IRCTC: హైదరాబాద్ నుంచి నేపాల్‌కు 7 రోజుల అద్భుత టూర్.. లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్‌పూర్ చుట్టేయొచ్చు!
IRCTC Nepal Tour Package Telugu: హైదరాబాద్ నుంచి నేపాల్‌లోని లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్‌పూర్ ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్‌సీటీసీ 6 రాత్రులు, 7 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. రూ.63,500 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ వివరాలు, ప్రయాణ తేదీ, సందర్శించే ప్రదేశాలు, సదుపాయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

IRCTC Nepal Tour Package from Hyderabad Telugu: నేపాల్ పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. “Royal Nepal Ex – Hyderabad” పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్‌పూర్ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. టూర్ 2026 నవంబర్ 21న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి విమానంలో గోరఖ్‌పూర్‌కు చేరుకుని అక్కడి నుంచి లుంబినీకి ప్రయాణిస్తారు. తొలి రోజు లుంబినీలో బస చేస్తారు. రెండో రోజు మాయాదేవి ఆలయం, వరల్డ్ పీస్ పగోడా సందర్శించి పోఖారాకు వెళ్తారు. మూడో రోజు ఉదయాన్నే సారంగ్‌కోట్ సన్‌రైజ్ పాయింట్, బింద్యాబాసిని ఆలయం, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ, ఫేవా సరస్సులో బోటింగ్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు.
నాలుగో రోజు పోఖారా నుంచి ఖాట్మండుకు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో మనోకామనా ఆలయాన్ని దర్శిస్తారు. ఐదో రోజు పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్, స్వయంభునాథ్ ఆలయం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఆరో రోజు విమానంలో జనక్‌పూర్ చేరుకుని ప్రసిద్ధ జానకి ఆలయాన్ని దర్శిస్తారు. ఏడో రోజు దర్భాంగా విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది.
ప్యాకేజీ ధరలు
సింగిల్ షేరింగ్‌కు రూ.80,600, డబుల్ షేరింగ్‌కు రూ.68,000, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.63,500గా ధర నిర్ణయించారు. బెడ్‌తో పిల్లలకు రూ.56,800, బెడ్ లేకుండా రూ.41,400గా ఉంది.
ప్యాకేజీలో విమాన ప్రయాణం, 3 స్టార్ హోటల్ వసతి, 6 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 డిన్నర్లు, స్థానిక గైడ్, పేర్కొన్న సందర్శనా ప్రాంతాల ప్రవేశ రుసుములు, ప్రయాణ బీమా వంటి సదుపాయాలు ఉన్నాయి.
భారతీయ పౌరులు నేపాల్ ప్రయాణానికి 6 నెలలకు పైగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్‌పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ప్యాకేజీ బుకింగ్ సమయంలో 100 శాతం చెల్లింపు అవసరం. విమాన ఛార్జీలు, పన్నుల్లో మార్పులు ఉంటే అదనపు మొత్తాన్ని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




