TRS EC Meeting: ఇవాళ TRS కార్యనిర్వాహక భేటీ.. పార్టీ కార్యాలయాల పురోగతిపై సమీక్ష
TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అధ్యక్షతన ఆ పార్టీ కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ
TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అధ్యక్షతన ఆ పార్టీ కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ సభ్యత్వాల డిజిటలైజేషన్, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంకు రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
TRS అధినేత, CM KCR ఆదేశంతో 2021-23కి సంబంధించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి మార్చిలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత కమిటీల నిర్మాణం, ఏప్రిల్ 27న పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేలా షెడ్యూల్ ప్రకటించారు. అయితే శాసనమండలిలో పట్టభద్రుల కోటా ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ తదితర కారణాలతో సభ్యత్వ నమోదుతోపాటు సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి కాలేదు.
మరోవైపు 2019 జూలై 27న అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ చేసినా ఇప్పటివరకు సిద్దిపేట మినహా ఇతర జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభం కాలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి వసంత్ విహార్ ఏరియాలో భూమి కేటాయించినా శంకుస్థాపన వాయిదా పడుతూ వస్తోంది. బుధవారం జరిగే సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి సమీక్ష జరగనుంది.