AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu-2026: లష్కర్ బోనాల జాతర షురూ.. మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

హైదరాబాద్ మహానగరంలో లష్కర్ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. ఆదివారం (ఆగస్టు 02) తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో కళకళలాడుతున్నాయి.

Balaraju Goud
|

Updated on: Aug 02, 2026 | 8:43 AM

Share

హైదరాబాద్ మహానగరంలో లష్కర్ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. ఆదివారం (ఆగస్టు 02) తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ట్రాఫిక్ ఆంక్షలు, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాఢ మాస లష్కర్ బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు వేపాకులు, పసుపు, కుంకుమ, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుని అమ్మవారికి సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. వర్షాలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా 175 బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్, చార్మినార్, మెహిదీపట్నం, అల్వాల్, కుషాయిగూడ తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచింది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, ప్యారడైజ్, పట్నీ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉన్నాయి. భక్తుల వాహనాల కోసం 14 ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు.

ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతం విద్యుత్ దీపాలంకరణలతో, తాత్కాలిక దుకాణాలు, పూల స్టాళ్లు, పిల్లల వినోద కార్యక్రమాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఊరేగింపు వాహనాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే సోమవారం (ఆగస్టు 03) అమ్మవారి రంగం కార్యక్రమంలో వెల్లడయ్యే భవిష్యవాణిపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలు ప్రశాంతంగా, వైభవంగా కొనసాగాలని భక్తులు కోరుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ, అధికారుల సూచనలు అనుసరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us