Komatireddy : ‘జగదీష్ రెడ్డి.. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు మంత్రి పదవికి నువ్వు అర్హుడివా…?’ : కోమటిరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలకు దిగారు. దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ శీతకన్ను వేస్తున్నారని చెప్పుకొచ్చిన..
Komatireddy venkata reddy – Bhuvanagiri MP : తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలకు దిగారు. దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ శీతకన్ను వేస్తున్నారని చెప్పుకొచ్చిన కోమటిరెడ్డి.. ప్రాజెక్టుకు రూ.100 కోట్లు తీసుకురాని మంత్రి ఉంటే ఎంత.. లేకుంటే ఎంత..? అంటూ జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేశారు. నేడు నల్గొండ పర్యటన అనంతరం ఆయన నార్కెట్‌పల్లి వివేరా హోటల్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.
దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తుంటే ప్రశ్నించాల్సిన మంత్రులు బానిస బతుకులు బతుకుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. 7 ఏళ్లు మంత్రిగా ఉండి 100 కోట్లు తీసుకురాలేని చేతకాని మంత్రి ఉండి ఎందుకుని దుయ్యబట్టారు. నిధులు ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని బీడుగా మారిస్తే ఎందుకు గొంతెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు.. మంత్రి పదవికి నువ్వు అర్హుడివా’ అని జగదీష్ రెడ్డిని కోమటిరెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో తిరగాలంటే భయంతో పోలీసుల పహారాలో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా కేంద్రం గెజిట్‌లు విడుదల చేస్తున్నా.. కేసీఆర్ స్పందించడం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.