ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళా సామ్రాజ్ఞి రజియా సుల్తాన్‌ సమాధిపై గందరగోళం!

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలకు ఇస్తున్న గౌరవ మర్యాదాలు, వారికి కల్పిస్తున్న సత్కారాలు, స్థానాల గురించి కాదిప్పుడు చర్చ! భారతదేశపు మొట్టమొదటి మహిళా చక్రవర్తిని ఎంతగా గుర్తించుకున్నామన్నదే ప్రశ్న!

ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళా సామ్రాజ్ఞి రజియా సుల్తాన్‌ సమాధిపై గందరగోళం!
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2021 | 11:55 AM

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలకు ఇస్తున్న గౌరవ మర్యాదాలు, వారికి కల్పిస్తున్న సత్కారాలు, స్థానాల గురించి కాదిప్పుడు చర్చ! భారతదేశపు మొట్టమొదటి మహిళా చక్రవర్తిని ఎంతగా గుర్తించుకున్నామన్నదే ప్రశ్న! ఆమెకు చరిత్రకారులు ఇచ్చిన స్పేస్‌ గురించే ప్రశ్న! ఆమె సమాధిపై ఎందుకింత గందరగోళమన్నదే ప్రశ్న! విస్మరణకు గురైన రజియా సుల్తాన్‌ను కనీసం మహిళా దినోత్సవ సందర్భంగానైనా గుర్తు తెచ్చుకుందాం! రజియా సుల్తాన్‌- ఢిల్లీ కేంద్రంగా సగానికి సగం భారతావనిని పాలించిన యోధురాలు. భారతదేశ చరిత్రలో తొలి మహిళా పాలకురాలు. మధ్యయుగ కాలం నాటి పురుషాధిక్యతను ధిక్కరించిన వీర వనిత. సుపరిపాలనతో ప్రజామోదాన్ని సంపాదించుకున్న పాలనాదక్షురాలు. కుట్రలు-కుతంత్రాలను ఛేదించిన రాజకీయ దురంధురాలు. ఇంతటి ధీమంతురాలిని చరిత్ర విస్మరించడం విస్మయం గొలిపే అంశం. ఆమెపై పరిశోధకులు ఆసక్తి కనబర్చకపోవడం ఆశ్చర్యం. ఇప్పటి వరకు ఆమె సమాధిని కూడా గుర్తించలేకపోవడం విషాదం.. ఇంతకీ ఎవరీ రజియా సుల్తాన్‌… ? ఏమిటామె ప్రత్యేకత ..?

ఆమె దాదాపు ఉత్తర భారతావని మొత్తాన్ని ఏలిన మహారాణి. భారతదేశ చరిత్రలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళా సామ్రాజ్ఞి. ఆమెలో ధైర్యసాహసాలు అపారం. పరిపాలనాదక్షత ఆమోఘం. ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యం అద్వితీయం. ఆమె రజియా సుల్తానాగా జగత్ప్రసిద్ధి గాంచిన జులాలత్‌ ఉద్దీన్‌ రజియా…! క్రీస్తుశకం 1236 నుంచి 1240 వరకు నాలుగేళ్ల పాటు ఢిల్లీ గద్దెపై కూర్చొని సుమారు సగం భారతదేశాన్ని పరిపాలించింది. సెల్జుక్‌ వంశానికి చెందిన రజియా అటు టర్కిష్‌ చరిత్రలోనూ ఇటు ముస్లిం చరిత్రలోనూ ప్రథమ మహిళా చక్రవర్తిగా పేరుగాంచింది. రజియా తండ్రి షంషుద్దీన్‌ అల్తమష్‌. ఈయనను ఇల్‌టుట్‌ మిష్‌ అని కూడా అంటారు. మామూలుగా అయితే చరిత్రలో ఈయనకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు.. కాకపోతే రజియా తండ్రిగా తనకంటూ కొన్ని పుటలను కేటాయించుకోగలిగాడు. ఆ కాలంలో ఓ మహిళను సుల్తాన్‌గా ప్రకటించడం ఓ సాహసమే! ఆ సాహసానికి ఇల్‌టుట్‌మిష్‌ ఒడిగట్టారు కాబట్టే ఆయనకూ పేరొచ్చింది. రాచరికంలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సుల్తానా అవ్వడానికి రజియాకు అన్ని అర్హతలూ ఉన్నాయి. పైగా ప్రజాభిమానం మెండుగా ఉండింది. ప్రజలు ఆమెను తమ పాలకురాలిగా గుర్తించారు. పేరుకు రాజు కూతురే కానీ. ఏనాడూ ఆమె అలా ప్రవర్తించలేదు. అసలు అంత:పుర యువతుల్లా ఉండేది కాదు. ప్రజల మధ్య ప్రజలలో ఒకరిగా ఉండేది. తన తండ్రి కాలంలో తండ్రితోనే వుంటూ రాజవ్యవహారాలను చక్కగా వంటబట్టించుకున్నది. పురుషునివలె దుస్తులు ధరించేది. సైనికుని వలె తిరిగింది. యుద్ధాలలో తానే నాయకత్వం వహిస్తూ వచ్చింది. రాజతంత్రాలలో ఆరితేరింది. పాలనాయంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుంది. ఆమె ఓ ధీరోదాత్త మహిళ. కత్తియుద్ధంలో సాటి. సైనిక విద్యలో మేటి. గుర్రపుస్వారీలో ఘనాపాటి. విలువిద్యలో ఆమెకు లేదెవ్వరు పోటి.

రజియా జనరంజకమైన పాలనను అందించింది.. ముస్లిమేతరులపై భారాలను మోపకండి అంటూ మహ్మద్‌ ప్రవక్త చెప్పిన సూత్రాన్ని పాటించింది.. ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది. ప్రజాక్షేమానికే ఆమె మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజల మధ్యనే తిరుగుతూ, ప్రజలతో మమేకం అయ్యింది. పరమత సహనం ఆమెను ప్రజాభిమానాన్ని చూరగొనేలా చేసింది.. ఎన్నో విద్యాసంస్థలను, పరిశోధనా కేంద్రాలను, గ్రంథాలయాలను స్థాపించింది.. రజియాను ఎవరైనా సుల్తానా అని పిలిస్తే కోపగించుకునేది. సుల్తాన్‌ భార్యను సుల్తానా అంటారని, తననెప్పుడూ సుల్తాన్‌ అనే పిలవాలని ఆదేశించేది. ఇంతటి మహాపరాక్రమవంతురాలు, మహా యోధురాలిని చరిత్ర ఎందుకు విస్మరించింది..? ఆమె చరిత్ర ఆమె సమాధితోనే ఎందుకు సమాధి అయ్యింది..? ఆమె మరణం ఇంకా ఎందుకు మిస్టరీగానే ఉంది..? ఆమె ప్రేమకథ నిజమేనా..? కల్పితగాధా..? ఆమె సమాధి విషయంలో చరిత్ర పరిశోధకులు ఎందుకంత గందరగోళంలో ఉన్నారు..? అసలు రజియా సుల్తాన్‌ సమాధి ఎక్కడుంది..? ఢిల్లీలోనా…? రాజస్థాన్‌లోనా…? హర్యానాలోనా…?

