Andhra Pradesh: ఈ ఆలయంలో తాయత్తు కట్టుకుంటే ఏ సమస్యలూ ఉండవు.. శుభాలకు ప్రతీకగా నిలుస్తున్న పరమేశ్వరి ఆలయం

నెల్లూరు నగరానికే ఆ ఆలయం తలమానికం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ అమ్మవారి ఆలయం సకల శుభాలకు ప్రతీతి. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎలాంటి చీడపీడలు లేకుండా ఉండాలంటే ఇక్కడి అమ్మవారి ఆలయంలో తాయత్తు కట్టుకోవడం అనాదిగా వస్తోంది. దీని కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు. అదే నెల్లూరు నగరంలోని ఇరు కళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం. క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలం […]

Andhra Pradesh: ఈ ఆలయంలో తాయత్తు కట్టుకుంటే ఏ సమస్యలూ ఉండవు.. శుభాలకు ప్రతీకగా నిలుస్తున్న పరమేశ్వరి ఆలయం
Nellore Parameshwari Temple
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2022 | 3:15 PM

నెల్లూరు నగరానికే ఆ ఆలయం తలమానికం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ అమ్మవారి ఆలయం సకల శుభాలకు ప్రతీతి. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎలాంటి చీడపీడలు లేకుండా ఉండాలంటే ఇక్కడి అమ్మవారి ఆలయంలో తాయత్తు కట్టుకోవడం అనాదిగా వస్తోంది. దీని కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు. అదే నెల్లూరు నగరంలోని ఇరు కళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం. క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలం సమయంలో ఇప్పటి నెల్లూరుకు అప్పట్లో సింహపురి అనే పేరు ఉండేది. దక్షిణాది లోని అన్ని ముఖ్య నగరాలకు కూడలిగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా సింహపురి ప్రసిద్ది. మౌర్య చక్రవర్తి అశోకుని నుంచి పల్లవ, చోళ, కాకతీయ, శాతవాహన, పాండ్య, తెలుగు చోడ, విజయనగర ఇలా ఎన్నోరాజ వంశాలు ఈ పట్టణ సర్వతోముఖాభివృద్ది కి కృషిచేసినట్లుగా వివిధ చారిత్రిక పరిశోధనా గ్రందాల ఆధారంగా అర్థమవుతోంది. ఇలా ఎందరో రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో పురాణ ప్రసిద్దిచెందిన పురాతన ఆలయాలకు కొదవ లేదు. నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి.

విక్రమ సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వాటిల్లో ఒకటి. స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతినిత్యం ఎందరో భక్తులు దర్శించుకొనే ఈ అమ్మవారు సుమారు ఎనిమిదో శతాబ్దానికి పూర్వమే కొలువుతీరినట్లుగా క్షేత్ర గాథ తెలుపుతోంది. పదకొండు నుంచి పన్నెండో శతాబ్దాల మధ్యకా నాటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయం పక్కనే ఉన్న స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు తవ్వించాడు. ఈయన కుమారుడు కాకతీయ ప్రతాప రుద్రుడు ఈ ప్రాంతాన్ని తన సేనాని అయిన ముప్పిడి నాయనకు కానుకగా ఇచ్చాడు. వారి తదనంతరం వారి అనుచరులైన “లోక బోయడు”, “బ్రాహ్మణ బోయడు” ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది.

శాసనాల ఆధారంగా ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు చోడులు, కాకతీయ ప్రభువులు, వారి సేనాపతులు ఈ ఆలయాభివృద్దికి ఎంతో పాటు పడ్డారు.పదునాలగవ శతాబ్దంలో విజయనగర రాజుల ప్రతినిధిగా ఉదయగిరి ప్రాంతాన్ని పాలించిన “సావన్న ఒరియులు”కాలంలో ప్రతి శుక్రవారం స్వర్ణల చెరువు వద్ద పెద్ద సంత జరిగేది. స్థానికులే గాక విదేశీ వర్తకులు కూడా దానిలో పాల్గొనేవారు. సంతను నిర్వహించే అధికారి అయిన కాంచనం వసూలు చేసిన వర్తక సుంకం నుండి కొంత శాతం శ్రీ ఇరుకళల పరమెశ్వరీ అమ్మవారి నిత్య నైవేద్యాలకు, ఉత్సవాల నిమిత్తం కేటాయించేవారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మూడురోజుల పాటు రొట్టెల పండగ ఈ స్వర్ణాల చెరువు దగ్గర జరుపుకొంటున్నారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ పండగ సందర్బంగా రొట్టెలు ఇస్తున్నారు. రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం రాజుల తదనంతరం ధూప దీప నైవేద్యాలుకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డ మాట వాస్తవమే.అయితే కొన్ని ఏళ్ల నుంచి నిత్యం దిన దినాభివృద్ది చెందుతూ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నిర్మించబడినది. స్వాగత ద్వారం, రాజ గోపురాలు నూతన నిర్మాణాలు.ప్రధాన ద్వారం వద్ద నుండి ఆలయం వైపుకు ఉన్న మార్గంలో ఉత్సవ మరియు కళ్యాణ మండపం కనిపిస్తుంది.

ప్రధాన ఆలయం ఎఱ్ఱని బొంత రాళ్ళతో నిర్మించబడినది.ముఖమండపం, నమస్కార మండపం , అర్ధ మండపం దాటితే గర్భాలయంలో స్వర్ణాభరణ భూషితురాలిగా, సప్తవర్ణ పుష్పాలంకరణలో ఉపస్థిత భంగిమలో శ్రీ ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. నమస్కార మండప ముఖ ద్వారం పైన ఉన్న రాతి స్తంభాల పైన తెలుగు శాసనాలు కనిపిస్తాయి.ఇదే మండపంలో కొన్ని దేవతా మూర్తులు ప్రతిమలు దర్శనం ఇస్తాయి. పూర్వం ముఖ మండప స్తంభాలపై కొన్ని తెలుగు, తమిళ, దేవనాగరి శాసనాలు ఉండేవి. అవి శిథిలమవ్వడంతో రెండు వేల రెండో సంవత్సరంలో చేసిన ఆలయ పునః నిర్మాణసమయంలో తొలగించారు.

ఈ ఆలయంలో జంతు బలులు అత్యంత సహజం. భక్తులు కోరిన కోర్కెలు తీరితే అమ్మవారికి జంతు బలులు ఇవ్వడం ఇక్కడి ఆచారం. నెల్లూరు పట్టణంలో నరసింహ కొండకు వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ అయం. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి సులభంగా చేరుకోవచ్చు. దేశం నలుమూలల నుంచి రైలు మార్గంలో నెల్లూరు చేరుకోవచ్చు. చక్కని వసతి భోజన సదుపాయాలు లభిస్తాయి. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు సమీపంలోని శ్రీ తల్పగిరి రంగనాయక స్వామి, నరసింహ కొండ, శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయాల ను సందర్శించుకొనే  అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి