Sabarimala: మకరజ్యోతికి వెళ్తున్నారా..? తిరుపతి ఘటనతో అప్రమత్తమైన శబరిమల..!

తిరుపతి తొక్కిసలాట ఘటనతో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల అధికారులు అలర్ట్ అయ్యారు. కేరళలోని అయ్యప్ప సన్నిధానం శబరిమలలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన విషాద ఘటనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మకరజ్యోతి దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు.

Sabarimala: మకరజ్యోతికి వెళ్తున్నారా..? తిరుపతి ఘటనతో అప్రమత్తమైన శబరిమల..!
Sabarimala Rush
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 10, 2025 | 5:21 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. తిరుపతి ఘటన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కలవరం మొదలైంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి ఘటన నేపథ్యంలో…అన్ని ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. భారీ జన సందోహాలు వస్తున్న నేపథ్యంలో…ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలో పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో గతంలోనూ ఎన్నో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. వదంతులు, భయాలు, కొందరి తొందరపాటు చర్యలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. దక్షిణాదిలో ప్రసిద్ధిచెందిన కేరళ శబరిమల పుణ్యక్షేత్రంలో జరిగిన విషాదాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. 2011 జనవరి 14న జరిగిందీ దారుణం. శబరిమల పరిధిలోని పుల్లమేడు దగ్గర భక్తుల పైకి జీపు దూసుకెళ్లటం తొక్కిసలాటకు కారణమైంది. ఈ దుర్ఘటనలో 104మంది మరణించారు. మకరజ్యోతి దర్శనాల్లో తొక్కిసలాటలు, చావు కేకలతో అప్పట్లో కేరళ ఉలిక్కిపడింది.

తిరుపతి ఘటనతో, మరోసారి గత విషాదాలను, చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంది శబరిమల. ఇక మకరవిళక్కు.. జనవరి 14వ తేదీన సంక్రాంతి నాడు రానుంది. ఆ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు.. మకరజ్యోతి ముమ్మార్లు కనిపిస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులతో శబరిమల కిటకిటలాడుతోంది. ఇక మకర జ్యోతి దర్శనం ఇచ్చే రోజున ఆ జన సందోహం.. మరింత భారీగా పెరగనుంది. ఆ సమయంలో ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలకు తావు ఇవ్వకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.

మకర జ్యోతి దర్శనం కోసం ఇప్పటికే శబరిమలకు లక్షలాదిగా పోటెత్తారు భక్తులు. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటనతో శబరిమల ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. మకరజ్యోతి నాడు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆన్‌లైన్‌ దర్శనాల టికెట్ల సంఖ్యను అధికారులు కుదించారు. జనవరి 13వ తేదీన 50 వేల మందికి ఆన్‌లైన్‌ స్లాట్లు కేటాయించారు. జనవరి 14వ తేదీన 40వేలమందికి, 15న 60 వేలమంది.. ఆన్‌లైన్‌ దర్శన టికెట్లను బుక్‌ చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శబరిమల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..