AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మన్యం వీరుడి వారసులతో ప్రత్యేక భేటీ.. భీమవరంలో 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. జులై నాలుగున 11గంటలకు భీమవరంలో ల్యాండ్ కానున్న ప్రధాని మోదీ, ముందుగా 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

PM Modi: మన్యం వీరుడి వారసులతో ప్రత్యేక భేటీ.. భీమవరంలో 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
Pm Modi Alluri Sitarama Raju
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2022 | 8:05 PM

Share

జులై నాలుగున ఏలూరు జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ(PM Modi). ఆజాదీ క అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో(Alluri Sitarama Raju) పాల్గొంటారు. జులై నాలుగున 11గంటలకు భీమవరంలో ల్యాండ్ కానున్న ప్రధాని మోదీ, ముందుగా 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం, పెదఅమిరం గ్రామంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై హైలెవల్‌ రివ్యూ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు కలిసి సమీక్ష నిర్వహించారు. విగ్రహావిష్కరణ, బహిరంగ సభ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ క అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున భాగస్వామి అవుతోందని అన్నారు వైసీపీ లీడర్స్‌. ప్రధాని మోదీ పర్యటన కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రేపు భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్నారు ప్రధాని మోదీ. ఇది అల్లూరి 125వ జయంతి సంవత్సరం కూడా. అందుకే బ్రిటిష్ తెల్లదొరల్ని ఎదిరించి, దేశమాత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడిన విప్లవ వీరుడికి ఘన నివాళి అర్పించాలని నిర్ణయించారు. 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహం ఇప్పటికే భీమవరం చేరుకుంది. భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌ మునిసిపల్‌ పార్క్‌లో అల్లూరి విగహ్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన అల్లూరి విగ్రహం బరువు 15 టన్నులు.

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పెద అమిరంలో జరిగే ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. దీంతో భీమవరం టౌన్‌తో పాటు సమీపంలోని పెద అమిరం పరిసర ప్రాంతాలు పోలీసుల దిగ్బంధంలోకి వెళ్లాయి. మొత్తం నాలుగు హెలిపాడ్లను ఏర్పాటు చేశారు. ప్రధానిని కలిసేందుకు సిద్ధం చేసిన వీఐపీ గ్యాలరీ ప్రాంగణంతో పాటు పరిసరాలను బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు, ఎస్పీజీ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భీమవరం నుంచి ఉండి, గణపవరం, చేబ్రోలు, ఏలూరు, గన్నవరం వరకు రహదారి వెంబడి 2 వేల మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. నాలుగు హెలిపాడ్‌లకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నిన్ననే హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ నుంచే ప్రధాని రేపు ఏపీలోని భీమవరానికి రానున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ, బహిరంగ సభకు భారీగా జనం తరలిరానున్నారు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భీమవరం టౌన్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భీమవరం ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాయి. క్షత్రియుల జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అయితేనే ఈ విప్లవ వీరుడి విగ్రహావిష్కరణ బావుంటుందని అంతా భావించారు.

ఏపీ వార్తల కోసం