Konaseema Tirupati: వాడపల్లి వెంకన్న సన్నిధిలో విదేశీయులు.. భారతీయ సాంప్రదాయంలో స్వామివారిని దర్శించుకున్న దంపతులు
ఆదివారం సెలవు దినం కావడంతో కోనసీమ తిరుపతికి భక్తులు పోటెత్తారు. అయితే ఓ విదేశీ వృద్ధ దంపతులు కూడా వాడపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించిన దంపతులు రెండు చేతులు ఎత్తి స్వామివారికి భక్తితో మొక్కారు..
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని వాడపల్లిలో స్వయంభువుగా వెలసిన వెంకటేశ్వర స్వామి.. క్షేత్రం కోనసీమ తిరుపతిగా పేరుగాంచింది. ఈ పేరు తెలియనివారు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. స్వామి వారి మహత్యం అటువంటిది. ఒకప్పుడు ఈ స్వామివారిని దర్శించుకునే భక్తులు సంఖ్య తక్కువే.. ఇంకా చెప్పాలంటే ఆలయ సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు శ్రీవారికి కోట్లాది రూపాయల ఆదాయం.. అభివృద్ధి.. వెంకన్న స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. పండగలు, పర్వదినం రోజుల్లో అయితే ఈ భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఇదంతా స్వామి మహిమే అని చెబుతారు. పవిత్రమైన కార్తీకమాసంలో వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో వెంకన్న దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అయితే ఓ విదేశీ వృద్ధ దంపతులు కూడా వాడపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించిన దంపతులు రెండు చేతులు ఎత్తి స్వామివారికి భక్తితో మొక్కారు..
నుదిటిపై తిలకం దిద్దుకుని అచ్చమైన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ దంపతులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారి విగ్రహాన్ని ఆలయ శిల్పకళాసంపదను చూసి ముగ్ధులయ్యారు. నమో వెంకటేశాయ.. మేము ఆస్ట్రియా నుంచి వచ్చాము.. మాకు పెద్దగా హిందూ సంస్కృతి గురించి తెలియదు.. కానీ ఇప్పుడు ఈ ఆలయం చూసిన తర్వాత హిందూ సంస్కృతి, ఫిలాసఫీ తనకు నచ్చినట్లు పేర్కొన్నారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని అద్భుతమైన ఆలయాన్ని చూసినందుకు తాము చాలా సంతోషముగా ఉన్నామని పేర్కొన్నారు విదేశీ దంపతులు.
వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఎర్రచందనం లో ఉంటుంది. అందుకే స్వామివారికి పంచామృత అభిషేకంలు చేయరు. కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు. అయితే 2000 సంవత్సరం వరకు భక్తుల రద్దీ పెద్దగా ఉండేది కాదు..
ఏడు శనివారాలు వెంకన్నగా ఖ్యాతి:
2000లో ప్రతి శనివారం వచ్చే ఓ భక్తుడును చూసి ఆలయంలో పనిచేసే ఓ అధికారి ఆ భక్తుడిని ప్రశ్నించగా తనకు ఓ సిద్ధాంతి ఇక్కడ స్వామివారిని ఏడు శనివారాలు దర్శించుకుని, ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేయాలని చెప్పారని.. అప్పుడు తన కష్టాలు తీరినట్లు పేర్కొన్నాడు ఆ భక్తుడు. ఆ నోటా ఈనోటా ఈ విషయం తెలియడంతో..గ్రామస్థులు ప్రతి శనివారం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకునే వారు. వారి కోరికలు నెరవేరాయి. ప్రస్తుతం స్వామివారి మహిమ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. 2001 నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..