Maha Kumbh 2025: మహాకుంభమేళా కోసం సిద్ధమైన ప్రయాగరాజ్.. 40 కోట్ల మంది వస్తారని అంచనా
ప్రయాగ్‌రాజ్ పిలుస్తోంది.. కుంభమేళాకు రారమ్మంటోంది. మహాకుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతోంది. రేపటి నుంచి ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతుంది . ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రైళ్లు, బస్సులు, ఫ్లైట్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళా కోసం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తరలివస్తారని భావిస్తున్నారు. కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. కుంభమేళా పర్వదినాల్లో ఉత్తరప్రదేశ్‌కు రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం ప్రకటించారు. పన్నెండు పుష్కరాలకు వచ్చే మహాకుంభమేళా కావడంతో అత్యంత వైభవంగా జరపాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
కుంభమేళా సందర్భంగా అఘోరాలు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ప్రయాగరాజ్ వీధుల్లో నాట్యాలు చేస్తూ భక్తులను ఉత్తేజపరుస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు రకరకాల బాబాలు వస్తున్నారు. అందరి కన్నా ఇక్కడ కనిపిస్తున్న రుద్రాక్ష బాబా హైలైట్‌గా నిలుస్తున్నారు. 11వేల రుద్రాక్షలతో ఆయన అలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం 30కేజీల బరువున్న ఈ అలంకారంతోనే రుద్రాక్ష బాబా దర్శనమిస్తారు. ఆయన దగ్గర రుద్రాక్షను తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.
ఇక ఎన్విరాన్‌మెంట్ బాబా కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆయన ఒంటి నిండా అలంకరణలతో.. చేతిలో సర్పదండంతో దర్శనమిస్తున్నారు. బంగారు కడియాలు.. బంగారంతో చేసిన కళ్లద్దాలు, మెడలో బంగారు రుద్రాక్షలతో ధగధగలాడిపోతున్నారు ఈ బాబా. ప్రయాగ్ రాజ్‌లో ఆయన ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేసుకుని భక్తులను ఆశీర్వదిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ పని చేస్తున్నానంటున్నారు ఎన్విరాన్‌మెంట్ బాబా.
ఇక అంబాసిడర్ బాబా కూడా ప్రయాగ్‌రాజ్ వచ్చారు. 1972 మోడల్‌కు చెందిన అంబాసిడర్ కారులోనే ప్రయాగరాజ్ చేరుకున్నారు. ఆయన అంబాసిడర్ కారు భక్తులను ఆకర్షిస్తోంది. 35 ఏళ్లుగా ఇదే అంబాసిడర్ కారును వాడుతున్నా అంటున్నారు బాబా. ఇదే తన వాహనం.. ఇదే తన ఇల్లు అంటున్నారాయన. ఇండోర్ నుంచి ప్రయాగ్‌రాజ్ చేరుకోడానికి 36 గంటలు పట్టినా.. తనకు శ్రమ అనిపించలేదన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..