VK Sasikala: పొలిటికల్ రీ-ఎంట్రీ వర్కౌట్ అవుతుందా? చిన్నమ్మ నిర్ణయం వెనుక వ్యూహం ఇదేనా?
VK Sasikala: శశికళ పొలిటికల్ రీ-ఎంట్రీ... తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
శశికళ పొలిటికల్ రీ-ఎంట్రీ. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు శశికళ ప్రకటన చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే కొందరు రాజకీయ పండితులు మాత్రం శశికళ నిర్ణయం వెనుక వ్యూహం ఉందని విశ్లేషించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోవడం ఖాయం…ఓటమి తర్వాత అన్నాడీఎంకే నేతలందరూ మునిగిపోతున్న నావలాంటి పార్టీని కాపాడాలంటూ తన ఇంటి దగ్గర క్యూకట్టుతారని శశికళ భావించారు. ఆ పరిస్థితి ఎదురైతే మళ్లీ అన్నాడీఎంకే సారథ్య పగ్గాలను తనకు పళ్లెంలో పెట్టి ఇచ్చేస్తారన్నది చిన్నమ్మ యోచనగా ప్రచారం జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి అధికార పగ్గాలను సొంతం చేసుకున్న తర్వాత తొలిసారి శశికళ మళ్లీ తెరమీదకు వచ్చారు. కొందరు అన్నాడీఎంకే శ్రేణులతో మాట్లాడిన శశికళ…తన కళ్ల ఎదుటే పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. త్వరలోనే తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని శశికళ పేర్కొన్నట్లు ఆడియో రికార్డులు విడుదలయ్యాయి. శశికళ నిర్ణయం ముందే ఊహించిందే అయినా…ఎన్నికల తర్వాత ఇంత వేగంగా ఆమె పొలిటికల్ ఎంట్రీ నిర్ణయం తీసుకోవడం తమిళ రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేసే అంశమే. శశికళ నిర్ణయం ఇప్పుడు అన్నాడీఎంకే వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. శశికళను పార్టీలోకి తీసుకునే ప్రసక్తేలేదని కొందరు అన్నాడీఎంకే సీనియర్ నేతలు ప్రకటనలు చేస్తున్నా…శశికళ పొలిటికల్ రీ-ఎంట్రీ చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని చర్చించుకుంటున్నారు. పార్టీ నేతల మధ్య గందరగోళం సృష్టించి అన్నాడీఎంకేపై తిరిగి పట్టు సాధించేందుకు శశికళ వ్యూహాలుపన్నుతున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులు 2017లో దోషిగా కోర్టు తేల్చడంతో జైలుకెళ్లిన శశికళ…ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తిరిగి పార్టీపై పట్టు సాధించేందుకు ఆమె విఫలయత్నం చేశారు. అయితే అన్నాడీఎంకే నేతలు శశికళ వెంట నడిచేందుకు విముఖత చూపడంతో ఆమె ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజులకు ముందు తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు శశికళ ప్రకటించారు. ప్రస్తుతం పొలిటికల్ రీ ఎంట్రీ చేయాలని శశికళ తీసుకున్న నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేకి ఇప్పుడు పెద్ద దిక్కుగా మారిన ఎడపాటి కే.పళనిస్వామి, ఓ.పన్నీర్ సెల్వం మధ్య చాలాకాలంగానే పొసగడం లేదు. వీరిద్దరి మధ్య అగాధం పెరగడంతో అన్నాడీఎంకేపై తిరిగి పట్టు సాధించేందుకు ఇదే సరైన సమయమని శశికళ వర్గం భావిస్తోంది.
శశికళను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు పన్నీర్ సెల్వం సానుకూలంగా ఉన్నా…పళనిస్వామి ఇందుకు ససేమిరా అన్నట్లు ఎన్నికలకు ముందు ప్రచారం జరిగింది. శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌లకు పార్టీలోకి తీసుకుంటే ఇక తాము పార్టీలో మనుగడ సాధించలేమనే వారి ఎంట్రీని పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. పార్టీలో క్రమంగా బలహీనపడిపోతున్న పన్నీర్ సెల్వం… అన్నాడీఎంలో శశికళను తిరిగి చేర్చుకునేందుకు సుముఖంగానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావిస్తున్న శశికళ… తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జులై లేదా ఆగస్టు మాసంలో ఆమె పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పన్నీర్ సెల్వం వెంట ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పళనిస్వామి వెంటే ఉన్నారు. పళనిస్వామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం మధ్య ఆధిపత్య పోటీ నేపథ్యంలో శశికళకు పన్నీర్ వర్గం అండగా నిలిచే అవకాశం ఉందని తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శశికళ రీ ఎంట్రీ తర్వాత తమతో నడిచొచ్చే అన్నాడీఎంకే నేతలు ఎవరెవరన్న దానిపై శశికళ వర్గం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు సమాచారం. పన్నీర్ సెల్వం వర్గాన్ని లైట్ తీసుకుంటున్న శశికళ వర్గీయులు…పళనిస్వామి వర్గాన్ని టార్గెట్ చేసి పార్టీపై పట్టు సాధించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు.