Vijayawada: భవానీ నామ స్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి.. అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు..

ఇంద్ర కీలాద్రిఫై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జగన్మాతకు చేస్తున్న ఉత్సవాలు నేటితో నాలుగో రోజుకు చేరాయి. ఇవాళ (గురువారం) అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు..

Vijayawada: భవానీ నామ స్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి.. అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు..
Indra Keeladri
Follow us

|

Updated on: Sep 29, 2022 | 9:59 AM

ఇంద్ర కీలాద్రిఫై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జగన్మాతకు చేస్తున్న ఉత్సవాలు నేటితో నాలుగో రోజుకు చేరాయి. ఇవాళ (గురువారం) అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యు లైన్స్ లో వేచి ఉన్నారు. అన్నపూర్ణా దేవి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తిగా ప్రతీతి. ఎడమ చేతిలో బంగారు పాత్రలో ఉన్న అమ్రుతాన్నమును వజ్రాలు పొదిగిన గరిటెతో తన పతి ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి గా దర్శనం ఇస్తున్నారు. దసరా ఉత్సవాలలో అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే అన్న పానీయాలకు కొదవ ఉండదని భక్తుల నమ్మకం. కాగా.. ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 1 లక్షా 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది. కనీసం లక్ష మందికి పైగా రానున్నారు. ఆదివారం మూలానక్షత్రం రోజున ఒకే రోజు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.

కాగా.. మూడో రోజైన బుధవారం దుర్గమ్మ గాయత్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజాము 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ రద్దీ కొనసాగింది. 60వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటి రోజు వివిధ సేవలు, టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలపై రూ.26 లక్షలు ఆదాయం వచ్చింది. రెండో రోజు ఆదాయం పెరిగి రూ.37లక్షలు సమకూరాయి. ఉత్సవాలకు తరలివచ్చే వృద్ధులు, దివ్యాంగులను స్వచ్ఛంద సేవకులు వీల్‌ ఛైర్లలో ఉంచి కొండపైకి తీసుకెళ్తున్నారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటున్న భక్తులు భక్తి తన్మయత్వంలో మునిగిపోతున్నారు.

కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి అమ్మవారు వరాన్ని కోరుకోమంది. కీలుడు అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, తన హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని ప్రార్థించాడు. నీవు అద్రి (కొండ) రూపంలో ఉండమని త్వరలోనే ఈ అద్రిపై స్వయంభువుగా ఆవిర్భవిస్తానని చెప్పింది. కీలుడు ఆనందభరితుడై అద్రిగా మారగా, కొంతకాలానికి దుర్మార్గుడైన దుర్గమాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా నిలిచింది. ఈ నగరమును పరిపాలిస్తున్న మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి కనకవర్షం కురిపించి, శ్రీకనకదుర్గాదేవిగా ఖ్యాతి గడించింది.

ఇవి కూడా చదవండి

కనకదుర్గా స్వరూపంగా అమ్మవారు అవతరించిన ఈ దివ్యమైన క్షేత్రంలో అర్జునునికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు కరుణను అనుగ్రహిస్తున్నాడు. పాశుపతాస్త్రాన్ని కోసం అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు. అర్జునుడి భుజబలాన్ని, మనోధైర్యాన్ని పరీక్షించాలని సతీ సమేతంగా పరమేశ్వరుడు కిరాతుని రూపాన్ని ధరించాడు. అర్జునునితో వాదించి, మల్లయుద్ధం గావించి అతని శక్తికి సంతోషించాడు. ప్రీతితో పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. కాగా.. అమ్మవారి ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి శ్రీ అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా వ్యవహరిస్తుండటం విశేషం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..