు విశ్రమించాలనుకున్నాడు.. దేవతల మనస్సులోనూ ఇదే ఉంది.. రాత్రి ఇక్కడ బస చేసి పొద్దున్నే ప్రయాణం కొనసాగించాలనుకున్నారంతా..! సూర్యోదయానికి ముందే ఇక్కడి నుంచి బయలుదేరాలని.. లేకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవలసి వస్తుందని శివుడు హెచ్చరిస్తాడు.. బడలిక కారణంగా దేవతలు గాఢనిద్రలోకి జారుకుంటారు.. సూర్యోదయమవుతుంది కానీ దేవతలు మాత్రం నిద్రలేవరు.. శివుడికి కోపం వస్తుంది.. శిలలై పడి ఉండండని దేవతలను శపిస్తాడు.. అలా శిలలుగా మారిన దేవతలే ఈ శిల్పాలు..

Shiva Temple

ఇంకో కథ కూడా ఉంది. అప్పట్లో కల్లు కంహార అనే గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శక్తి ఉపాసకుడు.. ఓ రోజు శివగణాల సమేతంగా శివపార్వతులు ఈ మార్గం నుంచి వెళుతున్నారు.. విషయం తెలుసుకున్న కంహార…మీతో పాటు నేనూ వస్తానని ఆది దంపతులను వేడుకుంటాడు.. పరమేశ్వరుడు అందుకు అంగీకరించడు. పార్వతి మాత్రం ఓ కండిషన్‌ పెడుతుంది.. తెల్లారేసరికి కోటి శిల్పాలు చెక్కగలిగితే శివుడిని ఒప్పిస్తానని చెబుతుంది.. కంహార అనందంతో శిల్పాలు చెక్కడం మొదలుపెడతాడు.. తెల్లవారుతుంది.. అంత కష్టపడినా కంహార కోటి శిల్పాలను చెక్కలేకపోతాడు.. కోటికి ఒకటి తక్కువవుతుంది.. దాంతో శివుడు ఆయనను కైలాసానికి తీసుకెళ్లడు.. బొందితో కైలాసానికి వెళ్లాలనుకోవడం తప్పు కదా! అందుకే శివుడు పర్మిషన్‌ ఇవ్వడన్నమాట!

కథల సంగతి అలా ఉంచితే.. ఉనకోటిలోని శిల్పాలన్నీ ఎత్తయినవే! ఒక్కోటి 30 నుంచి 40 అడుగుల ఎత్తు ఉంటాయి.. అదేమిటోకానీ అన్నీ అసంపూర్తిగానే ఉంటాయి.. విగ్రహాల ముఖకవళికలు అక్కడి గిరిజనుల మోములను పోలి ఉంటాయి.. అలంకరణ కూడా అలాగే ఉంటుంది.. ఈ పర్వత ప్రాంతంలో ప్రతి చోటకు వెళ్లడానికి ఎగుడుదిగుడుగా.. అడ్డదిడ్డంగా మెట్లు ఉన్నాయి.. పర్వతాలను కలుపుతూ వంతెనలు కూడా ఉన్నాయి. ఇక్కడ వెలిసిన శివుడికి ఉనకోటీశ్వర కాలభైరవుడని పేరు! దాదాపు 30 అడుగు ఎత్తులో శివుడి విగ్రహం ఉంటుంది.. ఆ ఈశ్వరుడి తలే పది అడుగులు ఉంటుంది.. శివుడికి ఓవైపు సింహవాహిని అయిన పార్వతీదేవి.. మరోవైపు గంగ ఉంటారు. శివుడి పాదాల చెంత మూడు పెద్ద పెద్ద నంది విగ్రహాలు భూమిలో కూరుకుపోయినట్టు కనిపిస్తాయి.. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో ఇక్కడో పెద్ద ఉత్సవం జరుగుతుంది. అశోకాష్టమిగా జరుపుకునే ఈ వేడుకకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు.