Vastu Tips: అన్యోన్య దాంపత్యానికి ‘వాస్తు’ మార్గం.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

కనీసం 75 శాతం ఇంటినైనా వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం కట్టుకోగలిగితే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూవుతుందని, జాతక దోషాలను సైతం అదుపులో..

Vastu Tips: అన్యోన్య దాంపత్యానికి 'వాస్తు' మార్గం.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
Vastu Tips
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 19, 2022 | 9:00 AM

కనీసం 75 శాతం ఇంటినైనా వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం కట్టుకోగలిగితే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూవుతుందని, జాతక దోషాలను సైతం అదుపులో ఉంచుతుందని ప్రఖ్యాత వాస్తు శాస్త్ర నిపుణుడు, జ్యోతిష పండితుడు మధుర కృష్ణమూర్తి శాస్త్రి తన వాస్తు శాస్త్ర వివేకము అనే పరిశోధనాత్మక గ్రంథంలో వివరించారు. ఇంటిని 100 శాతం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకుంటే ఇక చెప్పనే అక్కరలేదు. ఆధునిక యుగంలో ఇండిపెండెంట్ ఇంటికి బదులు ఫ్లాట్లో ఉండటం అనేది ఎక్కువ కావడం వల్ల పరిపూర్ణ స్థాయిలో వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు, వసతులు ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కావడం లేదని అందరికీ తెలుసు. అయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటించే పక్షంలో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతుందని, ఇంట్లోని వారు హాయిగా, ఆనందంగా జీవితం గడపగలుగుతారని, ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ ఇంటిలో నివసించే దంపతులు అన్యోన్యంగా, అరా మరికలు లేకుండా సుదీర్ఘమైన దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

వాస్తు శాస్త్ర నిపుణులు ఇందుకు శంకుస్థాపన, పునాదుల నిర్మాణం, ద్వార బంధాల నిర్మాణం నుంచి గృహప్రవేశం వరకు కొన్ని పద్ధతులను, నియమ నిబంధనలను సూచించారు. సొంత నివాసంలో కుటుంబమంతా ప్రశాంతంగా, సంతోషంగా జీవితం సాగించడానికి వాస్తు శాస్త్రం ఏర్పడింది. ఇందులో శాస్త్రీయమైన ఇంజనీరింగ్ పద్ధతులను కూడా జోడించి ప్రస్తుత కాలంలో ఇళ్లను నిర్మించడం జరుగుతోంది. ఇంట్లోని దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు కళకళలాడుతుంటుందని అందరికీ తెలిసిన విషయమే. వాస్తు శాస్త్ర నిపుణులు, ఇంజనీర్లు ఆ ఉద్దేశంతోనే శ యనశాల లేదా పడకగది ఏ విధంగా ఉండాలన్నది అధ్యయనం చేసి కొన్ని పద్ధతులను నిర్దేశించారు. ఇంజనీర్లు కూడా ఫ్లాట్లు నిర్మించినా, ఇండిపెండెంట్ ఇంటిని నిర్మించినా దీనికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటిలోని ఇతర గదుల్లో వాస్తు శాస్త్ర సూత్రాలను యధావిధిగా పాటిస్తూనే పడకగది నిర్మాణం విషయంలో విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు.

మాస్టర్ బెడ్ రూమ్ అంటే ప్రధానమైన పడకగది చతురస్రాకారంలో ఉంటే మంచిది. కనీసం 8 గజాల విస్తీర్ణం ఉండాలి. చాలినంత వెలుతురుకు అవకాశం ఉండాలి. పడకగది మరీ చల్లగా, మరీ వేడిగా ఉండకూడదు. ఇండిపెండెంట్ ఇల్లు అయితే పడకగది వెనుక గానీ, కిటికీల పక్కన గాని పూల మొక్కలు నాటడం మంచిది. ఆ మొక్కలు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉండాలి. వీటివల్ల ఆరోగ్యం నిలకడగా ఉండటమే కాకుండా, మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. పడమర లేదా దక్షిణ దిక్కులో తలపెట్టి నిద్రపోవడానికి వీలుగా మంచాలను ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా పడకగది మధ్యలో దీపాన్ని అమర్చుకోవాలి. పడక గదిలో అద్దాలు, విరిగిపోయిన వస్తువులు, ముక్కలైన గడియారాలు వగైరాలు ఉండకూడదు. వీటివల్ల అన్యోన్య దాంపత్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక పడకల పక్కన మంగళ దృవ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అందుబాటులో మంచినీళ్ల పాత్రలను ఉంచుకోవాలి. ఆ గదిలో పెట్టుకోవాల్సిన బొమ్మలు, చిత్తరువుల గురించి కూడా నిపుణులు వివరించారు. శివపార్వతులు, సీతారాములు, రాధాకృష్ణుడు వంటి దంపతుల ఫోటోలను మాత్రమే అమర్చుకోవాలి. గంధర్వుల చిత్తరువులను ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే. ఈ చిట్కాలను పాటిస్తే ఆ ఇంట్లోని దంపతులు అన్యోన్యంగా, ఆదర్శప్రాయంగా జీవితం సాగిస్తారని, ఆ ఇంటి యజమాని జీవితంలో అన్ని విధాల పురోగతి సాధిస్తారని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.