Ekashila Maha Ganesha: దేశంలోనే విశిష్ఠత కలిగిన ఏకశిల మహా గణపతి.. ఎక్కడ ఉందో తెలుసా..?

అవంచలో కొలువుదీరిన ఈ గణపయ్య దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం. భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు, వెడల్పు 15అడుగులు. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు.

Ekashila Maha Ganesha: దేశంలోనే విశిష్ఠత కలిగిన ఏకశిల మహా గణపతి.. ఎక్కడ ఉందో తెలుసా..?
Eka Shila Maha Ganesha Idol
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 10, 2024 | 6:10 PM

శుభకార్యాలు ఏవైనా ముందు విఘ్ణేశ్వరుని పూజ తర్వాతే మిగిలిన తతంగం అంతా జరుగుతుంది. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీ గల్లీల్లో గణనాథుల విగ్రహాల కోలాహలం మామూలుగా ఉండదు. అలా ప్రతి ఏడు వినాయక నవరాత్రులను అంగరంగవైభవంగా నిర్వహించుకుంటారు భక్తులు. అంతటి భక్తి పారవశ్యం కలిగిన గణపయ్యకు అక్కడ మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. పాపం ఈ భారీ బొజ్జగణపయ్యకు నిలువ నీడ లేదు. నిత్య పూజలు లేవు. అందులోనూ దేశంలోనే అతిపెద్ద ఏకశిల ఐశ్వర్య గణనాథుడు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే..!

వినాయక చవితి వచ్చిందంటే చాలు విభిన్నమైన రూపాల్లో గణపయ్య విగ్రహాలను కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు భక్తులు. అలా నవరాత్రులు ఉండి వెళ్లే గణనాథుడు కాడు అక్కడ వెలసిన ఐశ్వర్య గణపయ్య. దేశంలోనే ఎంతో విశిష్టత కలిగిన ఏకశిల మహాగణపతి. అలాంటి ఓ అరుదైన లంబోదరుడి భారీ శిలావిగ్రహం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని అవంచలో కొలువుదీరాడు. ఈ ఏకశిలా భారీ గణనాథునికి గుడి లేదు. నిలువ నీడ లేదు. ఎండకు ఎండుతాడు.. వానకు తడుస్తాడు. చూట్టు గోడ కూడా లేదు. పంట పొలాల మధ్యే ఈ గణనాధుడు వందల ఏళ్లుగా ఒంటరిగా ఉన్నాడు.

వీడియో చూడండి..

అవంచలో కొలువుదీరిన ఈ గణపయ్య దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం. భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు, వెడల్పు 15అడుగులు. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం పదకొండో శతాబ్దం నాటికి చెందిందని చరిత్ర చెబుతోంది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. అవంచ గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రలో ఉంది. అయితే.. తైలంపుడు తల్లి అనారోగ్యం బారిన పడడంతో అప్పటి నుంచి ఆలయ నిర్మాణ పనులు ఆగిపోయాయని స్థానికంగా ప్రచారంలో ఉంది.

గుడి నిర్మిస్తామని చెప్పి అడ్రస్ లేని ట్రస్ట్

కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహాగణపతి విగ్రహానికి మంచి ఆలయం నిర్మించాలని గ్రామస్థులు భావించారు. అయితే ప్రభుత్వానికి అనేక మార్లు విన్నపాలు కూడా చేశారు. ఇక ఐదేళ్ల క్రితం పుణేకు చెందిన ఉత్తరదేవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆలయ నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకుంది. ఇందుకోసం విగ్రహం చుట్టూ సుమారు ఆరున్నర ఎకరాల భూమిని సైతం కొనుగోలు చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్న ఆలయ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే కొన్నాళ్ల క్రితం మైసూరుకు చెందిన వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి ఈ భారీ గణనాథుడికి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేసి వెళ్ళారు. కేవలం వినాయకచవితి నవరాత్రులు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. అ తర్వాత మళ్లీ వినాయక చవితి వచ్చే వరకు ఐశ్వర్య గణనాథుడిని ఒంటరిగా వదిలేస్తున్నారు. ప్రతి ఏటా వినాయక నవరాత్రులకు మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే దేశంలోనే ఎంతో విశిష్ఠత కలిగిన ఏకశిల గణనాథుడిని అటూ ట్రస్ట్, ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆలయ నిర్మాణంలో జోక్యం చేసుకుని అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని చెబుతున్నారు.

అరుదైన ఏకశిలా గణపతిని చూడటానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. భక్తి ప్రాచుర్యానికి, పర్యాటకానికి అవకాశం ఉన్నా సౌకర్యాలు లేమితో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..