Priyanka Gandhi Vadra: కేంద్రం చేతగానితనంతోనే ఆక్సిజన్ సంక్షోభం.. మోదీ సర్కారుపై ప్రియాంక విసుర్లు
Priyanka Gandhi Vadra: దేశంలో ఆక్సిజన్ కొరత నెలకొంటున్నా ముందస్తుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
Priyanka Gandhi on Oxygen Crisis: కొవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో కరోనా రోగులు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవటానికి కేంద్రానికి ముందుచూపు లేకపోవడమే కారణమని ధ్వజమెత్తారు. 2020లో కేంద్ర ప్రభుత్వం మునుపటి సంవత్సరం కంటే 700శాతం ఎక్కువగా ఆక్సిజన్ ఎగుమతి చేసిందని ఆరోపించారు. ఇందులో అత్యధికంగా బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసినట్లు ఆమె తెలిపారు. విదేశాలకు ఆక్సిజన్ ఎగుమతులను భారీగా పెంచినందునే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ బెడ్స్ కోసం ప్రజలు సోషల్ మీడియాను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఫేస్ బుక్‌లో ఆమె ఓ పోస్ట్ చేశారు.
ఆక్సిజన్ కొరతతో చాలా మంది మరణించారని గుర్తుచేసిన ప్రియాంక గాంధీ..తమ కుటుంబ సభ్యలు ఆక్సిజన్ అందక మరణిస్తుంటే పక్కనే ఉన్నా ఏమీ చేయలేక నిశ్చేష్టులుగా చాలా మంది ఉండిపోయారన్నారు. దేశ వ్యాప్తంగా హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ కొరతకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. భారత దేశం ఆక్సిజన్ కొరత ఉన్న దేశం కాదన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1950, 1960లలో ఉక్కు పరిశ్రమలను ప్రోత్సహించడంతో దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు.
దేశంలో ఆక్సిజన్ కొరత నెలకొంటున్నా ముందస్తుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
అంగారకుడిపై నావిగేషన్ లోపంతో చిక్కుల్లో పడ్డ నాసా హెలికాప్టర్.. సరిదిద్దిన ఇంజనీర్లు
ముందస్తు బెయిల్ నిరాకరించినా..నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండొచ్చు..సుప్రీం కోర్టు