మొదటి మహిళా చక్రవర్తికి ఎందుకింత దుస్థితి..? మహిళ అయినందువల్లే చరిత్ర ఆమెను విస్మరించిందా..? అంటే దురదృష్టవశాత్తూ అవుననే సమాధానం ఇవ్వవలసి వస్తుంది.. అసలు ఆమె సింహాసనాన్ని అధిష్టించడం చాలా మందికి ఇష్టం లేదు. అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. గద్దె నుంచి దించడానికి ఎన్నో కుట్రలు చేశారు. అప్పటి పురుషాధిక్యత సమాజంలో అవరోధాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది.. అగడ్తలన్నింటినీ దాటగలిగింది.. నాలుగేళ్ల పాలనతో నవశకానికి నాంది పలికింది.. రజియా సుల్తాన్‌ యుద్ధంలో వీర మరణం చెందిందో.. కుట్రలకు బలయ్యిందో తెలియదు కానీ ఆమె సమాధి విషయంలో మాత్రం ఇంకా గందరగోళమే! పాత ఢిల్లీలోని తుర్క్‌మన్‌ గేట్‌ ప్రాంతంలో రజియా సమాధి ఉందంటోంది ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌.. పురావస్తుశాఖ కూడా అది రజియా సమాధేనని కచ్చితంగా చెప్పడం లేదు.. కావచ్చు..కాకపోవచ్చుననే సందిగ్ధావస్తలో పురావస్తుశాఖ ఉంది. రజియా సమాధి ఉన్న ప్రాంతానికి చేరుకోవడం ఒకింత కష్టమే! ఎందుకంటే అక్కడ తొలి మహిళ సామ్రాజ్ఞి దీర్ఘ నిద్రలో శయనిస్తోందన్న విషయం చాలా మందికి తెలియదు.. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. రజియా మీద ఆసక్తి, అనురక్తి ఉన్న కొందరు మాత్రం వచ్చిపోతూ ఉంటారు. ఇరుకిరుకు సందులు. ఆ సందుల్లో ఎన్నో మలుపులు. అసలు అక్కడో స్మృతి చిహ్నం ఉంటుందని ఎవరూ అనుకోరు. అలా వెళుతూ ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ బోర్డు ఒకటి కనిపిస్తుంది. ఆ ప్రాంతం పురావస్తుశాఖ అధీనంలో ఉందని సూచించే బోర్డు అది. ఆ పక్కనే చిన్న గేటు. ఆ గేటులోపల నుంచి వెళితే కనిపిస్తుంది రజియా సుల్తాన్‌ సమాధి. ఓ పక్కన మసీదు. మూడు వైపులా అపార్ట్‌మెంట్లు.. పావురాళ్ల చప్పుళ్లు.. అసలక్కడ జనవాసాలకు ప్రభుత్వం, పురావస్తుశాఖ ఎలా అనుమతి ఇచ్చిందో అర్థం కానీ పరిస్థితి. ప్రభుత్వాల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఓ మహిళ చక్రవర్తికి ప్రభుత్వాలు ఇస్తున్న గౌరవ మర్యాదాలేమిటో సమాధి దుస్థితి చూస్తే అర్థమవుతుంది..

రజియా స్మృతి చెరిగిపోనిది. ఆమె సమాధిపై పర్చుకున్న రాతిపలకల్లాగే! సుమారు ఎనిమిది శతాబ్దాలుగా అవి అలాగే ఉన్నాయి. చెక్కు చెదరకుండా..! ఆధునిక మహిళలకు రజియా ఇచ్చిన స్ఫూర్తిలాగే! ఇక్కడ ఉన్నవి రెండు సమాధులు. ఒకటి రజియాది అయితే మరో సమాధి ఎవరిది ? పురావస్తు శాఖ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే అది షాజియా అనే మహిళది! ఆమె ఎవరు..? రజియాతో పాటే ఆమె మరణించిందంటే అత్యంత సన్నిహితురాలే అయి ఉంటుంది. ఒకవేళ సోదరుల దాష్టికానికి బలయ్యిందంటే వాళ్లే షాజియాను కూడా మట్టుపెట్టి ఉండాలి. ఇద్దరినీ ఇక్కడే ఖననం చేసి ఉండాలి. షాజియాను రజియా సోదరిగా ప్రేమించిందా..? ఏమో! షాజియా గురించి చరిత్ర పుస్తకాల్లో పెద్దగా ప్రస్తావన లేదు కానీ.. కమల్‌ అమ్రోహి తీసిన రజియా సుల్తానా సినిమాలో మాత్రం షాజియా పాత్ర ఉంటుంది. రజియాకు ఆమె నెచ్చెలి.. ఒక్క మాటలో చెప్పాలంటే నెచ్చెలి కంటే ఎక్కువే! చరిత్ర అసంపూర్ణంగా ఉన్నప్పుడు, అక్కడక్కడ ఖాళీలు ఉన్నప్పుడు వాటిని ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా.. తమకు తోచిన విధంగా పూరించుకుంటుంటారు.. ఇక్కడా అదే జరిగి ఉంటుంది.. రజియా సర్వస్వతంత్రురాలైన ఓ మహిళా రాణి.. ఆమెకు ఓ తోడు కావాలి.. తన అంతరంగాన్ని ఆవిష్కరించుకోవడానికి ఓ సహచరి కావాలి.. బహుశా షాజియా ఆ భూమికను పోషించిందేమో! అక్కడే దూరంగా మరో రెండు చిన్న సమాధులున్నాయి. అవి చిన్న పిల్లలవన్నది స్థానికుల కథనం. కథనం కాదు వారి నమ్మకం. రజియా సమాధి దగ్గర చిన్నారులవి ఎందుకు ఉన్నాయి..? ఆమెకు పిల్లలు లేరు కదా! అంటే స్పష్టమైన సమాధానం దొరకదు.. పైగా రజియా సమాధి పక్కన ఉన్నది యాకూత్‌దేనన్నది కొంతమంది వాదన! యాకూత్‌ది కాదు.. షాజియాదే అంటోంది పురావస్తుశాఖ! ఏది సత్యం..? ఏది అసత్యం..? ఈ అయోమయాన్ని నివృత్తి చేసేది ఎవరు?

