ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
మన ఇంటి బాల్కనీలోనో, కిటికీ మూలనో పావురాలు నిశ్శబ్దంగా వచ్చి గూడు కట్టుకుంటాయి. అయితే ఆ పావురం అక్కడ గుడ్లు పెట్టినప్పుడు మాత్రం మనసులో ఒక రకమైన సందిగ్ధత మొదలవుతుంది. అది మన ఇంటికి అదృష్టాన్ని తెస్తుందా? లేక ఏదైనా అశుభానికి సంకేతమా? అని చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీన్ని గురించి ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహారాజ్ ఏమన్నంటే..?

మన ఇళ్లలో ఏదో మూలన లేదా బాల్కనీల్నో పావురాలు గూడు కట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కొద్దిరోజులకే అవి అక్కడ గుడ్లు కూడా పెడతాయి. అయితే చాలామంది దీనిని ఒక సాధారణ విషయంగా వదిలేస్తే, మరికొందరు మాత్రం ఇది ఇంటికి మంచిదా కాదా అని ఆందోళన చెందుతుంటారు. అసలు ఇంట్లో పావురం గుడ్లు పెట్టడం దేనికి సంకేతం? ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
శుభ శకునంగా భావించేవారు ఏమంటారు?
భారతీయ సంప్రదాయంలో పావురాలను లక్ష్మీదేవికి చిహ్నంగా కొందరు భావిస్తారు. ఈ నేపథ్యంలో పావురం ఇంట్లో గుడ్లు పెట్టడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి దక్షిణ దిశలో లేదా బాల్కనీలో పావురం గుడ్లు పెడితే, అది ఆర్థిక స్థితి మెరుగుపడటానికి, చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి సంకేతమని నమ్ముతారు. పావురాలు ఉన్నచోట శాంతి ఉంటుందని, అవి గుడ్లు పెట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. ఇది జీవితంలో సుఖసంతోషాలకు దారితీస్తుందని వారి నమ్మకం.
అశుభమని భావించే వారి వాదన ఏంటి?
మరోవైపు పావురం గూడు కట్టడాన్ని అశుభంగా చూసే వారు కూడా ఉన్నారు. వారి నమ్మకాల ప్రకారం.. ఇంట్లో పావురం గూడు కడితే ఆ ఇల్లు అస్థిరంగా మారుతుందని, కుటుంబ సభ్యుల పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయని కొందరు భావిస్తారు. ఇది రాబోయే అప్పులు లేదా కుటుంబ కలహాలకు సంకేతమని, శ్రేయస్సు తగ్గుతుందని అంటుంటారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
నమ్మకాలు పక్కన పెడితే ఆరోగ్య నిపుణులు మరో హెచ్చరిక చేస్తున్నారు. పావురాలు విసర్జించే వ్యర్థాల వల్ల గాలి కలుషితమై శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పావురాల రెట్టల వల్ల ఇల్లు అపరిశుభ్రంగా మారి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే చాలామంది వీటిని ఇంట్లోకి రానివ్వడానికి ఇష్టపడరు.
ప్రేమానంద్ మహారాజ్ ఏమంటున్నారు?
ప్రేమానంద్ మహారాజ్ ప్రకారం.. ఏదైనా జీవి మన ఆశ్రయం పొందిందంటే అది మనపై ఉన్న భారం కాదని, ప్రకృతిలో భాగమని భావించాలి. అయితే పరిశుభ్రత, క్రమశిక్షణ కూడా ముఖ్యమే. నమ్మకాలను గౌరవిస్తూనే ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమమని ఆధ్యాత్మికవేత్తల సూచన.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
