Kanaka Durga Temple: అర్జునునికి పాశుపతాస్త్రాన్ని శివుడు అనుగ్రహించిన కొండ.. ఇంద్రకీలాద్రి.. దసరా సందర్భంగా క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాం..

అసురసంహారం గావించిన అనంతరం శ్రీదుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండటం గ్రహించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దుర్గమ్మను భక్తులపాలిట కల్పవల్లిగా, శాంత స్వరూపిణిగా ఉంచాలని శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన..

Kanaka Durga Temple: అర్జునునికి పాశుపతాస్త్రాన్ని శివుడు అనుగ్రహించిన కొండ.. ఇంద్రకీలాద్రి.. దసరా సందర్భంగా క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాం..
Indrakeeladri Kanaka Durga
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2022 | 6:56 PM

Navaratri Kanaka Durga Temple: పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోని శక్తి క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రము విశిష్టమైనది, మహిమాన్వితమైనది. పావన కృష్ణానదీ తీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి, మల్లేశ్వర స్వామివారు స్వయంగా అవతరించటం విశేషం. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి శిల పవిత్రంగా, ప్రతి వృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. వేదమంత్రాలతో, స్తోత్రాలతో భక్తులు గావించే శ్రీదుర్గామల్లేశ్వరుల దివ్యనామ స్మరణలతో వెలుగొందుతుంది. అదే కొండపై దసరా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి,సోమవారం 26 ఉదయం3 గంటలకు సుప్రభాతసేవ 3.30కు స్నపనాభిషేకం,ప్రాతఃకాల అర్చన ఉదయం 7.30 ని.లకు బాలభోగ నివేదన అనంతరం ఉదయం 9 గంటల నుండి స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవి గా అమ్మవారి దర్శనం తో దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 27 నుండి అక్టోబర్ 5వరకు ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. అక్టోబర్ 2 ఆదివారం, మూలానక్షత్రం రోజున ఉదయం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో శ్రీ అమ్మవారి దర్శనం. 26 నుండి 5 వరకు సాయంత్రం 6:30 ని.ల నుండి గం. 7.30 ని.ల వరకు శ్రీ అమ్మవారి మహా నివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుపు నిమిత్తం దర్శనం నిలుపుదల చేస్తారు.

దసరా మహోత్సవాలలో దేవస్థానంలో అనుష్ఠానములు, మంత్ర పారాయణలు జరుగుతాయి. అందులో చతుర్వేదపారాయణల, మహావిద్య, సుందరకాండ, సప్తశతి,చండీ నవాక్షరి, బాలమంత్రము, సూర్య నమస్కారములు, లక్ష్మీగణపతి, శివపంచాక్షరీ, నవగ్ హ జపము, లలితా సహస్రనామము నిత్యం ఇంద్రకీలాద్రిపై జరుగుతాయి. దసరా మహోత్సవాలలో ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో శ్రీ గంగా సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిర్వహించబడును.

స్ధలం పురాణం:

ఇవి కూడా చదవండి

ఇంద్రకీలాద్రి క్షేత్రం అపర కైలాసంగా ప్రాచీనకాలంలో పరాశక్తి యొక్క మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేయగా, అతని భక్తికిమెచ్చి శ్రీ అమ్మవారు వరాన్ని కోరుకోమనగా పరమానంద భరితుడైన కీలుడు అమ్మకు సాష్టాంగ నమస్కారముచేసి, కీర్తించి తన హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని ప్రార్థించాడు. అనంతరం శ్రీ అమ్మవారు కీలునితో నీవు అద్రి (కొండ) రూపంలో ఉండమని త్వరలోనే ఈ అద్రిపై స్వయంభువుగా ఆవిర్భవిస్తానని చెప్పగా, కీలుడు ఆనందభరితుడై అద్రిగా మారగా, కొంతకాలానికి దుర్మార్గుడైన దుర్గమాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా నిలిచింది. ఈ నగరమును పరిపాలిస్తున్న మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి కనకవర్షం కురిపించి శ్రీకనకదుర్గాదేవిగా కీర్తించబడుచున్నది. ఇంద్రుడు శ్రీ అమ్మవారికి దర్శనమునకు మొదటగా రావటం వలన ఈ పర్వతం ఆనాటి నుండి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందింది.

