Lord Hanuman Birth Place: హనుమంతుడి పుట్టుకపై రగడ..ఆంధ్రప్రదేశ్-కర్ణాటకల మధ్య తెగని పంచాయితీ!
Lord Hanuman Birth Place: హనుమంతుడు పుట్టిన స్థలంపై చాలా ఏళ్ళుగానే వివాదం కొనసాగుతోంది. తిరుమల ఏడుకొండల్లో ఒక్కటైన అంజనాద్రి శ్రీరామ పరమభక్తుని జన్మస్థలంగా టీటీడీ కమిటీ చెబుతుండగా...కర్ణాటక మరో వాదన వినిపిస్తోంది.
హనుమంతుడు, ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, వానర వీరుడు, వాయుదేవుని సుతుడు, పరమ రామభక్తుడు. పేర్లు ఏవైనా భారతదేశంలో హనుమంతుడ్ని దేవుడిగా ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతునికి గుళ్లు ఉన్నాయి. శ్రీరామదాసునిగా ప్రసిద్ది చెందిన ఆంజనేయుడి పుట్టుక గురించి ఎన్నో ఏళ్లుగా వాదోపవాదనున్నాయి. ఎవరికి వారే తమ ప్రాంతంలో పుట్టారంటూ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలు, కథలు ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తమదైన శైలిలో హనుమాన్ పుట్టుక రహస్యం, ఆధారాలను ప్రస్తావించనుంది. ఇది తెలుసుకున్న కర్నాటక హనుమంతుడు పుట్టింది నడయాడింది అంతా కర్నాటకలో అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఆంజనేయుడి పుట్టుక వివాదస్పదమైంది.
హనుమంతుడు పుట్టిన స్థలంపై చాలా ఏళ్ళుగానే వివాదం కొనసాగుతోంది. మారుతి జన్మస్థలిగా విరాజిల్లుతున్న దేశంలో చాలా ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు..కాదు కాదు కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్‌లో అని మరొకరు అంటుంటారు. హర్యానాలో జన్మించినట్లు మరికొందరు వాదిస్తే…జార్ఖండ్‌లో అని ఇంకొకరి వాదన. మహారాష్ట్రలోని నాసిక్ – త్రయంబకేశ్వర్ లో అంజనేయ స్వామి పుట్టిన ప్రదేశంగా పిలిచే పర్వతముంది.
తెలుగు రాష్ట్రాలలో ఐదు ప్రసిద్ధ అంజనేయ క్షేత్రాలున్నాయి. తిరుమల కొండపై జాపాలి, కడప జిల్లా గండి, కరీంనగర్ జిల్లా కొండగట్టు, పశ్చిమ గోదావరి జిల్లా మద్ది, మద్దిమడుగు క్షేత్రాలు అవి. ఈ క్షేత్రాలలో హనుమంతుడు స్వయంభువుగా వెలశాడు. మన తిరుమల గిరుల్లోనే ఆ పవనసుతుడు జన్మించాడనే కొత్త చర్చ మొదలయ్యింది. శ్రీరామ నవమి నాడు(ఏప్రిల్ 21) ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు టీటీడీ సిద్ధమౌతోంది. హనుమంతుడి జన్మస్థానం ఆధారాల సేకరణకు డిసెంబరులో టీటీడీ కమిటీ ఏర్పాటు చేసింది. పలుసార్లు సమావేశమై చర్చించారు కమిటీ సభ్యులు. ఐదు పురాణాలు, పలు గ్రంథాలు కమిటీ పరిశీలించింది. హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించే ఆధారాలున్నట్లు కమిటీ ప్రకటించింది. ఈ ఆధారాలు, ఇతర వివరాలతో సమగ్రమైన పుస్తకాన్ని ముద్రించనుంది టీటీడీ.
జాపాలి తీర్థమే.. ఆంజనేయుడి జన్మస్థలి అంటున్నారు పరమ భక్తులు. టీటీడీ హన్మంతుడి జన్మస్ధలాన్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ చరిత్రకారులు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో హన్మంతుడి జన్మరహస్యాన్ని శోధించాలంటూ అధికారులకు టీటీడీ ఆదేశించింది. అంజనీదేవి.. బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా చెబుతూ..ఏపీలోని పవిత్ర తిరుమల ఏడుకొండల్లో ఒక్కటైన అంజనాద్రిపై జాపాలి తీర్థంలో నిత్యం పూజలందుకుంటున్నాడు హనుమంతుడు. పవనసుతుడు ఇక్కడే జన్మించినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయుడికి అంజనీదేవి ఇక్కడ జన్మనిచ్చిన కారణంగానే..ఈ ప్రాంతం అంజనాద్రిగా పేరుపొందిందంటున్న ఇతిహాసాలు చెబుతున్నాయి.
తిరుమలలో జాపాలి తీర్థం హనుమంతుడి జన్మస్థలంగా కొందరు బలంగా నమ్ముతారు. శ్రీ హనుమ జన్మస్థలం-అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్ జీ హనుమత్ ప్రసాద్ ఓ గ్రంథం రాశారు. హనుమ చరిత్రకు శ్రీపరాశర సంహిత అనే గ్రంథం ప్రామాణికం కాగా…స్కంధ పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారని హనుమత్ ప్రసాద్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
కాదు..కర్నాటక అనే వాదన హనుమంతుడు సంచరించినప్పుడు చూసిన వారు ఎవరూ లేరు. ఆనాటి గ్రంథాలు, చరిత్రకారుల నుంచి మాత్రమే కాలాన్ని లెక్కిస్తున్నారు. ఆధారాలు లేకపోవడం వల్ల.. చాలా మంది పౌరాణిక సంఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతుడి జన్మస్థలంపై వివాదం రేగుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ రాష్ట్రంలోనే హనుమంతుడి నిజమైన జన్మస్థలం అని వాదన వినిపిస్తున్నాయి. తిరుమల హనుమంతుడి జన్మస్థలమన్న టీటీడీ ప్రకటనతో కర్ణాటక ప్రభుత్వం విభేదిస్తోంది. మరో వాదనను తెరమీదకు తీసుకొచ్చింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా అనెగుడికి సమీపంలో ఉన్న అంజనాద్రి కొండను హనుమంతుడి జన్మస్థలంగా కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. ఈ స్థలానికి కిష్కిందా అని కూడా పిలుస్తారు. రామాయణంలోనూ కిష్కిందా ప్రస్తావన ఉన్నందున, హనుమంతుడి జన్మస్థలం ఇదేనని కర్ణాటక వాదిస్తోంది.
మరోవాదన హనుమంతుడు కర్ణాటకలోని అరేబియా సముద్రం ఒడ్డున జన్మించాడని మరో వాదన ఉంది. శివమోగలోని రామచంద్రపుర మఠం అధిపతి రాఘవేశ్వర భారతి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రామాయణంలో సీతుకు హనుమంతుడు అదే విషయాన్ని ప్రస్తావించాడన్న భారతి చెబుతారు. గోకర్ణను హనుమాన్ జన్మభూమి అని కిష్కిందను తన కర్మభూమి అని కన్నడీగుల వాదనగా ఉంది. ఎవరి వాదన వారిదే…హనుమాన్ పుట్టుక వివాదం తెగని పంచాయితీలా మారింది.
ఇవి కూడా చదవండి..కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన వైష్ణవిదేవి అమ్మవారి శార్దియా నవరాత్రి వేడుకలు
ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా.. విష్ణు సహస్రం కలిగిస్తే ఫలితం ఏమిటంటే..!