Kalpeshwar Temple: హిమాలయ సానువుల్లోని కల్పేశ్వర ఆలయానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా.. సమీపంలో ఏ ప్రాంతాలను సందర్శించవచ్చంటే..
పంచ కేదార క్షేత్రాలు భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఐదు ఆలయాలు. పంచ కేదార్లు అంటే ఐదు పురాతన శివాలయాలు. ఇవి కేదార్‌నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్. ఈ ఐదు ఆలయాలను కలిసి పంచ కేదార్లు అంటారు. ఇవన్నీ శివుడికి అంకితం చేయబడ్డాయి. అయితే ఈ పంచ కేదార్ క్షేత్రాల్లో ఒకటైన కల్పేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలి? సమీపంలో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

పురాతన కాలం నుంచి సనాతన హిందూ ధర్మంలో పంచ కేదార్ దేవాలయాలను సందర్శించడం చాలా పవిత్రమైన, సంతృప్తికరమైన పనిగా పరిగణించబడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్, రుద్రనాథ్, కల్పేశ్వర్ ఆలయాలను సందర్శించడానికి వెళ్తారు. పంచ కేదార్ దేవాలయాలలో కల్పేశ్వర్ ఆలయం ఒకటి. దీనిని చివరి పంచ కేదార్ ఆలయంగా పరిగణిస్తారు. నిర్మలమైన హృదయంతో ఇక్కడికి చేరుకునే వారి కోరికలన్నీ నెరవేరుతాయని కల్పేశ్వర్ ఆలయం గురించి ఓ నమ్మకం. ఈ రోజు కల్పేశ్వర్ ఆలయాన్ని ఎలా చేరుకోవచ్చో.. శివయ్య దర్శనంతో పాటు ఇక్కడ ఉన్న మరికొన్ని ఉత్తమ ప్రదేశాలు ఏమిటి? ఎలా చేరుకోవాలి తెలుసుకుందాం..
ఉత్తరాఖండ్‌లో కల్పేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
కల్పేశ్వర ఆలయం చమోలిలోని హెలాంగ్ గ్రామం నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 2 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. పంచ కేదార్లలో ఐదవ స్థానంలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన కల్పేశ్వర ఆలయం లక్షలాది మంది భక్తులకు పవిత్రమైన, ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు.. వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి చేరుకుంటారు.
కల్పేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలంటే
దేశంలోని ఏ మూల నుంచి అయినా కల్పేశ్వర ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. దీని కోసం ముందుగా హరిద్వార రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. హరిద్వార రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత టాక్సీ లేదా రిక్షా తీసుకొని హరిద్వార బస్ స్టాండ్‌కు చేరుకోవచ్చు.
హరిద్వార బస్ స్టాండ్ నుంచి హెలాంగ్ కు ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సు ఎక్కాలి. ఇది దాదాపు 243 కి.మీ. దూరంలో ఉంది. హెలాంగ్ గ్రామానికి చేరుకున్న తర్వాత స్థానిక టాక్సీ లేదా ఇతర వాహనంలో ఉర్గం చేరుకోవాలి. ఉర్గం నుంచి కేవలం 2 కి.మీ దూరంలో ఉన్న కల్పేశ్వర్ ఆలయానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు.
దేవ ప్రయాగ
హరిద్వార నుంచి కల్పేశ్వర ఆలయానికి బయలుదేరిన.. తర్వాత అత్యంత ప్రముఖమైన, ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశం దేవ ప్రయాగ. దేవ ప్రయాగను హరిద్వార్-కల్పేశ్వర్ ఆలయ రహదారి యాత్రలో మొదటి గమ్య స్థానంగా పరిగణిస్తారు. అలకనంద, భాగీరథి నదులు గంగా నది ఉద్భవించే దేవ ప్రయాగ్‌లో కలుస్తాయి.
శ్రీనగర్
ఉత్తరాఖండ్ లోని అందమైన లోయలలో ఉన్న శ్రీనగర్. దీని అందానికి, మతపరమైన కారణాలకు ప్రసిద్ధి చెందింది. శ్రీనగర్ హరిద్వార్-కల్పేశ్వర్ ఆలయ యాత్రలో రెండవ స్టాప్ గా పరిగణించబడుతుంది. ఈ అందమైన నగరం అలకనంద నది ఒడ్డున ఉంది. శ్రీనగర్ లోని ధారి దేవి ఆలయాన్ని సందర్శించాలి.
నందప్రయాగ
హరిద్వార్-కల్పేశ్వర్ ఆలయ రహదారి యాత్రలో ఉత్తరాఖండ్‌లోని నందప్రయాగ్ ఒక ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ అందమైన ప్రదేశం అలకనంద నది ఒడ్డున ఉంది. అయితే, ఈ పర్యటనలో నందప్రయాగ్‌కు ముందు రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్‌లను కూడా సందర్శించాలి.
హెలాంగ్ గ్రామం
హరిద్వార్-కల్పేశ్వర్ ఆలయ రహదారి ప్రయాణంలో నందప్రయాగ్‌ను చూసిన తర్వాత.. కల్పేశ్వర్ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న హెలాంగ్ గ్రామాన్ని సందర్శించండి. మేఘాలతో కప్పబడిన ఎత్తైన పర్వతాలు, పెద్ద పైన్ చెట్లు, సరస్సులు, జలపాతాలు హెలాంగ్ గ్రామ అందాన్ని మరింత పెంచుతాయి. హెలాంగ్‌తో పాటు ఉర్గం గ్రామాన్ని కూడా అన్వేషించవచ్చు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








