Makara Jyothi 2023: శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. శరణు ఘోషతో మారుమోగిన శబరిగిరులు
శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగాయి. మకర జ్యోతి దర్శనంతో భక్తకోటి తరించింది. మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల పొన్నాంబలమేడుపై మూడుసార్లు జ్యోతి కనిపించింది..
శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగాయి. మకర జ్యోతి దర్శనంతో భక్తకోటి తరించింది. మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల పొన్నాంబలమేడుపై మూడుసార్లు జ్యోతి కనిపించింది. ఏడాడికి ఒకసారి అయ్యప్ప స్వాములు ఎంతో భక్తితో దర్శించుకునే మకర జ్యోతిని వీక్షించేందుకు ఈసారి లక్షలాదిగా వచ్చారు. కరోనా తర్వాత ఆంక్షలు లేకుండా ఈ ఏడాదే జ్యోతి దర్శనం ఉండటంతో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు శబరిమల చేరుకున్నారు.
సరిగ్గా సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు పొన్నాంబలమేడు నుంచి మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇచ్చింది. ఆ సమయంలో శబరిగిరులు అయ్యప్ప శరణ ఘోషతో మారుమోగాయి. అంతకు ముందు 18 మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అయ్యప్పకు తిరువాభరణాలను అలకరించారు. అలంకరణ తర్వాత మణికంఠుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సన్నిధానంలో హారతి ఇవ్వగానే పొన్నాంబల మేడుపై జ్యోతి కనిపించింది. ఈసారి జ్యోతి దర్శనానికి లక్షలాదిగా స్వాములు తరలిరావడంతో నీలక్కల్, పంబ, శబరిగిరులు భక్తజనసందోహంగా మారాయి.
ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని గస్తీ నిర్వహించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి