Komuravelli Mallanna Jatara: మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రం కొమురవెల్లి జాతర రేపు ప్రారంభం
తెలంగాణలోని సిద్ధిపేటలో ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి. ఈ స్వామీ వారి బ్రహ్మోత్సవాలు ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా జరుగుతాయి...
Komuravelli Mallanna Jatara: తెలంగాణలోని సిద్ధిపేటలో ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి. కోరుకున్న భక్తుల కొంగు బంగారంమైన స్వామి వారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఉగాది వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యి.. స్వామివారిని దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామికి తమ మొక్కులు తీర్చుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి ఆదివారాన్ని ‘పట్నం వారం’గా పిలుస్తారు. ఈ వారం హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అందుకే ‘పట్నం వారం’గా పిలుస్తారు. శనివారం వచ్చే పట్నంవాసులు సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే బస చేస్తారు. ఆదివారం స్వామిని దర్శించుకోవడం, బోనాల నైవేద్యం సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.భారీ సంఖ్యలో హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయాధికారులు తెలిపారు.
ఈ స్వామీ వారి బ్రహ్మోత్సవాలు ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా జరుగుతాయి. మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధిగాంచింది. ఏటా మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, ఉగాది ముందు వచ్చే ఆదివారం రోజున అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
స్వామి వారు కొమురవెల్లిలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లుగా శిలాశానాలద్వారా తెలుస్తోంది. స్వామివారు ఓ గొర్రెల కాపరికి కలలో కనిపించి తాను ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిశానని చెప్పినట్టుగా భక్తుల విశ్వాసం. 500 ఏండ్ల కింద పుట్ట మట్టితో తయారు చేసిన స్వామివారి విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా నాభియందు పుట్ట లింగంతో మల్లన్న భక్తులకు దర్శనమిస్తున్నాడు.
Also Read: అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ.. మొదట రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి, ప్రధాని నుంచి సేకరణ