ఓ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నట్టు ఉంది.. కవులు, కళాకారుల మౌనం క్యాన్సర్ కంటే ప్రమాదకరమన్న రసమయి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్జెకట్టి ఆడిపాడి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన రమమయి బాలకిషన్ అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా..
మహబూబాబాద్: రసమయి బాలకిషన్.. తెలంగాణలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్జెకట్టి ఆడిపాడి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన రమమయి బాలకిషన్ అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. మానకొండూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాను చాలామందికి దూరమయ్యానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమని రసమయి వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ హోదాలో ఉన్న రసమయి ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మహబూబాబాద్‌లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో రసమయి పాల్గొన్నారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానని అన్నారు. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.