Andhra Pradesh: డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు.. వారి చర్య అభ్యంతరకరమంటూ..
Andhra Pradesh: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
Andhra Pradesh: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇదే అంశంలో సీఐడీ అధికారుల తీరును నిరసిస్తూ.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. వారిపై ఫిర్యాదు చేశారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ పోలీసులు వేధించారని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేశారని అన్నారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారు.
గంటల తరబడి స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడం దారుణం అని విమర్శించారు. విచారణ గదిలో ఎటువంటి సీసీ కెమెరాలు లేవని, అరెస్టు చేసే సమయంలో, విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. కొందరు కళంతకితమైన అధికారుల సహకారంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందని అన్నారు. నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా నిలబడాలని డీజీపీని కోరారు చంద్రబాబు. సీఐడీ అధికారులు వెంకటేష్, సాంబశివరావు ఇళ్లవద్ద అర్థరాత్రిపూట చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలను లేఖకు జతచేశారు చంద్రబాబు.