Medaram Jatara 2022: ముగిసిన మేడారం జాతర.. జనం నుంచి వనంలోకి వెళ్లిన వనదేవతలు.. కోటిన్నర మంది దర్శించుకున్నారని అంచనా

Medaram Jatara 2022: గత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara) ముగిసింది.  వనదేవతల తిరిగి వనప్రవేశం చేశారు. ఈ ఏడాది మేడారం జాతరను..

Medaram Jatara 2022: ముగిసిన మేడారం జాతర.. జనం నుంచి వనంలోకి వెళ్లిన వనదేవతలు.. కోటిన్నర మంది దర్శించుకున్నారని అంచనా
Medaram Jatara 2022
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2022 | 9:28 PM

Medaram Jatara 2022: గత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara) ముగిసింది.  వనదేవతల తిరిగి వనప్రవేశం చేశారు. ఈ ఏడాది మేడారం జాతరను సుమారు కోటి 50లక్షల మంది భక్తులు సందర్శించుకున్నట్లు అంచనా. తల్లులు గద్దెపైకి చేరడంతో ఎక్కువ మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు.  మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర విజయవంతం చేసిన అధికారులను మంత్రులు ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు సత్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల‌తో మంత్రులు, ఉన్నతాధికారుల ద‌గ్గర ఉండి ఏర్పాట్లను ప‌ర్యవేక్షించ‌డంతో వ‌న‌దేవ‌త‌ల జాత‌ర స‌జావుగా జ‌రిగిందన్నారు. అధికారులు ముందు నుండి సూక్ష్మస్థాయిలో ప్రణాళికతో ముందుకు సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదని చెప్పారు. అమ్మవార్ల దయతో భక్తులు మొక్కులు చెల్లించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారని వెల్లడించారు. అందరి సహకారంతో జాతర విజయవంతం చేయగలిగామని, జాతర ఏర్పాట్లు, నిర్వహ‌ణ‌ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు.

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ గిరిజ‌న జాత‌ర‌కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించార‌ని, ఈ జాత‌ర‌కు రూ.75 కోట్లు మంజూరు చేశార‌న్నారు. నాలుగు జాత‌ర‌ల‌కు క‌లిపి ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వం రూ. 332.71 వెచ్చించిందని తెలిపారు. ఈ నిధుల‌తో శాశ్వత నిర్మాణాలు చేప‌ట్టామ‌ని, మౌలిక వ‌సతుల కొర‌త తీరింద‌న్నారు. స‌కాలంలో నిధులు విడుద‌ల చేయ‌డంతో ప‌నులు త్వరితగ‌తిన పూర్తి చేయ‌డం జ‌రిగిందని మంత్రి చెప్పారు. అన్ని శాఖల మ‌ధ్య స‌మ‌న్వయంతో ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎంతో సౌకర్యం కలిగిందని తెలిపారు.

జాతరకు భక్తులు అధికసంఖ్యలో వస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు జంపన్నవాగు వద్ద గతంలో కన్న ఎక్కువ స్నానాల ఘాట్లను నిర్మించామని చెప్పారు. తాగునీటి సౌకర్యం, శానిటేషన్, బస చేసే భక్తులకు తాత్కాలిక గుడిసెలను ఏర్పాటు చేయ‌డంతో ఎక్కడ కూడా తాగు నీటి స‌మస్య కానీ శానిటేష‌న్ స‌మ‌స్య కానీ ఎదురు కాలేద‌ని పేర్కొన్నారు. జాత‌ర‌ను బ్రహ్మండంగా నిర్వహించామ‌ని..స‌హ‌క‌రించిన భ‌క్తులంద‌రికి ప్రభుత్వం త‌ర‌పున ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. జాతరలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని మంత్రి ప్రసంసించారు. ముఖ్యంగా క‌లెక్టర్, ఎస్పీ క్షేత్ర స్థాయిలో ఉండి భ‌క్తులకు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకున్నార‌ని మంత్రి వారి సేవ‌ల‌ను కొనియాడారు. జాత‌ర విజ‌య‌వంతం అయ్యేందుకు స‌హాకరించిన అన్ని శాఖల అధికారుల‌ను మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే సీత‌క్క, ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిదులతో పాటు త‌మంత స‌మ‌న్వయంతో ప‌ని చేయ‌డం జరిగింద‌న్నారు.

దేవాదాయ శాఖ మంత్రిగా వ‌రుస‌గా నాలుగు జాత‌ర‌ల‌ను ప‌ర్యవేక్షించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, వ్యక్తిగ‌తంగా ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. వ‌న‌దేవ‌త‌ల చ‌ల్లని ఆశీస్సులు అంద‌రిపై ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకున్నారు. రానున్న రోజుల్లో దేవాదాయ శాఖ త‌ర‌పున రూ. 10 కోట్లతో సూట్ రూమ్స్, డార్మిటిరీ, క్యాంటీన్, ఇత‌ర సౌక‌ర్యాల‌తో వ‌స‌తి గృహల నిర్మాణానికి కృషి చేస్తాన‌ని చెప్పారు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి.

Also Read:

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం..

 భారతీయుల పాటకు విదేశీయులు ఫిదా.. కచా బాదం సాంగ్‌కు చెల్లెలుతో కలిసి డ్యాన్స్ చేసిన కిలీ

కనుల పండువగా కామాక్షిదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు.. హంసం, చిలుక,వెండి రథాలపై ఊరేగిన ఉత్సవమూర్తి