Srirama Navami 2021:రామాయణంలో సుందరకాండ విశిష్టత… శ్రీరామ నవమిరోజున పఠిస్తే ఫలితం ఏమిటంటే..!

Srirama Navami 2021: రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే.. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ... రామాయణ మహాకావ్యములో ఉన్న కాండలలో...

Srirama Navami 2021:రామాయణంలో సుందరకాండ విశిష్టత... శ్రీరామ నవమిరోజున పఠిస్తే ఫలితం ఏమిటంటే..!
శ్రీమహాలక్ష్మి అయోనిజగా సీతగా జనకుడి ఇంట పెరిగి.. రాముడిని పరిణయమాడింది. భర్త అడుగు జాడల్లో నడుస్తూ.. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక అయ్యింది. ఇక అన్నకి సేవ చేస్తూ.. 14 ఏళ్ళు వనవాసం లో ఉన్న లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీకగా నిలిచాడు. శ్రీరామచంద్రమూర్తిని తన దైవంగా తలచి భక్తితో కొలిచి రాముడిని తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుడు భక్తికి ప్రతీకగా నిలిచాడు.. నేటికీ కొలవబడుతున్నారు.
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2021 | 7:11 AM

Srirama Navami 2021: రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే.. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః … రామాయణ మహాకావ్యములో ఉన్న కాండలలో సుందరకాండ ఉత్కృష్టమైనది. పరమ పావనమైనది. ఆ కాండకు సుందరకాండ అనే పేరు మునివర్యులు, కవి అయిన వాల్మీకి ఎందుకు పెట్టాడన్నది ప్రశ్న. దానికి వాల్మీకి ఎక్కడా వివరణ ఇవ్వలేదు మనకు. సుందర కాండకు మరి ఆ పేరెందుకు వచ్చి ఉంటుంది?

అన్ని కాండలకు పేర్లు బట్టి అందులో గల విషయము ఏమిటో చెప్పగలము. కానీ ఈ సుందరకాండకు మాత్రము ‘సుందరకాండ’ గా ముని ఎందుకు పేరు పెట్టాడో ఆలోచించవలసి ఉన్నది. అది ఏ సముద్రకాండో, లంకా కాండో అని కాకుండా, ‘సుందర కాండ’ అని పేరు పెట్టటములో ఆంతర్యమేమున్నది? ఈ కాండ 68 సర్గలతో ఉన్నది. ఇందు మనకు అణువణువు హనుమనే కనబడుతాడు. మొదలైనప్పటి నుంచీ చివర వరకూ ఈ కాండ అంతా హనుమ గురించే. హనుమ జిత్రేంద్రియుడు. ప్రజ్ఞానవంతుడు. సీత జాడ తెలియక లంకలో వెతుకుతూ.. “నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై। నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో। నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః॥” అని శరణాగతి చేసి సీతను కనుగొంటాడు.

వాయువు మనకు ప్రాణము. వాయువు లేనిదే క్షణమాత్రము మనము జీవించలేము. “త్వమేహం ప్రత్యక్షా బ్రహ్మాః” అని ప్రజలు సేవించే వాయువు కుమారుడు హనుమంతులవారు. వాయు నందనుడు అణువణువు ఉన్నందున ఈ కాండకు సుందరకాండయని పేరా? అటువంటప్పుడు హనుమ కాండఅని పేరు పెట్టవచ్చు కదా? అలా కాక సుందరకాండ అని పేరు పెట్టడములో ముని యొక్క ఆంతర్యము హనుమ గురించి కాదని మనకు తెలుస్తుంది.