ఢిల్లీలోని తుర్క్‌మన్‌ గేట్‌ దగ్గర ఉన్నది రజియా సమాధి అయితే, మరి హర్యానాలోని ఖైతల్‌ పట్టణంలో ఉన్నది ఎవరిది? ఇది రజియా సుల్తాన్‌దేనంటారు కొందరు చరిత్రకారులు. స్థానికుల విశ్వాసం కూడా ఇదే! ఇక్కడ జరిగిన యుద్ధంలో ఆమె అసువులు బాసిందట! ఆమెను ఇక్కడే ఖననం చేశారట! చాలా మందికి తెలియని విషయమిది అంటారు కొందరు చరిత్రకారులు. నిజంగానే అది రజియాసమాధి అయితే మాత్రం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను నిందించకుండా ఉండలేం. ప్రభుత్వాలే కాదు. పురావస్తుశాఖ అధికారులు, చివరకు స్థానికులు కూడా రజియా సమాధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పక్కనే మురుగు కాలువ. పూర్తిగా శిథిలమైన గోడలు. ఒకప్పుడు ఇక్కడ ప్రార్థనలు జరిగేవట! చుట్టూ ఉద్యానవనం.. మధ్యలో రజియా సమాధి. నగిషీలతో కూడిన గోడలు.. కళాత్మకత ఉట్టిపడే నిర్మాణం.. చాలా గొప్పగా ఉండేదట! కాలక్రమంలో దీన్ని పట్టించుకోవడం మానేశారట! ఇప్పుడు రజియా సమాధి ఒక పాడుపడిన నిర్మాణం. మొండి గోడలు. పిచ్చి మొక్కలతో భీతిగొలిపే ప్రదేశం. మధ్యయుగకాల సమాజంలో మహిళలపై ఎన్నో నిర్బంధాలు. ఎన్నో కట్టుబాట్లు. అలాంటిది రజియా రాజ్యభారాన్ని తీసుకోవడం. శాసనకర్తగా ఉండటం ఊహకు కూడా అందని విషయం.. అది కూడా ఓ ముస్లిం వర్గం నుంచి వచ్చిన మహిళ ఈ స్థాయికి చేరుకోవడం అపూర్వం. అద్భుతం. అలాంటి రజియా సుల్తాన్‌కు మనమిస్తున్న గౌరవమేమిటన్నదే ప్రశ్న! పరిశోధనలో నిజంగానే ఇక్కడున్నది రజియా సమాధి అని తేలితే మాత్రం దీన్ని ఓ పర్యాటక కేంద్రంగా మలచాలన్నది స్థానికుల కోరిక. ఆ ప్రయత్నాలకు హర్యానా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కానీ ఏవో అవాంతరాలు..

రాజస్తాన్‌లోని టోంక్‌ జిల్లా. గంజ్‌ షాహిద్‌ పట్టణం. ఆ పట్టణంలోని పాతబస్తీలో దర్యా రిజర్వాయర్‌.. అక్కడే రజియా సుల్తాన్‌ సమాధి ఉందన్నది స్థానికుల బలమైన నమ్మకం. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం కూడా ఇదే. ఈ సమాధి పరిస్థితి కూడా అంతే! విశాలమైన ఆవరణలో సమాధి ఉన్నప్పటికీ చుట్టూ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు. శిథిలావస్థలో ఉన్న సమాధి. అప్పటికే తీవ్ర గాయాల బారిన పడిన తన ప్రియుడు యాకూత్‌తో కలిసి రజియా శత్రువుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా, ఆభరణాల కోసం దోపిడి దొంగలు రజియాను యాకూత్‌ను చంపేశారన్నది ఇక్కడి జనశ్రుతి. చనిపోయిన దగ్గరే ఇద్దరిని సమాధి చేశారట! ఇది కచ్చితంగా రజియా సమాధేనని చెబుతారు ఇక్కడి వాళ్లు. ఇందులో పలు అనుమానాలు. పలు సందేహాలు. రజియా, యాకూత్‌లు ఇద్దరూ పరాక్రమవంతులే! వెన్నుచూపని వీరులే! దారికాచిన దొంగలను మట్టుపెట్టలేరా..? యుద్ధం నుంచి ఎందుకు పారిపోవలసి వచ్చింది..? అసలు యాకూత్‌ నిజంగానే ఉన్నాడా..? కల్పిత గాధనా..? రజియా కోసం అల్లిన ప్రేమకథనా..? కేవలం రజియా విషయంలోనే ఎందుకిన్ని వైరుధ్యాలు. ఇన్నేసి భిన్న వాదనలు ఎందుకు? భారతదేశపు మొదటి మహిళా చక్రవర్తిని చరిత్రకారులు ఎందుకు విస్మరించారు..? ఎందుకు చిన్నచూపు చూశారు..? చరిత్ర పుటల్లో ఈమె కోసం కేటాయించింది అర పుట మాత్రమే!

