ఇష్ట దైవానికి ఖరీదైన ఇంటిని రాసిచ్చి.. దాతృత్వం చాటుకున్న భక్తుడు..!
తెలంగాణ తిరుపతిగా పేరున్న యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. పిలిస్తే పలికే దైవంగా స్వామి వారిని భక్తులు భావిస్తుంటారు. కోరుకున్న కోరికలు తీరిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు విరాళాలు ఇస్తుంటారు. కానీ ఓ భక్తుడు మాత్రం తన ఇష్ట దైవానికి ఎలాంటి విరాళం ఇచ్చారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంది. భక్తులకు ఇలవేల్పుగా యాదగిరి కొండపై వెలసిన పాంచనరసింహుడు.. భక్తులను కరుణిస్తున్నాడు. భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరుస్తూ ఇష్ట దైవంగా మారాడు. హైదరాబాద్ మహానగరం తిలక్ నగర్ కు చెందిన ముత్తినేని వెంకటేశ్వర్లు యాదాద్రి లక్ష్మీనరసింహుడికి పరమ భక్తుడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి రిటైర్డ్ అయ్యారు.
ఉద్యోగిగా ఉన్న సమయంలోనే తిలక్ నగర్ లో ఎంతో ముచ్చటపడి సొంత ఇంటిని నిర్మించుకున్నారు వెంకటేశ్వర్లు. 152 గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ 3, పెంట్ హౌస్ ను కట్టుకున్నాడు. యాదగిరి నరసన్న కరుణతో పిల్లలు కూడా ఆర్థికంగా స్థిరపడ్డారు. తాను కోరుకున్న కోరికలను నెరవేర్చిన స్వామివారికి ఏదైనా విరాళంగా ఇవ్వాలని భక్తుడు వెంకటేశ్వర్లు భావించాడు. ఇందుకోసం తాను ఎంతో ఇష్టపడి హైదరాబాద్ తిలక్ నగర్ లో కట్టుకున్న ఇంటిని ఇష్టదైవమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి విరాళంగా రాసి ఇచ్చాడు.
నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త మండలి చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో దేవాలయ అధికారులకు అందజేశారు. స్వామి వారికి ఇంటిని విరాళంగా ఇచ్చిన భక్తుడిని ఆలయ అధికారులు.. లక్ష్మినరసింహ స్వామి ప్రసాదం అందచేసి సన్మానించారు. తన ఇష్ట దైవమైన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామికి నాలుగు కోట్ల రూపాయల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చిన భక్తుడు వెంకటేశ్వర్లును పలువురు అభినందించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..