Koovagam Festival : కృష్ణుడిని హిజ్రాలు పెళ్లి చూసుకొనే ఆలయం ఎక్కడుందో తెలుసా..! ఆ ఉత్సవం ఎప్పుడొస్తుందంటే

శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవర్‌ను ఆరాధిస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగలసూత్రాన్ని, గాజులను, పువ్వులను తీసివేసి రోదిస్తారు. ఈ ఉత్సవం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు హిజ్రాలు...

  • Surya Kala
  • Publish Date - 11:55 am, Tue, 2 March 21
Koovagam Festival : కృష్ణుడిని హిజ్రాలు పెళ్లి చూసుకొనే ఆలయం ఎక్కడుందో తెలుసా..! ఆ ఉత్సవం ఎప్పుడొస్తుందంటే

 Transgender Festival in Tamil Nadu :  స్త్రీ, పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని హిజ్రాలు అని అంటారు. సభ్యసమాజం అనాదరణకు గురైన వీరు బిక్షాట మొదలైన వృత్తులలో జీవనం సాగిస్తుంటారు. ఏడాది పొడవునా అనాదరణకు గురైన వీరు ఒక్కరోజు కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఉత్సాహంగా గడిపే ఉత్సవం కోసం ఏడాది అంతా ఎదురుచూస్తుంటారు. అదే హిజ్రాల పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలోను పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం.. అయితే హిజ్రాలు వివాహ వేడెక్కి దూరం. అయితే ఈ హిజ్రాల ఫెస్టివల్ లో వారు పెళ్లికూతుళ్ళు అవుతారు.. తమ బాధను మరచిపోయి ఆనందంతో మూడు రోజులు గడుపుతారు. ఆ పండుగ తెచ్చిన సంబంరం అంబరాన్ని అంటుతుంది అదే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది.. విశిష్టత ఏమిటి…? ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం..!

తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలోని ఉలుందూరుపేటై తాలూకాలోని ‘కూవగం’ గ్రామంలో ‘కూతాండవర్‌’ దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏప్రిల్‌, మే మాసంలో వచ్చే చిత్రై మాసంలో ( చైత్రమాస పౌర్ణమి) ఈ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హిజ్రాలు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలావారు పెళ్లి చేసుకున్న తర్వాత కూతాండవర్‌ మరణిస్తాడు. మరురోజు స్త్రీ వేషంలోని వారు రోదిస్తూ గాజులు పగలగొట్టుకొని, కొలనులో స్నానాలు ఆచరిస్తారు.

ఇరావంతుడితో పెళ్లి

కూవాగం… లో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించని ఈ ఊళ్ళో తమిళ చైత్రమాస పౌర్ణమి వచ్చిందంటే వూరంతా జనసంద్రమైపోతుంది. కొన్ని వేలమంది హిజ్రాలు వస్తారు. ఇక్కడే ఉంది కూతాండవర్‌ ఆలయం. ఈ కూతాండవర్‌ మరెవరో కాదు… అర్జునుడి కొడుకైన ఇరావంతుడు.

హిజ్రాల కథనం ప్రకారం…

కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచిస్తాడు. అప్పుడు… అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తుకొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరంలేక కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు. ఆనాడు ఇరావంతుడు, మోహినిల పరిణయానికి సూచికగా… ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం.

కూవగంలో 18 రోజులు ఉత్సవాలు చేస్తారు. వారు శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవర్‌ను ఆరాధిస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగలసూత్రాన్ని, గాజులను, పువ్వులను తీసివేసి రోదిస్తారు. ఈ ఉత్సవం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు హిజ్రాలు. ఇందుకోసం రెండునెలల ముందుగానే షాపింగ్‌ మొదలుపెడతారు. ఈ ఉత్సవాలకు హాజరవ్వాలనుకునే హిజ్రాలు జిల్లా కేంద్రమైన విల్లుపురానికి వారంరోజులముందే చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో హిజ్రాలు… అందం, అలంకరణల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకలో హిజ్రాలే కాదు… వింత ఆసక్తికొద్దీ ఆడవేషం ధరించాలనుకునే మగాళ్లూ భారీగా పాల్గొంటారు. ఉత్సవంలో భాగంగా విల్లుపురంలో హిజ్రాలకు నృత్యాలూ అందాల పోటీలూ జరుగుతాయి.

కల్యాణం- వైధవ్యం :

తరవాత హిజ్రాలంతా కూవాగం చేరుకుంటారు. వీళ్లను గ్రామస్థులు తమ ఇళ్లకు ఆహ్వానించడం విశేషం. ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం కల్యాణోత్సవం. ఇందుకోసం హిజ్రాలంతా కూవాగం ఆలయంలో వెలసిన ఇరావంతుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని వధువుల్లా మారతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు. ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే, సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు ఆచారానికోసమన్నట్టు… చేతికి రెండుమూడు గాజులు ధరించి, మల్లెపూలు మెడకు చుట్టుకుని పూజారులతో తాళికట్టించుకుంటారు. అంతేకాదు, చిన్నవాళ్త్లెన మగపిల్లలకు తాళికట్టించుకుని తీసుకెళతారు తల్లిదండ్రులు. ఇక్కడ తాళి కట్టించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. మహిళలు దైవదర్శనం చేసుకోవచ్చుగానీ తాళి కట్టించుకోవడానికి అనర్హులట.

తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా వూరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకంగా చెక్కవిగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు… ఇరావంతుని బలి జరిగిందని తెలుసుకుని ఏడవడం మొదలుపెడతారు. గుండెలు బాదుకుని, జుట్టు విరబోసుకుని హాహాకారాలు చేస్తారు. వాళ్లు తెంపిపడేసిన పూలూ పసుపుతాళ్లూ, పగులగొట్టిన గాజులూ పెద్దపెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి. అనంతరం హిజ్రాలు స్నానంచేసి వైధవ్యానికి సూచికగా తెల్లచీర, రవికె కట్టుకుని మౌనంగా వూరువిడిచి తమతమ స్వస్థలాలకు బయలుదేరతారు. అలా ఈ ఉత్సవం ముగుస్తుంది. మళ్లీ చైత్రపౌర్ణమి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. ఈ ఉత్సవం హిజ్రాల సమస్యల పరిష్కారానికీ ఒక వేదికగా ఉపయోగపడుతోంది.

ఎలా వెళ్లంటే :

హైదరాబాద్ నుంచి ఈ ఆయాలయానికి చేరుకోవాలంటే రైలు ప్రయాణం ఐతే ముందుగా చెన్నై వరకూ వెళ్లి అక్కడ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.. అదే విమానం ఐతే పాండిచేరి కి వెళ్లి అక్కడ నుంచి ఆ ఆలయడానికి చేరుకోవచ్చు.

Also Read:

ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు పోలీసులు కౌన్సిలింగ్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు యాక్సిడెంట్ కేసు కూడా !

మీనీ వ్యానులో కిక్కిరిసిన జనంతో పాటు ఆవు ప్రయాణం.. వైరల్‌ అవుతోన్న వీడియో