Cabinet Expansion: కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ముస్తాబవుతున్న రాష్ట్రపతి భవన్

కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Cabinet Expansion: కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ముస్తాబవుతున్న రాష్ట్రపతి భవన్
కేంద్ర కేబినెట్‌‌ విస్తరణలో భాగంగా కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురికి బెర్త్‌లు ఖరారైనట్టు క్లారిటీ వచ్చింది. వారిలో ముగ్గురికి ప్రమోషన్‌ కల్పిస్తూ.. కేబినెట్‌ హోదా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బెర్త్‌లు ఖరారైన వారిలో.. విజయ్‌ షోంకర్‌, అశ్విని వైష్ణవ్‌, ఆర్‌సీపీ సింగ్‌, పసుపతి పరాస్‌, కపిల్‌ పాటిల్‌, మహారాష్ట్ర మజీ సీఎం నారాయణ రాణె, శాంతనూ ఠాకూర్‌, ప్రీతమ్‌ ముండే, సునితా దుగ్గల్‌, శోభా కరన్‌, అజయ్‌ భట్‌, అనుప్రియా పాటెల్‌, ‌భూపెంద్ర యాదవ్‌, పురుషోత్తం రూపాలే, మీనాక్షి లేఖి, వరుణ్‌ గాంధీ పేర్లు ఉన్నాయి.
Balaraju Goud

|

Jul 07, 2021 | 12:07 PM

Union Cabinet Expansion: కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కి సమాచారం అందింది. ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. గత శని, ఆదివారాల్లోనే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందికి ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్‌ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్‌ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. కొద్ది కాలంగా యోగి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. దీంతో అక్కడ పార్టీని, ప్రభుత్వాన్ని చక్కదిద్దేందుకు మంత్రివర్గంలో ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం ముగ్గురు నుంచి ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షమైన అప్నాదళ్‌ నుంచి ఆ పార్టీ చీఫ్‌ అనుప్రియా పటేల్‌కు, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా, ఎంపీ రాకేష్‌ సింగ్‌లకు ఛాన్స్‌ ఎక్కువగా ఉంది.

తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో మరొకరికి ప్రాతినిధ్యం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్‌ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్‌ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్‌ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ , జీవీఎల్‌ నరసింహారావులలో జీవీఎల్‌కుగానీ, టీజీ వెంకటేష్‌కుగానీ చోటు దక్కొచ్చని తెలుస్తోంది.

ఇప్పటికే ఎక్కువ అవకాశాలున్న వారంతా దిల్లీకి చేరుకుంటున్నారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌తో పాటు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఎక్కువ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో యూపీ నుంచి ఉన్న 9 మందిలో నలుగురైదుగురికి స్థానచలనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. రీటా బహుగుణ జోషికి ఛాన్స్‌ వస్తే అదే సామాజికవర్గానికి చెందిన నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండేకి ఉద్వాసన ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

యూపీ నుంచి అవకాశం దక్కే అవకాశాలున్నవారిలో జోషితో పాటు, అజయ్‌మిశ్ర, సకల్‌దీప్‌ రాజ్‌భర్‌, పంకజ్‌ చౌదరి, రాంశంకర్‌ కతేరియా, వరుణ్‌గాంధీ, రాజ్‌వీర్‌సింగ్‌, అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మాయావతి, ప్రియాంక గాంధీ వంటి మహిళా నేతలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కేబినెట్‌ నుంచి తప్పించి, యూపీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు- ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారనే ప్రచారం నడుమ లోక్‌జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఓ హెచ్చరిక జారీ చేశారు. తన పార్టీ నుంచి బహిష్కృతుడైన పశుపతి పరాస్‌కు తన పార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వొద్దని గట్టిగా చెప్పారు. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇస్తే తాను కోర్టులో సవాల్ చేస్తానన్నారు. చిరాగ్ పాశ్వాన్ బాబాయి పశుపతి నాథ్ పరాస్‌కు మోదీ మంత్రివర్గంలో చోటు దక్కబోతున్నట్లు వార్తలు రావడంతో చిరాగ్ ఘాటుగా స్పందించారు. ఎల్‌జేపీ కోటా నుంచి పరాస్‌కు మంత్రి పదవి ఇవ్వొద్దని కోరారు. ఆయన ఎల్‌జేపీ నుంచి బహిష్కృతుడయ్యారని తెలిపారు. చిరాగ్ మంగళవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడారు.

Read Also… Pollution Control Board: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయానికి తెలంగాణ అధికారుల తాళాలు.. కారణం అదేనా..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu