Maha Kumbha Mela: హరిద్వార్‌లో మహాకుంభ జాతర ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకు జరుగుతుందో తెలుసా..!
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభంకానుంది. ఈ మహా కుంభ మేళా 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రాజ స్నానంతో ముగుస్తుంది. అయితే హరిద్వార్ లో మహా కుంభ మేళాను ఎప్పుడు? ఏ సంవత్సరంలో నిర్వహించబడుతుందో ఈ రోజు తెలుసుకుందాం..
సనాతన ధర్మంలో మహా కుంభ మేళాకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహా కుంభ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, ఆధ్యాత్మిక పండుగగా పరిగణించబడుతుంది. 2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభను నిర్వహించనున్నారు. జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ జాతర ప్రారంభం కానుంది. ఈ జాతర మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతర ఫిబ్రవరి 26న ముగుస్తుంది.
పుష్య మాసం పౌర్ణమి రోజున ప్రారంభం
పుష్య పౌర్ణమి రోజున త్రివేణీసంగమ క్షేత్రం వద్ద మహా కుంభం ప్రారంభమవుతుంది. ఈ రోజున మహాకుంభంలో మొదటి రాజ స్నానం చేయనున్నారు. ప్రతి మహా కుంభమేళా మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. ఈసారి కూడా అదే విధంగా మహా కుంభ మేళా జరగనుంది. ఈ జాతరను వైభవంగా జరపడానికి యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే హరిద్వార్‌లో మహాకుంభ ఎప్పుడు జరుగుతుందో తెలుసా..
హరిద్వార్‌లో మహాకుంభాన్ని ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారంటే
హరిద్వార్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభను నిర్వహిస్తారు. కుంభరాశిలో బృహస్పతి సంచరిస్తుంటే.. అదే సమయంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తుంటే.. ఆ సమయంలో హరిద్వార్‌లో మహాకుంభంను నిర్వహించాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 2021లో హరిద్వార్‌లో మహా కుంభ మేళాను నిర్వహించారు. మళ్ళీ 2033లో హరిద్వార్‌లో మహాకుంభను నిర్వహించనున్నారు. మహా కుంభ స్నానం చేసిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత గ్రంధాలలో చెప్పబడింది. అలాగే మహాకుంభ స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు, రోగాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ నాలుగు ప్రదేశాలలో మాత్రమే ఎందుకు నిర్వహిస్తారు?
ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో మాత్రమే కుంభ మేళా, మహాకుంభ మేళాను నిర్వహిస్తారు. పురాణ కథల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సముద్ర మథనం సమయంలో అమృతం భాండం ఉద్భవించింది. ఈ అమృత కలశం కోసం దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో 12 చోట్ల కొన్ని అమృతపు చుక్కలు పడ్డాయి. వీటిలో ఎనిమిది చుక్కలు స్వర్గంలో.. నాలుగు చుక్కలు భూమిపై పడ్డాయి. ఆ ప్రదేశాలే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లు. అందుకనే ఈ ప్రదేశాలలో కుంభ మేళా, మహాకుంభ మేళాను నిర్వహింస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.