చెరసాలలో వేదోచ్ఛారణలు.. ఖైదీలకు వేదమంత్రాల బోధనలు.. జైలు అధికారుల వినూత్న చర్యలు
ఖైదీలలో మార్పు తెచ్చేందుకు భోపాల్ కేంద్ర కారాగారం (Bhopal Central Jail) అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేసి జైలుకెళ్లిన వాళ్లు మానసికంగా తీవ్ర సంఘర్షణకు లోనవుతారు. తమలో తాము కుంగిపోయి ఆత్మహత్యలు...
ఖైదీలలో మార్పు తెచ్చేందుకు భోపాల్ కేంద్ర కారాగారం (Bhopal Central Jail) అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేసి జైలుకెళ్లిన వాళ్లు మానసికంగా తీవ్ర సంఘర్షణకు లోనవుతారు. తమలో తాము కుంగిపోయి ఆత్మహత్యలు (Suicide) చేసుకున్న ఘటనలూ మనం చూశాం. వీరిలోని మానసిక కుంగుబాటును నివారించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వేద మంత్రాలు, పౌరోహిత్యం నేర్పిస్తున్నారు. తద్వారా వారు జైలు నుంచి బయటకు వెళ్లాక తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఆధ్యాత్మిక వేత్తల ద్వారా ఖైదీలకు వేదాలు, మంత్రాలను బోధిస్తున్నారు (Teaching Vedic Mantras). యజ్ఞ కర్మలు, పురోహితులుగా స్ధిరపడేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు హత్యలు, మహిళలపై అకృత్యాలు సహా వివిధ నేరాలకు పాల్పడిన ఖైదీలు ఇప్పుడు వేదాలు, మంత్రాలు నేర్చుకుంటున్నారు. గతంలో జరిగిన ఇలాంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మళ్లీ ఆ మార్గాన్ని ఎంచుకున్నామని కారాగారం అధికారులు చెబుతున్నారు.
జైళ్లలో ఖైదీలు మానసిక కుంగుబాటు లేదా దూకుడుతో ఉంటారు. వివిధ పరిస్ధితుల కారణంగా జైలుకు వస్తారు. నేపథ్యాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. కావాలని చేసిన నేరాలు కొన్నయితే.. క్షణికావేశంలో నేరం చేసి జైలుకు వచ్చేవాళ్లు మరి కొందరు. ఫలితంగా తమ నిండు జీవితం నాశనమైనందని బాధపడుతూ నిరాశా నిస్పృహలో కాలం గడుపుతుంటారు. వీరిలో మార్పు తెచ్చేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో 2007, 2008లో జనపురోహిత్ అనే కార్యక్రమం చేపట్టారు. ఖైదీలకు సనాతన ధర్మానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్పించారు. దాని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. సాధారణ ఖైదీల్లో ఈ కార్యక్రమం ద్వారా ఒక సానుకూల శక్తిని పెంచేలా చేశాయి.
ఖైదీల ఆసక్తి, వారి సామర్ధ్యం ఆధారంగానే వారిని పురోహితులుగా శిక్షణ కోసం ఎంపిక చేస్తున్నామని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు. గురువులు బోధించిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పురోహితుడిగా మారడం, సమాజంలో ప్రేమ, న్యాయం, సోదరభావం అనే భావనను ఏర్పచేలా ఇక్కడ నేర్పిస్తున్నారని శిక్షణ పొందిన ఖైదీలు చెబుతున్నారు. మహిళలను గౌరవించడం సహా అన్ని రకాల ఆధ్యాత్మిక శిక్షణ, మంత్రాలు, యజ్ఞ కర్మలు వంటివి ఇక్కడ గురువుల ద్వారా నేర్చుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా మనసు తేలికైందని, శాంతి, సానుకూల శక్తి వస్తోందని సంతోషంగా చెబుతున్నారు.
Also Read
Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట సెకండ్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిన ‘పెన్నీ’ పాట
RRR: విడుదలకు ముందే రికార్డ్స్ వేట షూరు.. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ సునామీ..