Basara Temple: అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో అక్షరాభ్యాసాల వివాదం.. భక్తుల నమ్మకంతో వ్యాపారం.. !

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసాలకు ఫేమస్. ఏటా వసంత పంచమిరోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. మిగతా రోజుల్లోనూ ఈ తంతు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొందరు బాసరలో ప్రైవేటు దుకాణాలు తెరిచారని, వాళ్లు శాస్త్రవిరుద్దంగా అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారన్నది అనుష్ఠాన పరిషత్ ఫిర్యాదు.

Basara Temple: అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో అక్షరాభ్యాసాల వివాదం.. భక్తుల నమ్మకంతో వ్యాపారం.. !
Basara Aksharabhyasam
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Jul 06, 2024 | 5:51 PM

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసాలకు ఫేమస్. ఏటా వసంత పంచమిరోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. మిగతా రోజుల్లోనూ ఈ తంతు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొందరు బాసరలో ప్రైవేటు దుకాణాలు తెరిచారని, వాళ్లు శాస్త్రవిరుద్దంగా అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారన్నది అనుష్ఠాన పరిషత్ ఫిర్యాదు. ఆలయంలో పలక లేదంటే బియ్యంలో అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. కానీ కొత్తగా వచ్చిన ప్రైవేటు వ్యక్తులు మాత్రం నాలుకపై బీజాక్షరాలు రాస్తూ హడావిడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. గుడి సంప్రదాయాన్ని భ్రష్టుపట్టిస్తున్న అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనుష్ఠాన పరిషత్ తీర్మానించింది. ఆలయ అధికారులకు ఫిర్యాదు కూడా చేసింది. నాలుకపై బీజాక్షరాలతో చేసే అక్షరాభ్యాసం చేయించే వాళ్లను నమ్మొద్దంటూ ఇప్పటికే ఆలయంలో పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు ఆలయ ఈవో.

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటే విద్యాబుద్దులు కలుగుతాయని అపార నమ్మకం. తమ పిల్లలకు అమ్మవారి చెంత అక్షర స్వీకారం చేయిస్తే విజ్ఞానవంతులు‌ అవుతారని.. మంచి భవిష్యత్ ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి ఇప్పుడు ఆ అక్షరాభ్యాస వేడుకే వివాదంలో చిక్కుకుంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత అనాదిగా వస్తున్న అచారాన్ని కాదని కొందరు కొంత పోకడలకు వెళ్తుండటం వివాదానికి కారణమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల నమ్మకాన్ని క్యాచ్ చేసుకుని కొందరు శాస్త్ర విరుద్దంగా బాసర పుణ్య క్షేత్రంలో వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతోంది అనుష్టాన పరిషత్.

ఆగమ శాస్త్రాలకు విరుద్దంగా బీజాక్షరాల తో అక్షర శ్రీకారాలు జరిపిస్తూ బాసర అమ్మవారికి అపఖ్యాతి తీసుకుని వస్తున్నారంటూ ఆరోపిస్తోంది శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్. వేద పాఠశాల పేరుతో బాసరలో ఆలయ నియమాలకు ‌విరుద్దంగా వ్యవహరిస్తూ అక్షరాభ్యాసం కొనసాగిస్తున్న తీరును తప్పు పడుతోంది జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్. ఆలయం ప్రదాన అర్చకులు సైతం బాసరలోని వేద పాఠశాల నిర్వాహకులు కొనసాగిస్తున్న బీజాక్షరాల అక్షరాభ్యాసాలను తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు.

వీడియో..

ఇంతకీ ఈ బీజాక్షరాల వివాదం ఏంటి..?

శ్రీశ్రీ జ్ఞాన సరస్వతి జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ స్థాపకులు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ చెప్తున్నట్టుగా.. పురాతన శాస్త్ర ధర్మాల ప్రకారం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో మూడే ముఖ్యమైనవి. ఒకటి అమ్మవారి అభిషేకం.. అభిషేకం అనంతరం అమ్మవారి ముఖానికి అలంకరించిన పసుపు బండారి ప్రసాదంగా స్వీకరించడం. రెండు పలకపై బియ్యం వేసి అక్షర శ్రీకారం జరపడం. భారత దేశంలోనే జ్ఞాన‌ సరస్వతి‌ కొలువైన రెండవ పుణ్యక్షేత్రమైన బాసర సన్నిధిలో అక్షరాభ్యాస పూజ జరపడం ప్రత్యేకం. ఇక్కడ అక్షరాభ్యాస పూజ నిర్వహించిన వారు ఎంతో ప్రయోజకులై ఉన్నత స్థాయి చేరుకుంటారని భక్తుల‌ ప్రగాఢ విశ్వాసం.

మూడవది ప్రతి మంగళవారం తేనెతో ముగ్గురమ్మలకు అభిషేకం నిర్వహించి, ఆ తేనెను ప్రసాదంగా భక్తులకు అందించడం. ఈ మూడు మాత్రమే బాసర అమ్మవారి సరస్వతి క్షేత్ర ప్రత్యేకం. కానీ కొందరు ధనార్జనే ధ్యేయంగా బాసరలో వేద పాఠశాలలను ఏర్పాటు చేసి, మేం బీజాక్షరాలు రాస్తాం దాంతో పిల్లల జీవితాల్లో బాగుపడతాయని నమ్మబలుకుతూ నాలుకపై గరికతో బీజాక్షరాలు రాస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వేదాల్లో ఆలయ పురాణాల్లో లేదని.. కాళికామాత కాళిదాసుకు మాత్రమే బీజాక్షరాలతో అక్షరజ్ఞానం ప్రసాదించిందని, అట్టి నియమాన్ని జ్ఞాన సరస్వతి నియమాల పేరుతో భక్తులను బురిడి కొట్టించడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అనుష్టాన పరిషత్ నిర్వాహకులు. వెంటనే బాసర లో బీజాక్షరాల అక్షరాబ్యాస లను నిలిపి వేయాలని వారం రోజులు సమయం ఇస్తున్నామని, వారం రోజులలో వేదపాఠశాల నిర్వాహకులు బీజాక్షరాల తతంగం నిలిపి‌వేయాలని, లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు అనుష్టాన పరిషత్ స్థాపకులు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ.

వేదపాఠశాల పేరిట బాసరలో భక్తులను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి నది తీరంలో గంగా హారతి అంటూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి గంగాహారతి నిర్వహిస్తున్నారు. వేదపాఠశాల పేరిట అమ్మవారి పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అమ్మవారి ఆలయంలో ఆచారంగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా అక్షరాభ్యాసం, దీక్ష భిక్ష, అమ్మవారి పసుపు బండారి తేనె ప్రసాదం మాత్రమే జ్ఞాన సంపత్తికి కేంద్రాలుగా సాగుతున్నాయని, ఈ నియమాలను కాపాడాలని‌ కోరారు‌ బాసర అనుష్టాన పరిషత్ సంస్థాపకులు. చూడాలి మరీ అక్షరాభ్యాసం వర్సెస్ బీజాక్షరంగా తెర పైకి వచ్చిన ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో‌..!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..