అంతా బాగుందన్న మోదీజీ… ఉద్యోగాలందుకు రాలేదు సర్ ?
మొన్నటి అమెరికా పర్యటన తర్వాత యావత్ ప్రపంచం మన వైపే చూస్తోంది.. ఎక్కడికెళ్లినా మన దేశం గురించే ఆలోచిస్తున్నా అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరి జీడీపీ ఎందుకు తగ్గుతోంది ? నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముందు గణాంకాలను చూద్దాం ఒక సారి. దేశంలో బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఈ ప్రభుత్వ విధానాల ఫలితంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు ఒకెత్తయితే.. చదువు పూర్తయి ఉద్యోగం కోసం […]
మొన్నటి అమెరికా పర్యటన తర్వాత యావత్ ప్రపంచం మన వైపే చూస్తోంది.. ఎక్కడికెళ్లినా మన దేశం గురించే ఆలోచిస్తున్నా అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరి జీడీపీ ఎందుకు తగ్గుతోంది ? నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముందు గణాంకాలను చూద్దాం ఒక సారి.
దేశంలో బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఈ ప్రభుత్వ విధానాల ఫలితంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు ఒకెత్తయితే.. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కోట్లాదిమంది క్యూలో ఉన్నారు. ఫలితంగా నిరుద్యోగం పెరుగుదల రేటు రికార్డుస్థాయికి చేరింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తాజా గణాంకాలే ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది ఆగస్టు నాటికి నిరుద్యోగం పెరుగుదల రేటు పదిశాతానికి చేరిందని ఆ సంస్థ తెలిపింది. నిరుద్యోగ జనాభా 4.17కోట్లకు చేరిందని నివేదిక సారాంశం. 2018లో నిరుద్యోగుల సంఖ్య 3.4కోట్లు. ఒక్క ఏడాదిలోనే కోటీ 13లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోతున్నదీ తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఎస్‌వో, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వంటి సంస్థలూ నిరుద్యోగ తీవ్రతను బయటపెట్టిన విషయం విదితమే. ఎన్‌ఎస్‌ఎస్‌వో నివేదిక బయటకు రాకుండా మోడీ ప్రభుత్వం చాలాకాలం తొక్కిపెట్టినా చివరికి బహిర్గతం చేయక తప్పలేదు. 2017-18లోనే నిరుద్యోగం పెరుగుదల 6.1శాతానికి చేరింది. 1972-73 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం నమోదు కావడం ఇదేనని నివేదిక తేల్చింది. 45ఏండ్లలో ఇది గరిష్టం. చివరికి దీనిని కేంద్రం అధికారికంగా అంగీకరించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత అయినా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యం.
మోడీ సర్కారు-2 కొలువు తీరాక యువత ఉపాధి అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. ఉద్యోగాలకు కోతలు పెట్టింది. మంజూరైన పోస్టుల్నీ భర్తీ చేయలేదు. 2014 ఎన్నికల్లో మోడీ చేసిన అతి ముఖ్యమైన హామీ ఉద్యోగాల కల్పనా.. ఉపాధి సష్టీ.. ప్రధాని చెప్పినట్టు ఏడాదికి రెండుకోట్ల మందికి ఉపాధి చూపించినట్టయితే ఈ ఐదేండ్లలో పదికోట్లమందికి ఉపాధి దొరకాలి. కానీ, కొత్తవి అటుంచితే ఉన్నవాటినే కోల్పోవాల్సిన దుస్థితి. ‘2018 నవంబరు 30 నాటికి ఎంప్లాయిమెంట్‌లో నమోదు చేసుకున్న వారి సంఖ్య 36లక్షలు. వారిలో 33.9లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 26లక్షల మంది సర్టిఫికెట్లు పొందారు. వారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు’ అని ఈ ఏడాది జనవరి ఏడున లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్రం తెలిపింది. మరొక సమాచారం ప్రకారం 2018 ఆగస్టు నాటికి పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన చూసినా కోటి మందిలో ఇంతవరకు పది లక్షలు అంటే పది శాతం కూడా నెరవేరలేదన్నది ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. మేకిన్ ఇండియా అంటూ ఊదరగొట్టినా అదీ పత్తా లేకుండా పోయింది. పైగా చాలామందికి ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పడం విచిత్రం. ఎన్‌ఎస్‌ఎస్‌వో నివేదిక లెక్కల్ని పక్కదారి పట్టించేందుకు పకోడీలు అమ్ముకున్నా ఉపాధి కల్పనే అన్నట్టు మోడీ మాట్లాడటం కంటే దుర్మార్గం మరోటిలేదు. ఉద్యోగాల కల్పనలో వైఫల్యం స్పష్టంగా కనిపించినా వాస్తవాన్ని బయటపడనీయకుండా సాకులు చెప్పేందుకు సిద్ధమైంది. మొదట్నుంచీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాలే నిరుద్యోగుల ఈ దుర్గతికి మూలహేతువు.
