కేశినేని కేంద్రంగా భగ్గుమంటున్న బెజవాడ టీడీపీ.. ఆతను కావాలో అందరూ కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం
ఎంపీ కేశినేని నాని కేంద్రంగా బెజవాడ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయాయి.. అతను కావాలో..

ఎపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసి, మున్సిపల్ ఎన్నికలకు తెరలేచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని కేంద్రంగా బెజవాడ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వరా?. రూట్ మ్యాప్ మార్చడానికి కేశినేని ఎవరని వారు ప్రశ్నించారు.
చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే.. మేం పాల్గొనం అంటూ కామెంట్ చేశారు. టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారా?. దమ్ముంటే కేశినేని ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవాలి. కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా?. కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు. రంగా హత్య కేసు నిందితులందరూ కేశినేని వెంటే ఉన్నారంటూ బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా విమర్శలు గుప్పించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు పొడసూపాయి. పార్టీ సీనియర్ నేత బోండా ఉమా నివాసంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల మీరా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ ఎంపిక విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కేశినేని రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్ మార్చడంపైనా గుర్రుగా ఉన్నారు.
కులాలమధ్య, పార్టీ నేతల మధ్య కేశినేని నాని చిచ్చు పెడుతున్నారన్నారు. వర్గాలను,విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడన్నారు. నిజంగా బెజవాడ పార్లమెంట్‌లో కేశినేనికి సత్తా ఉంటే… రాజీనామా చేసి… ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ సింబల్, చంద్రబాబును చూసి నీకు ఓట్లు వేశారన్నారు. నాని ఇండిపెండెంట్‌గా గెలిచి చూపిస్తే… కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతానని సవాల్ చేశారు. నాని ముఖ్యం అనుకుంటే… తాము రేపు జరుగబోయే చంద్రబాబు టూర్‌కు దూరంగా ఉంటామని హెచ్చరించారు.
ఇక విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. కేశినేని శ్రీనివాస్‌కు గద్దె రామ్మోహన్ వెంట ఉంటున్నారు. బొండా, బుద్దా, నాగుల్‌మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు ఇచ్చిన టిక్కెట్‌ను కేశినేని నాని మార్చేశారు. ఈ విషయమై బుద్ధా, మీరాలు పట్టుపట్టినా ఎంపీ ససేమిరా అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్ విషయంలోనూ అదే జరిగింది. పేదసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోలేకపోయినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు, జాతీయ కార్యదర్శి కూడా అయిన వర్ల రామయ్య తన అనుచరవర్గం వద్ద అంతర్గత చర్చల్లో వాపోయినట్లు సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎంపీ కేశినేని నాని ప్రవర్తన సరిగాలేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేస్తోంది తామని, పదవుల కోసం పనిచేస్తోంది కేశినేని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని కావాలో.. అందరూ కావాలో చంద్రబాబు తేల్చుకోవాలంటూ బొండా ఉమా అల్టిమేటం జారీ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజారాజ్యంలో ఇదే తరహాలో వ్యవహరించి బయటకు గెంటించుకున్నారన్నారు. విజయవాడ టీడీపీ తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారన్నారు.
Read More:
ఆ ఇద్దరిని ఉతికి ఆరేసిన కొడాలి నాని.. రాసిచ్చింది చదవడం తప్పా ఏమీ చేయలేరన్న మంత్రి