లంకా నగరము చాలా సుందరమైన నగరము. విశ్వకర్మచే నిర్మించపడి, ఉద్యానవనాలతో, విశాలమైన వీధులతో, ఎతైన బంగారు భవనాలతో ఎంతో మనోహరమైన నగరము. లంకా నగరము చాలా సుందరమైనదని మనకు చెప్పటానికి దీనికి సుందరకాండ యని పేరు పెట్టారా? లంకా నగరము యొక్క అందము బాష్యమైనది. అది నేడు ఉంటుంది. రేపు ఉండకపోవచ్చును. మరి అంత అశాశ్వతమైన అందమును తెలుపుటానికి ముని ఈ కాండకు ఆ పేరు పెట్టారంటే మనము నమ్మలేము. అందమేమిటి అంటే మనలోని ఆనందాన్నీ బయటకు తీసేది అందము. ఏదైనా సౌందర్యము జన సామాన్యమైనది చాలా విచిత్రమైనది. వస్తువుల అందము చూచే కన్నులలో తప్ప ఆ వస్తువులో ఉండదని మనకు తెలిసిన విషయమే. వస్తు సౌందర్యము నిలకడలేనిది. మార్పుకు లొంగిపోయేది. అటు వంటి వస్తు సౌందర్యము సౌందర్యమనిపించుకోదు. కేవలము మనలోని అంతరానందాన్ని బయటకు తెచ్చేది, బయటకు తేవటానికి సహాయము చేసేది అందము. అందగాడు అంటే మనస్సు లోని ఆనందాన్ని బయటకు తెచ్చేవాడు అందగాడు. ఎవరా అందగాడు ఈ కాండ లో అంటే, రామచంద్రప్రభువు. మరి మనము ఈ కాండలో హనుమ గురించి వింటూ రామస్వామిని ఎక్కడ తలుస్తున్నాము? రామస్వామి అంతర్లీనంగా సర్వత్రా ఉన్నాడు. ఈ కాండలో మొదటి రామకథా గానము జరిగింది. 62 వ సర్గలో కనపడుతాడు రామస్వామి మనకు ప్రత్యక్షముగా. హనుమ రామకథను పాడుతాడు.

సీతమ్మ మొదట హనుమను చూచి నమ్మదు. ఆ తల్లి హనుమతో ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని మధ్యలో ఉండేవాడు. అటు వంటి నారాయణుడే ఇలా సూర్య వంశములో జన్మించి కమల రేకుల వంటి కన్నులతో ఉన్నాడు. ఆయనే రామచంద్రుడు అంటూ చెప్పాడు హనుమ. రామాయణము ఒక మధుర రచన. అందులో సుందరకాండ అత్యంత మధురము. అలవోకగా సాగే శబ్దార్థాల సౌందర్యము, చదువరుల హృదయాలపై పన్నీరు చల్లుతుంది. సీతమ్మ చేసిన తపస్సు అశోకవాటిలో సాధారణ తపస్సు కాదు. సర్వం త్యదించి సతతము రామ నామము జపిస్తూ, కేవలము రాముని మనమున ఉంచుకు గాలిని మాత్రమే స్వీకరిస్తూ తపించింది. రామునికై తపించినది. రాముడు మాత్రమే తనను రక్షించువాడని నమ్ముకున్నది. ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తున్నది కదా, ఏమి తపస్సు అని మనకు సందేహము కలుగుతుంది. ఆమె చేసే తపస్సు ‘శరణాగతి’. మనమందు రాముని ప్రతిష్ఠించుకొని ఎల్లప్పుడూ ఆ రామునే తలుస్తూ…. “నాకు నీవే గతి. నీవు తప్ప మిగిలినది నాకు శూన్యం.” అని సీత చెబుతున్నది. పరమాత్మను చేరటానికి ఉత్తమోత్తమమైన పద్ధతి శరణాగతి. నవ విధ భక్తిలో అత్యంత శ్రేష్ఠమైనది శరణాగతి. ముని అయిన కవి వాల్మీకి చేత పరమ పురుషుడు చెప్పిన కథే సుందరకాండ.

“సుందరే సుందరో రామః సుందరే సుందరి కథా! సుందరే సుందరి సీతా,సుందరే సుందరం వనం !! సుందరే సుందరం కావ్యం,సుందరే సుందర కపి ! సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం?!! ” సర్వ కోరికలు తీర్చి తుదకు ముఖ్యమైన ముక్తిని కూడా ఇచ్చే ఈ సుందరకాండ పారాయణముతో ఈ చైత్రమాసము మరింత ఫలప్రదమైనది. రామనవమితో పూర్తి చేసే పారాయణము అనాదిగా మన సంప్రదాయము. ఈ శ్రీరామ నవమి రోజున హనుమంతుడు.. ఎవరైతే సుందరకాండ పారాయణం చేస్తారో వారిని రక్షిస్తాడని భక్తుల విశ్వాసం

Also Read:  ఈ గుడిలో అన్ని అద్భుతాలే.. నాలుగో స్థంభం విరిగిన రోజున కలియుగం చివరి రోజట