విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబుపై చేసిన సంచలన వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు వర్ల రామయ్య కౌంటరిచ్చారు. కన్నా ఒక బుద్ధిలేని వ్యాఖ్య చేశారని మండిపడ్డారు. సీనియర్ నాయకులు అయ్యిండి అలా మాట్లాడకూడదని అన్నారు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, తమను నాశనం చేయడమే మోడీ గారి పని అని అన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ డబ్బు తరలిస్తున్నారో ఆ పోలీసుపై చర్యలు తీసుకోవాలని, తమకు అభ్యంతరం లేదని సవాల్ చేశారు.
కన్నా ఏమన్నారంటే.. సీఎం తిరిగేటువంటి హెలికాప్టర్‌లో డబ్బు తరలించబడుతుందని, డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇందుకు పోలీసులు కాపలా కాస్తున్నారని, టీడీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని కన్నా ఆరోపించారు. అయితే కన్నా వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు వర్ల రామయ్య స్పందిస్తూ బుద్ధిలేని వ్యాఖ్య అంటూ మండిపడ్డారు.