రూపాయి పతనం, అంచనాలకందని వృద్ధిరేటు, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థలతో ఆర్థికరంగం ప్రమాదంలోకి నెట్టబడింది. దీనికితోడు ఆర్థిక మందగమనం పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి రెండు పెనుభూతాల వల్ల అత్యధికంగా పనులు కల్పించే చిన్న ఉత్పత్తి రంగం కునారిల్లింది. ఉపాధిపై కోత పడింది. కోట్లాదిమందికి ఉపాధీ కరువైంది. కనీస వేతనాలు అమలుగాక పోవడం, నిజవేతనాల్లో తగ్గుదలతో ప్రజల కొనుగోలుశక్తి తగ్గింది. డిమాండ్ తగ్గిపోయి వినిమయ సరుకుల ఉత్పత్తి రంగం బాగా దెబ్బతిన్నది. ఆటోమొబైల్ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయింది. దీనికారణంగా పరిశ్రమల మూత, ఉత్పత్తి కుదింపుతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి దేశ ఆర్థిక మాంద్యాన్ని మరింత తీవ్రం చేసింది. ఇంత సంక్షోభ సమయంలోనూ ప్రజల కొనుగోలుశక్తిని పెంచేలా గాకుండా పెట్టుబడిదారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటన్నది తెలుస్తూనే ఉన్నది.
రానున్న ఐదేండ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థను రూ.350లక్షల కోట్ల (5ట్రిలియన్ డాలర్లు) లక్ష్యంతో ఒడ్డుకు చేరుస్తామంటున్న కేంద్రం.. ప్రస్తుతం సంపన్న వర్గాలను ఒడ్డుకు చేర్చి, పేద బలహీనులందరినీ ముంచే ప్రయత్నంలో ఉన్నది. ఇంతకాలం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల విక్రయానికి సిద్ధమైంది. ఇప్పటికే కొన్నింటిని అమ్మేందుకు ఒప్పందాలు చేసుకున్నది. కార్పొరేట్లకు పలు రాయితీలు కల్పించింది. వారికోసం రిజర్వు బ్యాంకు మూలధనం నుంచి రూ.1.76లక్షల కోట్లను గుంజుకుంది. మళ్లీ 30వేల కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. విదేశీపెట్టుబడుదారుల కోసం ద్వారాలు తెరిచింది. వారికి కావల్సినన్ని సౌకర్యాలు ఇస్తామంటున్నది. వీటిద్వారా దేశాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఏ రకంగా ఉపాధి అవకాశాలు సృష్టిస్తారన్నది ప్రశ్న. ఇదంతా నవభారత్ ఆవిష్కరణలో భాగమేనని మోడీ చెబుతుండటం యువతను వంచించడమే. ఇప్పటికైనా యువత మేల్కొని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం చాలా ఉంది.