విజయవాడ: ప్రజల నుంచి తనకు వస్తున్న స్పందన చూస్తుంటే..టీడీపీ ప్రభుత్వంపై, స్థానిక ఎంపీపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్ధమవుందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ వి పొట్లూరి. వాళ్లు చూపిస్తున్న ప్రేమకు ఎలా రుణం తీర్చుకోవాలో తనకు తెలియడం లేదన్నారు. నియోజకవర్గం అంతా విసృత పర్యటన చేస్తున్న ఆయన..నిన్న విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పదే..పదే బిజినెస్‌మేన్ అంటూ తనపై చేస్తున్న ప్రచారంపై ఘాటుగా స్పందించారు పీవీపి. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైద్రాబాద్‌లో బిజినెస్‌లు లేవా అని ప్రశ్నించారు. బ్రతకడానికి మాత్రమే వ్యాపారం చేస్తున్నాను కాని ప్రజల బ్రతుకుల మీద వ్యాపారం చేయడం తనకు తెలియదన్నారు. కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన తనపై తప్పుడు ప్రచారం చేస్తుంటే బాధ వేస్తుందన్నారు. విజయవాడను ఫన్ సిటీగా మార్చి..బెస్ట్ నగరంగా గుర్తింపు వచ్చే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు.
రానున్న ఎన్నికల్లో సిఎంగా జగన్‌ని ప్రజలు ఎప్పుడో ఫిక్సయ్యారని.. ఎన్నికల తేదీ కోసం వెయిట్ చేస్తున్నారని పీవీపి అన్నారు. విజయవాడ అభివృద్దిలో భాగం కావడానికి తనకో అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.