అసలు రజియా చరిత్రే ఓ ప్రహేళిక. కొంత సత్యం. మరికొంత అర్థసత్యం. ఇంకొంత కల్పితం. అందుకే అంత అయోమయం! చరిత్రను పరికిస్తే ఎన్నో కోణాలు. అల్తమష్‌ మొదట తన కుమారుడు రుక్నుద్దీన్‌ ఫిరోజ్‌షాకే పట్టాభిషేకం చేశాడట! అల్తమష్‌ భార్య షాహ్‌ తుక్రాన్‌ తన కుమారుడిని డమ్మీని చేసి తానే రాజ్యపాలన చేసేదట! రుక్నుద్దీన్‌ అంత తెలివైనవాడేమీ కాదట! పైగా అన్ని వ్యసనాలు ఉన్నాయట! తల్లికొడుకులిద్దరూ కలిసి ప్రజలను హింసించారట! వివిధ రకాల పన్నులతో పీడించారట! ఆరు నెలల అతగాడి పాలనలో ప్రజలలలో అశాంతి అలజడి నెలకొన్నాయట! నవంబర్‌ తొమ్మిది, 1236న షాన్‌ తుక్రాన్‌, రుక్నుద్దీన్‌లిద్దరిని ప్రజలు చంపేశారట! ఈ విషయంలో కూడా చరిత్రకారుల్లో క్లారిటీ లేదు.. రజియా సుల్తాన్‌ మరణంపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది. రజియా సలహాదారులలో జమాలుద్దీన్‌ యాకూత్‌ ముఖ్యుడు. ఓ రకంగా వ్యక్తిగత కార్యదర్శి వంటివాడు. ఈయన అబిసీనియస్‌ బానిస. కాకపోతే మహా వీరుడు. గుర్రపు స్వారీలో తిరుగులేని మొనగాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలయ్యింది. యాకూత్‌కు రజియా దగ్గరవ్వడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. రజియాకు వ్యతిరేకంగా కుట్రలు మొదలు పెట్టారు. భటిండా గవర్నర్‌ మాలిక్‌ ఇక్తియారుద్దీన్‌ అల్తూనియా ఈ కుట్రలో ప్రధాన భాగస్వామి అయ్యాడు. రజియా-అల్తూనియా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.. ఈ యుద్ధంలో యాకూత్‌ కన్నుమూశాడు. రజియాను ఖైదు చేశారు. కొన్నాళ్లకు గత్యంతరం లేని పరిస్థితుల్లో అల్తూనియానే రజియా పెళ్లి చేసుకోవలసి వచ్చింది. తదనంతర కాలంలో రజియాకు సోదర వరుసైన మొహిజుద్దీన్‌ బహ్రామ్‌ షా ఢిల్లీపై దండెత్తాడు. ఆ యుద్ధమే అల్తూనియా-రజియాలకు చివరి యుద్ధమయ్యింది. అక్టోబర్‌ 14, 1240లో వీరమరణం చెందారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Women’s Day-Political Leaders: భారతీ రాజకీయ యవనికపై తమదైన ముద్రవేసి ప్రతిభావంతులుగా ప్రసిద్ధి గాంచిన మహిళలు

Kadaknath Chicken: కడక్‌నాథ్ చికెన్‌కు పెరుగుతున్న డిమాండ్.. హైదరాబాద్‌లో కేజీ ధర ఎంతంటే..?

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?