ఏపీలో జరగనున్న ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఒక్కడిగానే పార్టీ స్థాపించి.. పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా చూసుకుంటున్నాడు. మెగా క్యాంప్ సాయాన్ని అయితే ఇప్పటివరకు తీసుకోలేదు పవన్ కళ్యాణ్. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. కాసింత ప్రచారానికి అయినా మెగా హీరోలు వస్తారా అని అనుకుంటున్న అభిమానులకు నో అనే సమాధానమే పార్టీలో వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే పూర్వం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వేళ. అన్న వెనక పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించి.. చిరంజీవి తరపున పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయ సంచలనానికి తెర తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. చిరంజీవికి అంతగా అండగా నిలిచిన పవన్ కు.. ఇప్పటివరకు మెగా క్యాంప్ నుంచి సాయం అందలేదు. కాగా అప్పట్లో మెగా హీరోలు ప్రచారం చేస్తారని మీడియాలో ఊహాగానాలు వినిపించినా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి అవేమి జరగదని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారం జోరందుకోవడం.. ముగియడానికి మరో రెండు వారాల సమయం ఉండడంతో.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల బట్టి మెగా హీరోలందరూ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారని దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే అని సమాచారం. అటు పవన్ సోదరుడు నాగబాబు ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఆయన తరపున కుమారుడు హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేస్తాడనుకుంటే.. ఆయన ప్రచారానికి దూరంగా ఉండనున్నారని వినికిడి. తాజాగా ఆయన నటించనున్న సినిమా షూటింగ్ కోసం విదేశాలు వెళ్ళటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మెగా క్యాంప్ ను దిశానిర్దేశం చేసే చిరంజీవి సూచన మేరకు మెగా హీరోలంతా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకుని చిరంజీవి.. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ మెగా హీరోలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఏమేరకు ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపుతారో వేచి చూడాల్సిందే.