అర్జునునికి పాశుపతాస్త్రం అనుగ్రహం:

కనకదుర్గా స్వరూపంగా అమ్మవారు అవతరించిన ఈ దివ్యమైన క్షేత్రంలో అర్జునునికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు కరుణను అనుగ్రహిస్తున్నారు. ద్వాపరయుగంలో అర్జునుడు. వనవాసం సమయంలో శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞమేరకు శ్రీదుర్గా అమ్మవారిని కొలిచి శ్రీఅమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది, శ్రీ అమ్మవారి ఆజ్ఞ చొప్పున పరమేశ్వరుని గురించి ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని కోరుటకు ఉమాపతి అనుగ్రహం కోసం ఇంద్రకీలాద్రిపై తపస్సు గావించాడు. అర్జునుడి భుజబలాన్ని, మనోధైర్యాన్ని వాక్ వైఖరిని పరీక్షించాలని సతీ సమేతంగా పరమేశ్వరుడు కిరాతుని రూపాన్ని ధరించి అర్జునునితో వాదించి, మల్లయుద్ధం గావించి అతని శక్తికి సంతసించి నిజరూపంతో సాక్షాత్కరించి ప్రీతితో పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు.

శ్రీ అమ్మవారి క్షేత్రంలో ఎక్కడా కనిపించని ఒక వైశిష్యం ఈ క్షేత్రానికి ఉంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి శ్రీ అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా భక్తులను, క్షేత్రమును రక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పర్వతం నాలుగు దిశలవైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి వారిని మనం చూడవచ్చును.

 శ్రీచక్ర ప్రతిష్టాపన-పూజలు 

అసురసంహారం గావించిన అనంతరం శ్రీదుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండటం గ్రహించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దుర్గమ్మను భక్తులపాలిట కల్పవల్లిగా, శాంత స్వరూపిణిగా ఉంచాలని శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి వైదికపరమైన స్తోత్రాలతో శ్రీ సూక్త విధానంగా కుంకుమతో పూజలు నిర్దేశం చేయగా, ఆనాటి నుండి శ్రీ అమ్మవారికి అదే విధానంలో నేటికీ అవిచ్ఛిన్నంగా పూజలు జరుగుతున్నాయి.

12వ శతాబ్దంలో లింగధారుడైన శ్రీపతి పండితారాధ్యులు వారు శ్రీదుర్గామల్లేశ్వరులని సేవించి కొండ దిగువన గల జమ్మిచెట్టు వద్ద నున్న అప్పటి ప్రజలను వంట చేసుకొనుటకు నిప్పును కోరగా వారు నిరాకరించారు. అమేయభక్తితో శ్రీదుర్గామల్లేశ్వరులని ప్రార్థించిన శ్రీపతి పండితారాధ్యులవారు అగ్నినిపుట్టించి తమ ఉత్తరీయంలో పెట్టి (నిప్పుమూట) జమ్మిచెట్టుకు కట్టగా ఉత్తరీయం కానీ, జమ్మిచెట్టు కానీ అగ్ని వేడిమికి దహించ బడకుండా అదేవిధముగా వెలుగుచుండెను. ఆ మహత్కార్యం చూసిన తర్వాత ప్రజలందరూ క్షమించమని ప్రార్థించగా శ్రీపతి పండితారాధ్యుల వారు భక్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరిలో దేవతా స్వరూపాలుగా భావించి గౌరవించాలని ప్రజలకు ప్రభోదించారు. ఈ సంఘటనకు చిహ్నంగా ‘జమ్మిమండపం’ అనే నిర్మాణాన్ని ఆనాటి బెజవాడపాలకులు నిర్మింపచేశారు. ఈ మండపం అక్కన్న మాదన్న గుహలు ప్రాంగణంలో ఉంది.

తరతరాలుగా శరన్నవరాత్రుల వేడుకలు:

తర తరాలుగా ఇంద్రకీలాద్రి క్షేత్రం పై ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు శ్రీ అమ్మవారికి ఎంతో వైభవంగా జరుగుతాయి. విజయదశమి పర్వదినమున హంసవాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జల విహారం గావిస్తారు అక్కడితో దసరా మహోత్సవాలకు ముగింపు అవుతుంది.

Reporter: Vikram, TV9 Telugu